
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు గత అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం పెరిగినట్టు క్రెడాయ్–కొలియర్స్–లైసస్ ఫొరాస్ సంయుక్త నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 10 శాతం పెరగ్గా.. అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 31 శాతం ఎగసినట్టు తెలిపింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. బలమైన డిమాండ్‌కుతోడు అధిక నిర్మాణ వ్యయాలు ధరలు పెరగడానికి దారితీసినట్టు పేర్కొంది. వరుసగా 16వ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరలు పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. విశాలమైన ఇళ్లు, మెరుగైన జీవనశైలికి ప్రాధాన్యం వంటివి హౌసింగ్ డిమాండ్‌ను పెంచినట్టు క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. నిర్మాణ వ్యయాలు, భూమి కొనుగోలు ధరలు పెరగడం ధరలకు ఆజ్యం పోసినట్టు చెప్పారు.
రేట్ల తగ్గింపుతో విక్రయాలకు ఊతం
టాప్–8 నగరాల్లో ఈ ఏడాది కూడా ఇళ్ల ధరలు పెరుగుతాయని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ అంచనా వేశారు. ‘రానున్న రోజుల్లో బెంచ్‌మార్క్ రుణ రేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయి. దీంతో చాలా పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు పుంజుకోవచ్చు. దీంతో ఇళ్ల ధరలు గతంలో మాదిరే 2025లోనూ పెరిగే అవకాశం ఉంది’ అని యాగ్నిక్ వివరించారు. అందుబాటు ధరల ఇళ్లు, మధ్యస్థ ధరల విభాగంలో ఇళ్ల సరఫరా, విక్రయాలు రానున్న రోజుల్లో పెరగొచ్చని లైసస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ అంచనా వేశారు. డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు స్వల్పంగా తగ్గాయని, కొత్త ఇళ్ల ఆవిష్కరణ మోస్తరుగా ఉండడాన్ని కారణంగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జీసీసీలు @ రూ.8.72 లక్షల కోట్లు
పట్టణాల వారీగా ధరల పెరుగుదల
హైదరాబాద్‌లో 2024 అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌లో ఇళ్ల ధరలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం పెరిగాయి. చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) ధర రూ.11,351కి చేరింది.
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఎస్‌ఎఫ్‌టీ ధర 31 శాతం ఎగసి రూ.11,993కు చేరింది.
బెంగళూరులో 23 శాతం పెరిగి ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.12,238గా ఉంది.
అహ్మదాబాద్‌లో ధరలు 15 శాతం పెరగడంతో చదరపు అడుగు రూ.7,725కు చేరింది.
చెన్నైలో 6 శాతం వృద్ధితో ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.8,141గా ఉంది.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ధరలు 3 శాతం పెరగడంతో ఎస్‌ఎఫ్‌టీ రూ.20,725కు చేరింది.
పుణెలో ఇళ్ల ధరలు 9 శాతం పెరిగాయి. ఎస్‌ఎఫ్‌టీ రూ.9,982గా నమోదైంది.
కోల్‌కతాలో అతి తక్కువగా ఒక శాతం ధర పెరగడంతో ఎస్‌ఎఫ్‌టీ రూ.7,971కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment