
సొంతంగా అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసి చాలామంది అద్దెలతోనే రూ.వేలు సంపాదిస్తున్నారు. విభిన్న రంగాల్లో తాము సంపాదించిన డబ్బంతా రియల్టీలో పెట్టుబడిగా పెట్టి రెగ్యులర్ ఇన్‌కమ్‌గా మలుచుకుంటున్నారు. తమ స్థాయికి తగినట్లు దాదాపు చాలామంది ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. అలాంటివారిలో ప్రముఖ భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఏమీ తీసిపోలేదు. ముంబయిలోని లోయర్ పరేల్‌లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఇటీవల నెలకు రూ.2.6 లక్షలకు లీజుకు ఇచ్చారు. జనవరి 2025లో నమోదైన ఈ రియల్టీ లావాదేవీకి సంబంధించిన వివరాలను స్క్వేర్ యార్డ్స్ విడుదల చేసింది.
ప్రైమ్ లొకేషన్, ప్రీమియం సౌకర్యాలు
మాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ (లోధా గ్రూప్) అభివృద్ధి చేసిన హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘లోధా మార్క్విస్-ది పార్క్’లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), నారిమన్ పాయింట్ వంటి ప్రధాన వ్యాపార ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో భారీగా డిమాండ్ ఏర్పడింది. రోహిత్ శర్మకు చెందిన ఈ ప్రాపర్టీలో 1,298 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, రెండు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. రోహిత్, అతని తండ్రి గురునాథ్ శర్మ 2013 మార్చిలో రూ.5.46 కోట్లకు ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ వివరాల ప్రకారం ప్రస్తుత అద్దె ఆదాయం నెలకు రూ.2.6 లక్షలుగా ఉంది. ఇది 6 శాతం అద్దె రాబడిని ప్రతిబింబిస్తుంది.
లోధా మార్క్విస్-ది పార్క్‌లో శర్మ కుటుంబానికి ఉన్న ఆస్తి ఇది ఒక్కటి మాత్రమే కాదు. మరో అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేశారు. దీన్ని 2024 అక్టోబర్‌లో నెలకు రూ.2.65 లక్షలకు అద్దెకు ఇచ్చారు. ఇది ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులను హైలైట్ చేస్తుంది.
ఇదీ చదవండి: రోజూ రెండు కోట్ల మంది భక్తులు.. అంతరాయంలేని కనెక్టివిటీ!
ముంబయి స్థిరాస్తి మార్కెట్ ఎదుగుదలకు కారణాలు..
ముంబయి భౌగోళిక పరిమితులు రియల్టీ రంగాన్ని భారీగా పెంచుతున్నాయి. ఒక వైపు అరేబియా సముద్రం ఉండడం, మరోవైపు విస్తరణకు పరిమిత భూమి ఉండడం ప్రాపర్టీ ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ప్రధాన ఆర్థిక కేంద్రంగా, మెరుగైన ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణాలను కోరుకునే ప్రజలను ముంబయి ఆకర్షిస్తుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) వంటి అనేక బహుళజాతి సంస్థలు, ఆర్థిక సంస్థలకు పుట్టినిల్లు ముంబయి. వృత్తి నిపుణులు, విద్యార్థులు, ప్రవాసుల రాక కారణంగా అద్దె ఆస్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దక్షిణ ముంబయి, బాంద్రా, అంధేరి, పొవాయ్ వంటి ప్రాంతాల్లో అద్దె భారీగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment