ఎస్‌బీఐ గృహ రుణాలపై తగ్గే వడ్డీ రేటు 0.2 శాతమే
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేట్లు 20 బేసిస్ పాయింట్లే (0.2%, 100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 29న బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు(రెపో) అరశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.75 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో... తక్షణం ఎస్‌బీఐ తన బేస్ రేటును 40 బేసిస్ పాయింట్లు (9.3%కి) తగ్గించింది. దీనితో దీనికి అనుసంధానమైన ఆ బ్యాంక్ రుణ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గిపోతాయని పలువురు భావించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ తన స్థానిక ప్రధాన కార్యాలయాలకు జారీచేసిన ఒక సర్క్యులర్‌లో గృహ రుణాలపై 20 బేసిస్ పాయింట్ల తగ్గింపునే సూచించింది.
ఈ సర్క్యులర్ ప్రకారం... ఆర్‌బీఐ అరశాతం రెపో కోత నేపథ్యంలో కేవలం 20 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు ప్రయోజనం మాత్రమే బ్యాంక్ గృహ రుణ గ్రహీతలకు అందుతుందన్నమాట. దీంతో మహిళా కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేటు 9.7% నుంచి 9.5%కి, ఇతర కస్టమర్లకు 9.75% నుంచి 9.55% కి తగ్గుతుంది. ఈ రెండు రేట్లు బేస్ రేటుకంటే 20-25 బేసిస్ పాయింట్లు అధికం. కాగా తాజా నిర్ణయంపై బ్యాంక్ అధికారులు కొందరు వివరణ ఇస్తూ.. 2013 డిసెంబర్ నుంచీ 70 బేసిస్ పాయింట్లు బేస్ రేటు తగ్గితే.. గృహ రుణాలపై ఇప్పటికి 75 బేసిస్ పాయింట్లు రుణ రేటు తగ్గించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రుణాలపై రేటును బేస్ రేటుతో సమంగా తగ్గించలేదని వారు తెలిపారు.