వడ్డీలు తగ్గుతున్నాయ్‌... ఏం చేద్దాం! | Interest rates are falling | Sakshi
Sakshi News home page

వడ్డీలు తగ్గుతున్నాయ్‌... ఏం చేద్దాం!

Published Mon, Sep 25 2017 12:14 AM | Last Updated on Mon, Sep 25 2017 1:49 AM

Interest rates are falling

బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. కొద్ది నెలల కిందటే కోటి రూపాయల లోపు నగదు ఉండే పొదుపు ఖాతాలపై వడ్డీరేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించింది. ఆరేళ్లుగా 4 శాతంగా ఉన్న ఈ రేటును దిగ్గజ బ్యాంకే తగ్గించడంతో... మెజారిటీ బ్యాంకులూ ఇదే విధానాన్ని అనుసరించాయి. నిజానికి గడచిన మూడేళ్ల నుంచీ వడ్డీరేట్లు తగ్గుతూ వస్తున్నాయి. సేవింగ్స్‌ ఖాతాలపైనే కాదు. వివిధ కాల వ్యవధుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే రాబడి కూడా తగ్గిపోతోంది. మరి ఇలా తగ్గిపోవటానికి కారణాలేంటో తెలుసా?

ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా... 2014 అక్టోబర్‌ తరువాత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై తీసుకునే వడ్డీ రేటు ‘రెపో’ను ఏకంగా ఏడు సార్లు తగ్గించింది. దీంతో రెపో రేటు ప్రస్తుతం 6.25 శాతానికి దిగివచ్చింది. ఆర్‌బీఐ ఈ రేటును తగ్గిస్తే, ఈ ప్రయోజనాన్ని తన వద్ద రుణాలు తీసుకునేవారికి కూడా బ్యాంకులు వర్తింపజేయాలి. దీనితో వాటికి వచ్చే రాబడి తగ్గిపోతుంది. వాటికి రాబడి తగ్గుతుంది కాబట్టి, తమ వద్ద డిపాజిట్‌ చేసిన వారికీ తక్కువ వడ్డీ రేటే ఆఫర్‌ చేస్తాయి.

బ్యాంకులు ఇలా వడ్డీ రేట్లు తగ్గిస్తుండటంతో పొదుపు చేసేవారు పోస్టాఫీసులు, పీపీఎఫ్‌ల వంటి ఇతర సాధనాలకు మళ్లుతున్న నేపథ్యంలో, అక్కడ కూడా డిపాజిట్లపై వడ్డీ రేటు కోతకు ప్రభుత్వం పూనుకుంది. ఏతావాతా కేవలం వడ్డీలపై ఆధారపడి బ్రతుకుతున్న వారికి ఈ పరిణామమంతా ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయాలేవైనా ఉన్నాయా? అన్నదే ఇపుడు అందరినీ ఆలోచింపజేస్తున్న అంశం. వాటిపై అవగాహన కల్పించడానికే ఈ ప్రయత్నం.

చిన్న బ్యాంకులను చూడండి...
పెద్ద బ్యాంకులు రేటు తగ్గిస్తుంటే, పోటీని ఎదుర్కొనడానికి చిన్న చిన్న బ్యాంకులు మాత్రం కొన్ని షరతులకు లోబడి పొదుపు ఖాతాలపై ఇంకా అధిక రేటును ఆఫర్‌ చేస్తున్నాయి. ఉదాహరణకు డీబీఎస్‌ను చూస్తే, సగటు రోజు వారీ బ్యాలెన్స్‌ రూ.లక్ష వరకూ కొనసాగించే సేవింగ్స్‌ ఖాతాపై 7 శాతం రిటర్న్స్‌ను ఆఫర్‌ చేస్తోంది.రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ ఉంటే గనక ఈ రేటు 6 శాతంగా ఉంది. రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ సగటు రోజూవారీ బ్యాలెన్స్‌పై రేటు 5 శాతంగా ఉంది. మీకు డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంచుకుంటూ, మంచి వడ్డీ కావాలనుకుంటే, ఈ బ్యాంక్‌ తరహా పొదుపు ఖాతాను ఎంపిక చేసుకోవచ్చు.


లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే...
చాలా స్వల్ప కాలం కోసం పెట్టుబడులు పెట్టేందుకు లిక్విడ్‌ ఫండ్స్‌ అనువైనవి. అంటే మూడు నెలలకన్నా మించని కాలానికన్న మాట. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇవి కూడా ఒక రకం. ఈ ఫండ్స్‌ స్వల్పకాలిక డెట్‌ పేపర్లపై ఇన్వెస్ట్‌ చేస్తాయి. దీంతో ఒడిదుడుకులు, రిస్క్‌ తక్కువగా ఉంటుంది. లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే వార్షిక రాబడులు దాదాపు 7 శాతంగా ఉంటాయి. లిక్విడ్‌ ఫండ్స్‌ అన్నవి ప్రధానంగా సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్స్, ట్రెజరీ బిల్లులు, కర్మ్‌ డిపాజిట్లు, కమర్షియల్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి.

6 శాతం వడ్డీ రేటు వచ్చినా గానీ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు వాటిపై డివిడెండ్‌ పంపిణీ పన్ను కింద 28.3 శాతాన్ని చెల్లిస్తుంటాయి. పన్ను అనంతరం రాబడులను చూసుకుంటే 4.3 శాతం గిడుతుంది. ఒకవేళ ఫండ్‌ మేనేజర్‌ మరింత రాబడులను తీసుకురాగలిగితే, ఇన్వెస్టర్లకూ అదే స్థాయిలో రాబడులు వస్తాయి. ఎటువంటి ఎగ్జిట్‌ రుసుము భారం ఉండదు. విత్‌డ్రాయెల్స్‌ కోరుకుంటే ఒకటి, రెండు రోజుల్లో ఆ పనైపోతుంది. 2017 జూన్‌ నెలలో క్రిసిల్‌ ఏఎమ్‌ఎఫ్‌ఐ లిక్విడ్‌ ఫండ్‌  ఇండెక్స్‌ను పరిశీలిస్తే, ఏడాదిలో రిటర్న్స్‌ రేటు 6.83 శాతంగా ఉంది. అంతక్రితం మూడేళ్లు 8.37 శాతంకాగా, పదేళ్ల కాలంలో సగటు 7.76 శాతంగా ఉంది.

అక్రూయల్‌ ఫండ్స్‌లో పెడితే...
పదవీ విరమణ తీసుకున్న వారు పన్ను అనంతరం అధిక ఆదాయం సంపాదించాలనుకుంటే అక్రూయల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చుననేది ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సూచన. 20–30 శాతం పన్ను పరిధిలో ఉన్న విశ్రాంత ఉద్యోగులకు ఈ ఫండ్స్‌ అనువైనవి. అదే 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారు, ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వారికి బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అనుకూలమేనన్నది వారి సూచన.

అందుకే 20–30 శాతం పన్ను పరిధిలోని వారు అదనపు ఆదాయం కోసం అక్రూయల్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ ఫండ్‌లో ఏక మొత్తంగా ఇన్వెస్ట్‌ చేసి అదే సమయంలో క్రమానుగత ఉపసంహరణ విధానం (ఎస్‌డబ్ల్యూపీ) సెలక్ట్‌ చేసుకుటే సరిపోతుంది. దీంతో మీ పెట్టుబడిపై రాబడులను ఎప్పటికప్పుడు ఎస్‌డబ్ల్యూపీ ద్వారా బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. అసలు మొత్తాన్ని కదిలించరు. దీంతో ఇన్వెస్టర్‌కు క్రమం తప్పకుండా అదనపు ఆదాయం లభిస్తుంటుంది. అదే సమయంలో బ్యాంకు ఎఫ్‌డీతో పోలిస్తే పన్ను కూడా తక్కువే. కేవలం లాభంపైనే పన్ను పడుతుంది.

కార్పొరేట్‌ డిపాజిట్లు..
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఒకటి నుంచి ఐదేళ్ల కాలానికి ఈ డిపాజిట్‌ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లకన్నా అధిక వడ్డీరేటు గిట్టుబాటు కావటమే కాకుండా... సీనియర్‌ సిటిజన్ల విషయంలో మరిన్ని ప్రోత్సాహకాలూ అందుతున్నాయి. అయితే మీరు కార్పొరేట్‌ డిపాజిట్లకు వెళ్లేముందు ఆ సంస్థకు రేటింగ్‌ ఎంతన్నది మాత్రం తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. ‘ఏఏఏ’ లేదా ‘ఏఏ’ రేటింగ్‌ కంపెనీలనే డిపాజిట్లకు ఎంచుకోవాలి. తక్కువ రేటున్న కంపెనీలు చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయ్యే అవకాశం ఉంది.

నెలవారీ ఆదాయ పథకాలు...
ఇవి ఒకరకమైన బ్యాలెన్స్‌డ్‌ (సమతౌల్య) మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్స్‌. డెట్, ఈక్విటీ సెక్యూరిటీల్లో కలగలిపి ఇన్వెస్ట్‌ చేస్తాయి. కొంచెం రిస్క్‌ అయినా పర్వాలేదనుకునే యువ ఇన్వెస్టర్లకు ఇవి సానుకూలం. దాదాపు 10 శాతం రిటర్న్స్‌ వీటి ప్రత్యేకత. 2017 జూన్‌ క్రిసిల్‌ యాఫీ డెట్‌ ఫండ్‌ ఇండెక్స్‌ ప్రకారం,  ఏడాదికి 13.79 శాతం, మూడేళ్లకు 10.65 శాతం, ఐదేళ్లకు 11.26 శాతం, పదేళ్లకు 9.80 శాతం ఈ కేటగిరీలో రిటర్న్స్‌ లభించాయి. సిప్‌ ద్వారా ఈ పథకాల్లో పెట్టుబడులు మంచిది. డెట్‌ ఫండ్స్‌ తరహాలోనే ఎంఐపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనూ పన్ను భారాలు ఉంటాయి.

పోస్టాఫీసు పథకాలు...
డిజిటల్‌ యుగంలో పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ పట్ల ఆకర్షణ కొంత తగ్గినప్పటికీ, విశ్వసనీయ ఆర్థిక సేవలను మనం ఇక్కడ నుంచి పొందవచ్చు. ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్‌పై 7.7 శాతం వార్షిక వడ్డీ ఇక్కడ లభిస్తోంది. సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలకు 8.4 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనాలూ లభిస్తున్నాయి.

చిన్న పొదుపు పథకాలు
ఈ పొదుపు పథకాల నుంచి బ్యాంకుల కన్నా మంచి వడ్డీ రేటు ను పొందవచ్చు.  పబ్లిక్‌ ప్రావిడెం ట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) నుంచి 7.8% వడ్డీ లభిస్తోంది. పన్ను ప్రయోజ నాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్లకు ఇది అత్యుత్తమ సాధ నమని నిపుణులు అంటున్నారు.

గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా 8శాతం బాండ్‌
దాదాపు 2003 నుంచి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా 8 శాతం బాండ్‌ అమల్లో ఉంది. వార్షికంగా 8 శాతం రిటర్న్స్‌ ఇచ్చే ఈ బాండ్‌ ఆరేళ్ల కాలానికి వర్తిస్తుంది. మార్కెట్‌లో ట్రేడ్‌ కాదు. బాండ్‌పై వచ్చే ఆదాయంపై శ్లాబ్‌ మేరకు పన్ను విధించడం జరుగుతుంది. అయితే సురక్షిత బాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా దీనికి పేరుంది. దీర్ఘకాలానికి ఉద్దేశించిన ఫండ్‌ ఇది. రూ.1,000 కనీస మొత్తంతో ట్రేడింగ్‌ అకౌంట్లు లేదా జాతీయ బ్యాంకుల ద్వారా ఈ బాండ్‌లను పొందవచ్చు.

పేమెంట్‌ బ్యాంకులు...
ఇవి ఇటీవలే ప్రారంభమైన మొబైల్‌ పేమెంట్‌ బ్యాంకులు. డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. కస్టమర్లు తమ మొబైల్‌ నెంబర్‌ను వినియోగించుకుని కొత్త అకౌంట్లను సృష్టించుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. తమ అకౌంట్లకు సంబంధించి రూ. లక్ష వ్యక్తిగత ప్రమాద బీమానూ పొందవచ్చు.

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌...
స్వల్పకాలం నుంచి దీర్ఘకాలం వరకూ డిపాజిట్లు పెట్టేందుకు వీలైన వివిధ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్‌ డిపాజిట్లు, నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మనీ మార్కెట్‌ ఇన్ర్‌çస్టుమెంట్లు వంటి స్థిర ఆదాయం సెక్యూరిటీల్లో ఈ ఫండ్స్‌ పెట్టుబడులు పెడతాయి.

మార్కెట్‌ ఒడిదుడుకులను తట్టుకోడానికి క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్‌ఐపీ)లను ఎంచుకోవచ్చు. 2017 జూన్‌ క్రిసిల్‌ యాఫీ డెట్‌ ఫండ్‌ ఇండెక్స్‌ ప్రకారం,  ఏడాదికి 10.14 శాతం, మూడేళ్లకు 9.59 శాతం, ఐదేళ్లకు 9.04 శాతం, పదేళ్లకు 8.59 శాతం ఈ కేటగిరీలో రిటర్న్స్‌ లభించాయి. డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్‌ పన్నులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని ఒక్కసారి గమనించుకోవల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement