ఇక ఎస్‌బీఐ రుణాలు భారం
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వడ్డీరేట్ల మోత మోగించింది. దీంతో రుణాలు మరింత భారం కానున్నాయి. ఇదేసమయంలో రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లపైన కూడా వడ్డీరేటును పెంచడం గమనార్హం. బ్యాంక్ కనీస రుణ రేటు(బేస్ రేటు)ను 0.1 శాతం పెంచడంతో.. ఇది ఇప్పుడున్న 9.7 శాతం నుంచి 9.8 శాతానికి చేరినట్లు ఎస్‌బీఐ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్ష నేడు(శుక్రవారం) చేపట్టనున్న తరుణంలో ఒకరోజు ముందే వడ్డీరేట్ల పెంపును ఎస్‌బీఐ ప్రకటించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
రూపాయి పతనానికి చికిత్సలో భాగంగా ఆర్‌బీఐ ఈ ఏడాది జూలైలో ద్రవ్య సరఫరాను తగ్గించే చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంక్‌ల నిధుల లభ్యతకు సంబంధించిన స్వల్పకాలిక రేట్లు ఎగబాకాయి. ఈ పరిణామాల తర్వాత రుణాలపై వడ్డీరేట్లను పెంచిన తొలి బ్యాంక్ ఎస్‌బీఐ కావడం విశేషం. కాగా, ఆర్‌బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ తొలి పాలసీ సమీక్షలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీ(స్టిమ్యులస్)లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కఠిన పాలసీని కాస్త సడలించేందుకు(రేట్ల కోత) అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గృహ, వాహన రుణాలకు రెక్కలు...
బేస్ రేటుతోపాటు గృహ, వాహన రుణాలపై కూడా 0.2 శాతం వరకూ వడ్డీరేట్లను పెంచినట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. కొత్త రుణగ్రహీతలపై ఇది ప్రభావం చూపనుంది. అదేవిధంగా పాత విధానంలోని బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్(బీపీఎల్‌ఆర్) కింద తీసుకున్న రుణాలపై కూడా వడ్డీరేట్లను బ్యాంక్ పెంచింది. బీపీఎల్‌ఆర్ ఇప్పుడున్న 14.45% నుంచి 14.55 శాతానికి చేరింది. ఈ రేట్ల పెంపు గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. కాగా, రూ.30 లక్షల లోపు కొత్త గృహ రుణాలపై ఇప్పటిదాకా వడ్డీరేటు 9.95 శాతంగా ఉండగా.. ఇకపై ఇది 10.10 శాతానికి పెరగనుందని బ్యాంక్ సీనియర్ అధికారి వెల్లడించారు. వాహన గృహ రుణాలపై వడ్డీరేట్లు 10.75% వరకూ చేరనున్నట్లు తెలిపారు. బ్యాంక్‌కు నిధుల లభ్యత భారంగా మారడం, పండుగల సీజన్ నేపథ్యంలో ద్రవ్యసరఫరా పెంచాల్సి ఉండటంతో వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
డిపాజిట్లపై ఇలా...
రిటైల్ టర్మ్ డిపాజిట్ల విషయానికొస్తే 7 రోజులు, 179 రోజులు, 211 రోజులు, ఏడాది కంటే తక్కువ కాలావధిగల డిపాజిట్లపై ఒక్కో శాతం చొప్పున వడ్డీరేటు పెంచినట్లు ఎస్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ డిపాజిట్ రేట్లు 7.5 శాతానికి చేరాయని వివరించింది. ఇప్పటికే 7-8 బ్యాంకులు డిపాజిట్ రేట్లను పెంచడంతో నిధుల సమీకరణ పోటీ ఒత్తిళ్లు పెరిగాయని, దీంతో తాము కూడా ఈ రేట్లను పెంచాల్సి వచ్చినట్లు ఎస్‌బీఐ అధికారి పేర్కొన్నారు.