(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) : సాధారణంగా చాలా మందికి ఇంటి కొనుగోలు అనేది జీవితకాలంలో చేసే అత్యంత పెద్ద పెట్టుబడి. సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు .. ప్రభుత్వం ఇంటి ధరలను అందుబాటు స్థాయిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, గృహ రుణ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికీ చాలా మందికి సంక్లిష్టమైనదిగానే ఉంది. పట్టణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రేట్ల ప్రకారం... ఇల్లు కొనాలంటే భారీ మొత్తమే కావాలి.
ఇంటి రేటుకు, మంజూరైన గృహ రుణానికి పొంతనే లేని పరిస్థితి చాలా మందికి ఎదురవుతుంటుంది కూడా. మరి అప్పుడేం చేయాలి? కాస్తంత ఎక్కువ మొత్తం రుణం పొందే అవకాశం లేదా? లేకేం... దీనికీ ఒక పరిష్కార మార్గం ఉంది. అదేంటంటే.. కో–అప్లికెంట్‌తో కలిసి దరఖాస్తు చేసుకోవటం. దీనివల్ల మరింత రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరి ఆదాయాన్ని కలపడం వల్ల మొత్తం ఆదాయ పరిమాణం పెరిగి .. రుణ అర్హత కూడా పెరుగుతుంది. రీపేమెంట్ సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. సంయుక్తంగా గృహ రుణాలు తీసుకుంటే ఉండే లాభాలేంటో ఒకసారి చూద్దాం...
రుణ అర్హత పెరుగుతుంది
దరఖాస్తుదారు ఆదాయాన్ని బట్టి రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేసిన మీదటే రుణం మంజూరవుతుంది. సహ దరఖాస్తుదారు కూడా చేరడం వల్ల ఆదాయ పరిమాణం పెరిగి, మరింత ఎక్కువ రుణం పొందే వీలుంటుంది. జాయింట్ హోమ్ లోన్‌లో ఇదే పెద్ద ప్రయోజనం. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు దరఖాస్తుదారులందరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి కాబట్టి రుణ అర్హత కూడా పెరుగుతుంది. రుణ అర్హత గణనీయంగా పెరగడం వల్ల.. పెరిగే మీ కుటుంబ అవసరాలకు సరిపడేటువంటి మరింత పెద్ద ఇంటిని కొనుగోలు చేయడానికి వీలవుతుంది.
రీపేమెంట్ బాధ్యతలు చెరి సగం..: సహ దరఖాస్తుదారుతో హోమ్‌లోన్ తీసుకుంటే మొత్తం రుణం రీపేమెంట్ కూడా ఇద్దరూ కలిసి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రుణ భారం అంతా ఒక్కరి పైనే పడకుండా కాస్త భారం తగ్గుతుంది. జాయింట్ హోమ్ లోన్‌తో అధిక ప్రయోజనాలు ఉన్నట్లే.. కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కో–అప్లికెంట్‌పై కూడా ఉంటుంది.
పన్ను ప్రయోజనాలు
సహ దరఖాస్తుదారులిద్దరికి కూడా గృహ రుణానికి సంబంధించిన పన్నుపరమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయ పన్ను సెక్షన్ 80సీ కింద గృహ రుణం అసలులో రూ. 1.5 లక్షల దాకా, అటు సెక్షన్ 24 కింద రూ. 2 లక్షల దాకా ట్యాక్స్ రిబేట్ పొందేందుకు వీలుంది. అయితే ప్రాపర్టీ నిర్మాణం పూర్తయ్యాక మాత్రమే గృహ రుణ వడ్డీ, అసలు చెల్లింపులపై పన్ను ప్రయోజనాలు పొందడానికి వీలవుతుంది. ఒకవేళ జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే.. దరఖాస్తుదారులిద్దరూ కూడా రీపేమెంట్‌లో తమ వంతు వాటా వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. దీని గురించి ట్యాక్స్ కన్సల్టెంట్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదిస్తే.. మరింత సమాచారం పొందవచ్చు.
యాజమాన్య బదిలీ సులభతరం..
పై ప్రయోజనాలతో పాటు ఒకవేళ ఏవైనా అనూహ్య పరిస్థితుల కారణంగా .. ప్రాపర్టీని కో–అప్లికెంట్ పేరు మీదికి మార్చాల్సి వచ్చినా, కూడా జాయింట్ హోమ్‌లోన్ కారణంగా సదరు ప్రక్రియ సులభతరమవుతుంది. సాధారణంగా జీవిత భాగస్వామే వారసులుగా ఉంటారు కాబట్టి ప్రాపర్టీని జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం శ్రేయస్కరం. దీనివల్ల భవిష్యత్‌లో ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
మహిళా కో–అప్లికెంట్‌తో ప్రయోజనాలు..
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. సహ దరఖాస్తుదారు మహిళ అయిన పక్షంలో కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీని కూడా తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు.. ఢిల్లీలో దరఖాస్తుదారు మహిళ అయితే స్టాంప్ డ్యూటీ 4 శాతం కాగా.. పురుష దరఖాస్తుదారుకు 6 శాతంగా ఉంటోంది. అదే దంపతులైతే ఇది 5 శాతం.
కో అప్లికెంట్‌గా ఎవరు..
ఇక.. సహ దరఖాస్తుదారులుగా ఎవరిని చూపించవచ్చనే ప్రశ్న తలెత్తుతుంది. దేశీయంగా భార్యా..భర్త, తండ్రి..కొడుకు (చాలా సంతానముంటే ప్రాథమిక యజమానిగా ఉండే కుమారుడు), లేదా తండ్రి.. అవివాహిత అయిన కుమార్తె (ప్రాథమికంగా ఓనర్‌గా ఉండాలి), సోదరులు (కో–ఓన్డ్ ప్రాపర్టీ అయితే), వ్యాపారవేత్తలు.. తమ కంపెనీలను సహ దరఖాస్తుదారులుగా చూపించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment