నాలుగేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును ఆర్‌బీఐ 0.40 శాతం పెంచడం ఆలస్యం.. వరుసగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణ రేట్ల పెంపును అమల్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా 2020 నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగాయి. మంచి క్రెడిట్ స్కోరుతో మూడు నెలల క్రితం బ్యాంకును సంప్రదించి ఉంటే 6.5 శాతానికే గృహరుణం లభించేది. కానీ, ఇప్పుడు వెళ్లి అడిగితే 6.9–7 శాతం కంటే చౌక ఆఫర్ వినిపించకపోవచ్చు. ప్రముఖ గృహ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సైతం రుణ రేట్లను 7–7.45 శాతానికి పెంచింది.
ఎస్‌బీఐ సహా ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా రేట్లను సవరించాయి. రుణాల రేట్లే కాదు డిపాజిట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో గృహ రుణం తీసుకోవాలని భావించే వారు ఇప్పుడు అప్రమ్తతం కావాలి. ఎందుకంటే గత ఏడాది కాలంలో మంజూరు చేసిన రుణాల్లో సగానికి సగం రెపో రేటు ఆధారితమే. కనుక రెపోతో పాటు రెపో రుణ రేట్లు కూడా వెనువెంటనే సవరణకు లోనవుతాయి. ఇది రుణ గ్రహీతలకు భారంగా మారుతుంది. కనుక గృహ రుణ గ్రహీతలు ఈ తరుణంలో ఏది చేస్తే బావుంటుంది..? నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయి..?
వేచి చూస్తే లాభం లేదు..
వడ్డీ రేటు తక్కువకు లభిస్తుందేమో..? అని వేచి చూడడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటున్న వేళ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం అసాధ్యం. రానున్న ఏడాది కాలంలో పలు విడతలుగా ఆర్‌బీఐ కీలక రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రెండు, మూడో ఇల్లు కొనుగోలు చేస్తుంటే కనుక వేచి చూస్తానంటే అది వేరే విషయం. కానీ, మొదటి ఇల్లు సమకూర్చుకోవాలన్నది మీ ప్రాధాన్య జాబితాలో ఉంటే వెంటనే గృహ రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే రైట్. ఇక్కడ గృహ రుణ రేటే కాదు.. ప్రాపర్టీ రేటు కూడా చూడాలి. కరోనా సంక్షోభానంతరం రియల్టీ మార్కెట్లో ధరలు పడిపోయి అక్కడి నుంచి కోలుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. కనుక ప్రాపర్టీ ధరలతో ముడిపెట్టి గృహ రుణ రేటును చూడాలి.
వేచి చూస్తే ప్రాపర్టీ ధరలు దిగొస్తాయా..? లేక రెక్కలు విప్పుకుంటాయా..? ఎవరు చెప్పగలరు. ఆలస్యం చేస్తే ముందు ముందు మరింత అధిక రేటుపై రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రతి 10 బేసిస్ పాయింట్లు (అంటే 0.1 శాతం) రుణ రేటు పెరిగితే రూ.లక్షపై ఒక ఏడాదికి పడే అదనపు భారం రూ.100. రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే అప్పుడు రూ.5000 భారం అవుతుంది. కనుక మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారు రుణదాతలతో సంప్రదింపులు చేయడం వల్ల కనిష్ట రేటుపై గృహ రుణం లభించే అవకాశం లేకపోలేదు. రుణ రేట్లను తగ్గించే అధికారం అందరికీ ఉండదు. బ్యాంకు హోంశాఖ లేదంటే ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్‌ను ఈ విషయమై సంప్రదించొచ్చు. ఫోన్ కాల్స్‌తో రుణ రేట్ల గురించి బేరమాడడం ఫలితాలనివ్వదు. మరోవైపు కమోడిటీల మంటలతో నిర్మాణ వ్యయాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ భారాన్ని ఇళ్ల విక్రయధరలతో డెవలపర్లు సర్దుబాటు చేసుకోవాల్సిందే. అందుకే ఆలస్యం చేస్తే రెండు విధాలుగా భారం పడొచ్చు.
రుణ కాలవ్యవధి
గృహ రుణం తీసుకునే సమయంలో సాధారణంగా ఈఎంఐ(ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్) ఎంతన్నది చూసి చెల్లించగలిగే సామర్థ్యం ఆధారంగా కాలవ్యవధిని నిర్ణయించుకుంటూ ఉంటారు. తక్కువ టర్మ్ పెట్టుకుంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించాలి. అప్పుడు వడ్డీ భారం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ కాల వ్యవధిని నిర్ణయించుకోవడం వల్ల ఈఎంఐ భారం తగ్గినట్టు అనిపించొచ్చు. కానీ, దీర్ఘకాలంలో వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం పెరిగిపోతుంది. అయితే, ఎంత గృహ రుణం తీసుకోవాలి, ఈఎంఐ ఎంత నిర్ణయించుకోవాలన్నది అంత సులభంగా తేలే అంశం కాదు. కచ్చితంగా నిపుణుల సాయం తీసుకోవడం మంచిది.
ఇక్కడ పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా చూడాలి. రిటైర్మెంట్‌కు ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది? చెల్లింపుల సామర్థ్యం, ఇతర జీవిత లక్ష్యాలు, వాటికి సంబంధించి చేయాల్సిన కేటాయింపులు అన్నీ చూసుకున్న తర్వాత గృహ రుణాన్ని అనుకూలమైన కాలవ్యవధికి తీసుకోవాలి. నిపుణుల అవసరం వద్దనుకుంటే మధ్యే మార్గంగా మీడియం టర్మ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 6.99 శాతం వడ్డీ రేటుపై తీసుకుంటే పదేళ్ల టర్మ్‌లో చెల్లించే వడ్డీ రూ.19 లక్షలుగా ఉంటుంది. రుణ కాలాన్ని 20 ఏళ్లకు పెంచుకుంటే చెల్లించే వడ్డీ మొత్తం రూ.43 లక్షలు. కనుక వెసులుబాటు ఉంటే అధిక ఈఎంఐను నిర్ణయించుకోవడమే సరైనది. ఒకవేళ టర్మ్ ఎక్కువ పెట్టుకున్నా.. వెసులుబాటు ఉన్నప్పుడల్లా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం మంచి ఐడియా.
లోన్ టు వ్యాల్యూ
ప్రాపర్టీ విలువలో బ్యాంకు మంజూరు చేసే రుణాన్ని లోన్ టు వ్యాల్యూ (ఎల్‌టీవీ)గా చెబుతారు. సాధారణంగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 60–65 శాతం వరకు రుణంగా మంజూరు చేస్తుంటాయి. అదే ఎన్‌బీఎఫ్‌సీలు అయితే ఇంకొంచెం రిస్క్ చేసి 75 శాతం వరకు రుణంగా ఇస్తాయి. మిగిలిన మేర రుణ గ్రహీత స్వయంగా సమకూర్చుకోవాలి. ఉదాహరణకు రూ.1.50 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తున్నారనుకుంటే.. బ్యాంకులు రుణదాత వంతుగా రూ.60 లక్షలు సమకూర్చుకోవాలని కోరొచ్చు. బ్యాంకులు కొంచెం అధికంగా ఇచ్చినా.. రుణదాత తనవైపు నుంచి వీలైనంత అధిక భాగాన్ని సమకూర్చుకుని, మిగిలిన మేరే బ్యాంకు నుంచి తీసుకోవడం మంచిది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ముఖ్యంగా రుణ రేట్లు పెరిగే కాలంలో రుణ గ్రహీతలు తమ భాగం ఎక్కువ ఉండేలా చూసుకోవడం ఒక మార్గం. లేదంటే అధిక పన్ను శ్లాబు (30 శాతం) పరిధిలోకి వచ్చి.. భారీగా ఆదాయపన్ను కడుతూ ఎక్కువ ఆదా చేసుకోవాలని అనుకునే వారు బ్యాంకులు ఇచ్చే గరిష్ట ఎల్‌టీవీవైపే మొగ్గు చూపించడం మంచిది. దీనివల్ల వడ్డీకి చేసే చెల్లింపులు, అసలుపై క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది.
ఫిక్స్‌డ్ టెన్యూర్
దాదాపు చాలా బ్యాంకులు గృహ రుణాలను రెపో రేట్లతో అనుసంధానించాయి. రెపోను ఆర్‌బీఐ 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన తర్వాత పలు బ్యాంకులు రెపో ఆధారిత రుణ రేటును పెంచాయి. రెపో రేటు మార్పునకు లోనైతే త్రైమాసికం వారీగా గృహ రుణ రేటు కూడా సవరణకు లోను కావచ్చు. బ్యాంకులు రెపో రేటు సవరణను వెంటనే ఆచరణలో పెట్టే విధంగా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కనుక ఇక మీదట వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో గృహ రుణ రేట్లు కూడా ఆ మేరకు సవరణకు లోనవుతాయి. ఇది రుణాలు తీసుకున్న వారి నగదు ప్రవాహాలపై ప్రభావం చూపిస్తుంది. ఫ్లోటింగ్ రుణంలో సహజం గానే ఈ రిస్క్ ఉంటుంది. ఫిక్స్‌డ్ రేటు రుణాలను ఇప్పుడు బ్యాంకులు దాదాపుగా ఆఫర్ చేయడం లేదు. చేస్తే కనుక ఫిక్స్‌డ్ రేటుపై రుణం తీసుకోవడమే లాభదాయకం.
ఫ్లోటింగ్ రేటుకు వెళ్లాలా?
కొన్ని బ్యాంకులు 2–3 ఏళ్లపాటు ఫిక్స్‌డ్ రేటును, ఆ తర్వాత నుంచి ఫ్లోటింగ్ రేటును అమలు చేస్తున్నాయి. రుణ గ్రహీతపై ఒకేసారి భారం పెరగకుండా ఈ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఉదాహరణకు 15 ఏళ్ల గృహ రుణ కాలంలో మొదటి ఐదేళ్లు చేసే చెల్లింపుల్లో అధిక భాగం వడ్డీకే వెళుతుంది. కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని టైమ్‌బౌండ్ ఫిక్స్‌డ్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక ఫ్లోటింగ్ రేటు రుణానికే వెళ్లాలా? అన్నది నిర్ణయించుకోవాలి. ఎన్‌బీఎఫ్‌సీలు టైమ్‌బౌండ్ ఫిక్స్‌డ్ రేటు విధానంపై రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఒకవేళ కొనుగోలు చేసే ప్రాపర్టీ ధర రూ.2–3 కోట్లు అంతకుమించి ఉండి, లోన్ వ్యాల్యూ రూ.1.5 కోట్లకు పైన ఉంటే బ్యాంకులు సైతం టైమ్‌బౌండ్ ఫిక్స్‌డ్ రేటుపై ఆఫర్ చేయవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీలు, గృహ రుణ సంస్థల రుణ రేట్లు 25–35 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటాయి. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల రూపంలో తక్కువకే నిధుల లభ్యత ఉంటుంది. కనుక అవి కొంచెం తక్కువ రేటుకు రుణాలను ఇస్తుంటాయి. ఇది అటు బ్యాంకులు, ఇటు రుణ గ్రహీతలకూ మంచిదే. .
భారం దింపుకోవాలంటే..?
కొత్తగా రుణాలు తీసుకునే వారే కాకుండా.. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా బ్యాంకులు కొత్త రేట్లను అమలు చేస్తున్నాయి. మరి ఈ తరుణంలో గృహ రుణంపై పడే అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈఎంఐ పెరగకూడదని అనుకుంటే ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకోవాలి. ఈఎంఐ పెరిగినా ఫర్వాలేదు కట్టగలిగే స్వేచ్ఛ ఉందంటే అది కూడా నయమే. అదనంగా చెల్లించే వెసులుబాటు ఉందంటే.. అటువంటి వారు ఈఎంఐకి అదనంగా కొంత మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నిర్ణీత కాలవ్యవధికి ముందే గృహ రుణాన్ని ముగించేయవచ్చు. ఫలితంగా వడ్డీ రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. లేదంటే ప్రతి నెలా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం వల్ల.. భవిష్యత్తులో ఏవైనా కారణాల వల్ల ఆదాయం తగ్గినా.. కొంతకాలం పాటు ఉపాధి కోల్పోయినా పరిమిత కాలం పాటు తక్కువ ఈఎంఐ చెల్లించుకోవచ్చు. ఏటా సంస్థ ఇచ్చే బోనస్‌లు, ఇతరత్రా వచ్చే అదనపు ఆదాయాన్ని రుణ చెల్లింపులకు వినియోగించుకోవాలి.
టాపప్
రెండో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారు లేదంటే అప్పటికే సమకూర్చుకున్న ప్రాపర్టీ విస్తరణ కోరుకునే వారు ప్రస్తుత గృహ రుణానికి టాపప్ లోన్ తీసుకోవచ్చు. అది కూడా తక్కువ రేటుకే. సాధారణంగా ఇంటి నవీకరణ కోసం పొదుపు చేసుకున్న మొత్తాలను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. లేదంటే వ్యక్తిగత రుణానికి వెళ్లేవారు కూడా ఉన్నారు. వాటికి బదులు గృహ రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్‌లోన్ తీసుకోవచ్చు. టాపప్‌పై గృహ రుణం మాదిరే తక్కువ వడ్డీ రేటు అమలవుతుంది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఎక్కువగా హోమ్‌లోన్ టాపప్‌లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి.
కొన్ని బ్యాంకులు టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వీటిపై అప్పటికే తీసుకున్న గృహ రుణంతో పోలిస్తే 10–15 బేసిస్ పాయింట్లు అధిక రేటును అమలు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ప్రత్యేక రుణంగా పరిగణించి అధిక రేట్లను చార్జ్ చేస్తున్నాయి. అయినా, వ్యక్తిగత రుణ రేట్ల కంటే తక్కువే ఉన్నాయి. కనుక అవసరమైతేనే ఈ మార్గాన్ని పరిశీలించాలి. గృహ రుణం తీసుకున్న సమయంలోనే ఈ యాడాన్ లోన్ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే యాడాన్ రుణం తీసుకోకుండా ఫ్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో కావాల్సినప్పుడు వినియోగించుకునేందుకు రుణదాతలు అనుమతిస్తారు. ఒక్క ప్రాసెసింగ్ ఫీజు మినహా అదనంగా చెల్లించే పని ఉండదు. 10–15 బేసిస్ పాయింట్లు అధికంగా ఉన్నా సరే గృహ రుణం సమయంలోనే యాడాన్‌ను కూడా ఓకే చేసుకుని ఉంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment