![Weakening rupee is squeezing corporate India](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/GDP-41.jpg.webp?itok=rloYGcGO)
కరెన్సీ విలువ క్షీణతపై ఆందోళన
గుదిబండగా విదేశీ వాణిజ్య రుణాలు
గత అప్పులకు అధికంగా చెల్లించాల్సి రావడమే కారణం
రూపాయి పతనంతో ధరలు పెరిగిపోయి సామాన్యులు పడే కష్టాలు అటుంచితే కార్పొరేట్లకు కూడా టెన్షన్ తప్పట్లేదు. ముఖ్యంగా విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకున్న కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. గత రుణాలను తీర్చేందుకు మరింత ఎక్కువగా చెల్లించాల్సి రానుండటమే ఇందుకు కారణం. సాధారణంగా కార్పొరేట్లు తమ వ్యాపార అవసరాల కోసం, దేశీయంగా వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంటే విదేశీ మార్కెట్ల నుంచి తక్కువ వడ్డీ రేటుపై రుణాలు తీసుకుంటూ ఉంటాయి.
చౌకగా వచ్చిన నిధులను వ్యాపార విస్తరణకు లేదా అధిక వడ్డీ రేటు మీద తీసుకున్న రుణాలను తీర్చేసేందుకు ఉపయోగించుకుంటూ ఉంటాయి. గత రెండేళ్లుగా మిగతా కరెన్సీలు ఒడిదుడుకులకు లోనవుతున్నా రూపాయి మాత్రం దాదాపు స్థిర స్థాయిలోనే కొనసాగింది. దీంతో కార్పొరేట్లు గణనీయంగా విదేశీ రుణాలు సమీకరించాయి. ఈ మధ్య సంగతే చూస్తే గతేడాది ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో నికరంగా 13.5 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు వచ్చినట్లు ఆర్‌బీఐ డేటా చెబుతోంది.
గతేడాది నవంబర్‌లో దాదాపు 2.83 బిలియన్ డాలర్ల ఈసీబీలను సమీకరించే ప్రతిపాదనలను కంపెనీలు సమరి్పంచాయి. రూపాయి విలువ పడిపోకుండా, స్థిరంగా ఉన్నన్నాళ్లూ విదేశీ రుణాల వ్యవహారం బాగానే ఉంటోంది. కానీ ఎక్కడా ఆగకుండా పడిపోతుంటేనే సమస్యాత్మకంగా మారుతోంది. ‘‘ఆర్‌బీఐ లెక్కలను బట్టి చూస్తే రూపాయి వేల్యుయేషన్ ఇప్పటికే అధిక స్థాయిలో ఉంది. దాని విలువ ఇంకా తగ్గాల్సి ఉంది. అమెరికా టారిఫ్‌లు విధిస్తే మరింతగా పడే అవకాశం ఉంది’’ అంటూ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కార్పొరేట్లకు రూపాయి బాధ ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి.
లాభాలపైనా.. సాధారణంగా విమానయాన సంస్థలు ఎయిర్‌క్రాఫ్ట్‌ల లీజింగ్‌లు, ఇంధన కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులను డాలర్ల మారకంలో నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రూపాయి పతనంతో ఎయిర్‌లైన్స్ ఖర్చులూ పెరిగిపోయి లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు ఇండిగోను తీసుకుంటే ఇటీవలి మూడో త్రైమాసికంలో లాభం ఏకంగా 18 శాతం పడిపోయింది. రూపాయి క్షీణతతో విదేశీ టూర్లు మరింత భారంగా మారే అవకాశం ఉండటంతో ప్రయాణాలను వాయిదా లేదా రద్దు చేసుకునే అవకాశాలు ఉండటంతో టూరిజం, హాస్పిటాలిటీ లాంటి రంగాల మీద కూడా పడొచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అలాగే దిగుమతులపైన ఆధారపడిన లేక గణనీయంగా విదేశీ కరెన్సీలో రుణభారం ఉన్న రంగాల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
భారం ఇలా..
2020లో భారత్, అమెరికాలో వడ్డీ రేట్ల మధ్య దాదాపు అయిదు శాతం వ్యత్యాసం ఉన్న తరుణంలో రూపాయి మారకంలో కన్నా విదేశీ మారకంలో రుణాలు తీసుకోవడం చాలా ఆకర్షణీయంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అవే రుణాలు ఇప్పుడు గుదిబండలుగా మారుతున్నాయి. అప్పట్లో గానీ రూ. 2,000 కోట్లు విదేశీ రుణం తీసుకుని ఉంటే పెరిగిన వడ్డీ భారంతో పాటు రూపాయి కూడా క్షీణించడం వల్ల 22 శాతం అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు డాలరు విలువ రూ. 75గా ఉన్నప్పుడు 500 మిలియన్ డాలర్లు రుణం తీసుకుని ఉంటే, దేశీ కరెన్సీ విలువ 5 శాతం క్షీణించిన పక్షంలో అదనంగా రూ. 2,500 కోట్ల భారం పడుతుందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పాబ్రి తెలిపారు. ఇలా ఒకవైపు అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడంతో పాటు, రూపాయి బలహీనపడిపోవడం వల్ల విదేశీ రుణాలను తీర్చడం భారంగా మారుతోంది.
హెడ్జింగ్ అంతంతే..
విదేశీ రుణాలు తీసుకున్నప్పుడు రూపాయి పడిపోతే నష్టపోకుండా ఉండేందుకు, తిరిగి చెల్లించేటప్పుడు ఎక్కువ భారం పడకుండా ఉండేందుకు కంపెనీలు హెడ్జింగ్ వ్యూహాన్ని పాటిస్తుంటాయి. సుమారు గత మూడేళ్లుగా భారీగా విదేశీ నిధులు సమీకరించినవి, సమీకరించడంపై కసరత్తు చేస్తున్న వాటిలో ఆర్‌ఈసీ (500 మిలియన్ డాలర్లు), టాటా మోటార్స్ ఫైనాన్స్ (200 మిలియన్ డాలర్లు), ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (125 మిలియన్ డాలర్లు), టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు (100 మిలియన్ డాలర్లు) బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మొదలైనవి ఉన్నాయి.
అయితే, దేశీ కంపెనీలు తీసుకున్న ఈసీబీల్లో దాదాపు మూడో వంతు రుణాలకు హెడ్జింగ్ రక్షణ లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, 2023–24లో దాదాపు 38.4 బిలియన్ డాలర్ల రుణాలు రాగా ఇందులో సుమారు 11.52 బిలియన్ డాలర్ల మొత్తానికి హెడ్జింగ్ రక్షణ లేదు. ఇలా హెడ్జింగ్ చేసుకోని కంపెనీలన్నింటికీ ప్రస్తుత రూపాయి పతనం సమస్యగా మారినట్లు పేర్కొన్నాయి. ఇటీవలి ఆర్‌బీఐ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో సమీకరించిన మొత్తం ఈసీబీల్లో 40 శాతాన్నే పెట్టుబడి వ్యయాల కోసం కంపెనీలు ఉపయోగించుకున్నాయి. అంటే మిగతా 60 శాతాన్ని ఖరీదైన ఇతరత్రా రుణాలను తీర్చేందుకు ఉపయోగించుకుని ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment