Foreign Trade
-
ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం చైనా నుంచి ఈ–కామర్స్ ఎగుమతులు 300 బిలియన్ డాలర్లుగా ఉంటే, భారత్‌నుంచి కేవలం 5 బిలియన్ డాలర్లే ఉన్నట్టు వెల్లడించారు. కనుక రానున్న సంవత్సరాల్లో భారత్ నుంచి ఈ–కామర్స్ ఎగుమతులను 50–100 బిలియన్ డాలర్లకు చేర్చే సామర్థ్యాలున్నట్టు వివరించారు. టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్, రత్నాభరణాల వంటి వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులను (ఎఫ్ఎంజీ) సమీకరించే సామర్థ్యం ఉన్న కంపెనీలు ఈ–కామర్స్ ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కాకపోతే ఈ ఉత్పత్తులను సమీకరించే చక్కని నెట్వర్క్, లాజిస్టిక్స్ సదుపాయాలు, గోదాముల వసతులు అవసరమన్నారు. ఈ కామర్స్ ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించగా.. త్వరలో ఆయా కంపెనీలతో డీజీఎఫ్టీ సమావేశం కానున్నట్టు చెప్పారు. 4–5 రోజుల్లో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ‘‘ఏ అగ్రిగేటర్ అయినా లేదా సంస్థ.. ఫాస్ట్ మూవింగ్ ఈ–కామర్స్ గూడ్స్ అయిన టెక్స్టైల్స్, రత్నాభరణాలు, చేనేత ఉత్పత్తులు, ఆయు‹Ù, వెల్నెస్ ఉత్పత్తులను డిమాండ్‌కు అనుగుణంగా డెలివరీ చేయగలిగే సామర్థ్యాలు ఉంటే ఎగుమతుల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు’’అని వివరించారు. ఈ తరహా ఎగుమతుల కేంద్రాల ఏర్పాటుకు తగిన సామర్థ్యాలు షిప్‌రాకెట్, డీహెచ్ఎల్ సంస్థలకు ఉన్నట్టు చెప్పారు. -
హౌసింగ్, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం సంస్కరణలు అవశ్యం
న్యూఢిల్లీ: గృహనిర్మాణ రంగం, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కీలక సిఫారసులు చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఒక నివేదికను సమరి్పంచింది. గవర్నర్‌ను కలిసిన బృందానికి పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాలి్మయా నేతృత్వం వహించారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక సవాళ్లు, కొనసాగుతున్న మహమ్మారి ప్రభావం నేపథ్యంలో వృద్ధిని ఉత్తేజపరిచేందుకు గృహనిర్మాణ రంగ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. తక్కువ వడ్డీరేట్లు రేట్లు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. వినియోగాన్ని పెంచుతాయి, పోటీతత్వాన్ని పెంపొందించడానికి దోహదపడతాయి. సవాళ్లను ఎదుర్కొంటున్న పరిశ్రమకు చేయూతను అందిస్తాయి. ► ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో, తగిన లిక్విడిటీని నిర్వహించడంలో (ద్రవ్య లభ్యత) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను మేము అర్థం చేసుకున్నాము. అభినందిస్తున్నాము. అయితే ఇదే సమయంలో వడ్డీ రేట్ల తగ్గింపూ చాలా అవసరం. మా పరిశ్రమకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని ఇది అందిస్తుందని మేము నమ్ముతున్నాము. ► ఎగుమతి రియలైజేషన్ ప్రయోజన కోడ్ల సరిదిద్దడం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఇన్పుట్ ప్రయోజనాల రక్షణ సహా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కరించాల్సి ఉంది. ► విదేశీ సంస్థల కొనుగోళ్ల మాదిరిగానే రూపాయి రుణాలను ఉపయోగించి భారతదేశంలో ఇప్పటికే ఉన్న యూనిట్లు/కంపెనీలను కొనుగోలు చేయడానికి అనుమతించాలి. ప్రస్తుతం, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఏ యూనిట్/కంపెనీని కొనుగోలు చేయడానికి భారతీయ రూపాయిలో బ్యాంక్ రుణం వీలు కల్పించడంలేదు. అయితే భారతదేశం వెలుపల ఏదైనా యూనిట్/కంపెనీని కొనుగోలు చేయడానికి మాత్రం ఇది అందుబాటులో ఉంది. ► విదేశీ వాణిజ్యం విషయానికి వస్తే... ఎగుమతి ఆదాయం నుండి విదేశీ బ్యాంకు చార్జీలను రికవరీ చేయడం, విదేశీ కరెన్సీలో ప్రీ–షిప్మెంట్ క్రెడిట్‌ను సరళీకరించడం (పీసీఎఫ్సీ) వంటివి ఉన్నాయి. ► లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) బకాయిల వర్గీకరణకు సంబంధించి 90 రోజుల పరిమితిని 180 రోజులకు పెంచాలి. తద్వారా ఆయా కంపెనీలు వాటి వర్కింగ్ క్యాపిటల్‌ను వ్యాపార కార్యకలాపాలకు తగిన విధంగా> వినియోగించి సమస్యల నుంచి బయటపడే వీలుంటింది. రుణ వాయి దాల చెల్లింపులకు వర్కింగ్ క్యాపిటల్‌ను వినియోగించుకోవాల్సిన దుస్థితి తొలగిపోతుంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ రూపీ వోస్ట్రో ఖాతాలు
ముంబై: రూపీ వోస్ట్రో ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఎగుమతి, దిగుమతిదారులు వోస్ట్రో ఖాతాల ద్వారా రూపాయి మారకంలో చెల్లింపులు చేసుకోవచ్చ ని పేర్కొంది. ఇన్వాయిస్, చెల్లింపులకు ఐఎన్ఆర్ను ఉపయోగించడం ద్వారా విదేశీ కరెన్సీ మారకం రిస్క్ తగ్గుతుందని తెలిపింది. 29 దేశాల్లోని కరస్పాడెంట్ బ్యాంకుల్లో 100కుపైగా రూపీ వోస్ట్రో అకౌంట్లకు కలిగి ఉన్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానం 2023కు తోడు, ఎగుమతులు, దిగుమతులు, ఇన్వాయిసింగ్ ఐఎన్ఆర్లో ఉండాలన్న ఆర్బీఐ కార్యాచరణకు అనుగుణంగా ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. -
ఎగుమతుల లక్ష్యం.. 2 ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఎగుమతులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించింది. అంతేకాకుండా ఈకామర్స్ ఎగుమతులకు ప్రోత్సాహకాలను అందించాలని కూడా ప్రతిపాదించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రవేశపెట్టిన ఎఫ్టీపీ 2023 ప్రకారం రాయితీల జమానా నుండి ప్రోత్సాహకాల దిశగా మారేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఎగుమతిదారులు, రాష్ట్రాలు, జిల్లాలు, భారతీయ మిషన్ల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించనున్నారు. లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం, మరిన్ని ఎగుమతి హబ్‌లను అభివృద్ధి చేయడం కూడా తాజా పాలసీలో భాగం. డైనమిక్ పాలసీ... గతంలో అయిదేళ్లకోసారి ప్రకటించే ఎఫ్‌టీపీల మాదిరిగా కాకుండా ఈసారి ప్రభుత్వం డైనమిక్ అలాగే పరిస్థితులకు అనుగుణంగా స్పందించే పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీకి గడువు ముగింపు అంటూ ఏదీ ఉండదు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా పాలసీని సవరిస్తారు. ‘ఈ పాలసీకి గడువు తేదీ ఏదీ లేదు, కాలానుగుణంగా మార్పులు చేయడం జరుగుతుంది’ అని పాలసీ ఆవిష్కరణ అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీటీఎఫ్‌టీ) సంతోష్ సారంగి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు మరిన్ని ప్రాంతాలకు భారీగా విస్తరించే విధంగా వాణిజ్య శాఖ చర్యలు చేపడుతుందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రంగాల వారీగా లేదంటే దేశాల వారీగా దృష్టి పెడతామన్నారు. వచ్చే 4–5 నెలల్లో విదేశాల్లోని భారతీయ మిషన్లతో కలిసి వాణిజ్య శాఖ ఈ దిశగా చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. ‘2030 నాటికి 2 ట్రలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవాలనేది మా లక్ష్యం. దీన్ని సాధిస్తామన్న నమ్మకం ఉంది. అయితే వస్తు ఎగుమతులు, సేవల ఎగుమతులను అధిగమించాలని మేము భావించడం లేదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారంతో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి వస్తు, సేవల ఎగుమతులు 765 బిలియన్ డాలర్లను అధిగమించనున్నాయని డీజీఎఫ్టీ తెలిపారు. 2021–22లో ఈ మొత్తం ఎగుమతుల విలువ 676 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రూపాయికి గ్లోబల్ హోదా... అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలని ఎఫ్టీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, విదేశీ వాణిజ్య లావాదేవీలకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశీ కరెన్సీలో సెటిల్మెంట్లకు ఎగుమతి ప్రయోజనాలను కల్పించనున్నారు. ‘కరెన్సీపరమైన సంక్షోభాలు, లేదంటే డాలర్లకు కొరత ఉన్న దేశాలతో రూపాయిల్లో వాణిజ్య లావాదేవీలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు. కాగా, యంత్రపరికరాల ఎగుమతి ప్రోత్సాహక (ఈపీసీజీ) స్కీమ్ అలాగే ముందస్తు అనుమతులకు ప్రతిగా ఎగుమతి బాధ్యతలను (ఈఓ) నెరవేర్చడంలో విఫలమైన ఎగుమతిదారులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కోసం క్షమాబిక్ష స్కీమ్‌ను కూడా తాజా ఎఫ్టీపీలో పొందుపరిచారు. దీని ప్రకారం ఈఓల విషయంలో డిఫాల్ట్ అయిన పెండింగ్ కేసులన్నింటినీ క్రమబద్దీకరిస్తారు. దీనికోసం మినహాయింపు పొందికస్టమ్స్ సుంకాలను, అలాగే 100% వడ్డీతో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆచరణాత్మక పాలసీ.. ఎఫ్టీపీ 2023ని కార్పొరేట్ వర్గాలు స్వాగతించాయి. ప్రపంచ వాణిజ్యంలో భారత వాటాను పెంచేలా ఆచరణాత్మక, సానుకూలమైన పాలసీగా పరిశ్రమ చాంబర్లు, ఎగుమతిదారులు దీన్ని అభివర్ణించారు. 2 ట్రిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతి లక్ష్యాన్ని సాధించేలా అనేక వినూత్న చర్యలను పాలసీలో ప్రకటించారని భారతీయ పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ కొత్త పాలసీ అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటాను భారీగా పెంచేందుకు దోహదం చేస్తుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వ్యాఖ్యానించారు. పాలసీలో ఇతర చర్యలు... ► జిల్లాలను ఎగుమతి హబ్‌లుగా చేసేందుకు రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో కలిసి పనిచేయడంపై కూడా ఎఫ్టీపీ 2023 దృష్టిపెట్టింది. ► యూఏవీ/డ్రోన్స్, క్రయోజనిక్ ట్యాంక్స్, ప్ర త్యేక రసాయనాల వంటి ద్వంద్వ వినియోగ హై ఎండ్ ఉత్పత్తులు, టెక్నాలజీల ఎగుమతుల కోసం సరళమైన పాలసీలపై దృష్టిసారిస్తారు. ► ఈకామర్స్ ఎగుమతులకు ఎగుమతి ప్రయోజనాలను ప్రత్యేకంగా అందించాలని పాలసీ నిర్దేశించింది. కొరియర్ ద్వారా ఎగుమతుల విలువ పరిమితిని రెంట్టింపు చేస్తూ, ఒక్కో కన్సైన్మెంట్ను రూ.10 లక్షలకు చేర్చనున్నారు. కాగా, ఈకామర్స్ అగ్రిగేటర్లకు స్టాకింగ్, కస్టమ్స్ అనుమతులు, రిటర్న్‌ల ప్రక్రియను సులభతం చేసేందుకు గిడ్డంగి సదుపాయంతో కూడిన ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2030 నాటికి ఈకామర్స్ ఎగుమతులు 200–300 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతాయని అంచనా. ► అన్ని రకాల బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ), వర్టికల్ సాగు యంత్రాలు, మురుగునీటి శుద్ధి, రీసైక్లింగ్, వర్షపు నీటి ఫిల్లర్లు, గ్రీన్ హైడ్రోజన్‌లను పర్యావరణహిత టెక్నాలజీ ఉత్త్పత్తుల్లోకి చేర్చారు. తద్వారా ఈపీసీజీ స్కీమ్ ప్రకారం వీటిపై ఎగుమతి పరమైన నియంత్రణలు తగ్గుతాయి. -
అధీకృత సంస్థగా ఎంఈడీఈపీసీ
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, మానిటర్స్, మొబైల్స్ విడిభాగాల ఎగుమతికై ఎగుమతి కంపెనీలకు కావాల్సిన రిజిస్ట్రేషన్/మెంబర్షిప్ సర్టిఫికేట్ జారీ చేయడానికి.. మొబైల్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌కు (ఎంఈడీఈపీసీ) ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ప్రొజెక్టర్లు, టీవీలు, ప్రింటర్లు, ఫోటోకాపీయింగ్ మెషీన్స్ వంటి ఇతర ఉత్పత్తులకూ ఎంఈడీఈపీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఎగుమతి కంపెనీలు ఫారెన్ ట్రేడ్ పాలసీ కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. -
రూపాయిలో వాణిజ్యానికీ ప్రోత్సాహకాలు అందుతాయ్!
న్యూఢిల్లీ: రూపాయిలో లావాదేవీలను పరిష్కరించుకున్నప్పటికీ, విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టీఏ) కింద ఎగుమతిదారులు ప్రోత్సాహకాలను పొందేందుకు ఇకపై ఎటువంటి ఇబ్బందీ ఉండబోదు. వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (జీడీఎఫ్‌టీ) ఈ మేరకు నిబంధనావళిని విడుదల చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంసహా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయిలో అంతర్జాతీయ వాణిజ్యం నిర్వహించేందుకు భారత్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అడ్డంకులను కేంద్రం క్రమంగా తొలగిస్తోంది. తాజా నిర్ణయంతో రూపాయిలో ఎగుమతులకు సంబంధించి వాణిజ్య లావాదేవీల పరిష్కారానికి మార్గం మరింత సుగమం అయ్యింది. ఇప్పటికే దేశీయ కరెన్సీలో వాణిజ్యాన్ని సులభతరం చేసే లక్ష్యంతో భారత్ రూపాయిలో ఎగుమతులు– దిగుమతుల ఇన్వాయిస్, చెల్లింపు, సెటిల్మెంట్కు జీడీఎఫ్‌టీ అనుమతించింది. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
విదేశీ వాణిజ్య విధానం ఆరు నెలలు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విదేశీ వాణిజ్య విధానాన్ని (2015–20) మరో ఆరు నెలల పాటు, 2023 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 30తో వాస్తవానికి దీని గడువు ముగియాల్సి ఉంది. పరిశ్రమల సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహకాల మండళ్ల నుంచి ప్రస్తుత విధానం కొనసాగింపుపై డిమాండ్లు వస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ అమిత్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత తరుణంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావద్దన్న డిమాండ్లు ఉన్నట్టు చెప్పారు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
'వాణిజ్య భవన్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగానికి చెందిన 'వాణిజ్య భవన్'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. (ఎన్‌ఐఆర్‌వైఏటీ) నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలసిస్ ఆఫ్ ట్రేడ్ పోర్టల్‌ని లాంచ్ చేశారు. ఈ పోర్టల్ స్టేక్ హోల్డర్లకు ఒక వేదికలా ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం ఇలా ఉంది. ♦వాణిజ్య భవన్,ఎన్‌ఐఆర్‌వైఏటీ పోర్టల్‌తో ఆత్మనిర్భర్ భారత్ ఆకాంక్షలు నెరవేరుతాయి.వాణిజ్య-వ్యాపార సంబంధాలతో పాటు చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు సానుకూల ఫలితాలు పొందవచ్చని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ♦వాణిజ్య భవన్‌తో వ్యాపార-వాణిజ్య రంగాలకు చెందిన వారితో పాటు ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుంది. ♦గతేడాది ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. అదే సమయంలో భారత్ 670 బిలియన్ల(భారత కరెన్సీలో రూ.50లక్షల కోట్లు) ఎగుమతులు చేసింది. ♦దేశ ప్రగతికి ఎగుమతులు కీలకం. 'వోకల్ ఫర్ లోకల్' వంటి కార్యక్రమాలు దేశ ఎగుమతులను వేగవంతం చేసేందుకు దోహద పడ్డాయని మోదీ తెలిపారు. ♦గతేడాది దేశం ప్రతి సవాలును ఎదుర్కొన్నప్పటికీ ఎగుమతుల విషయంలో భారత్ 400 బిలియన్ల పరిమితిని దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మనం అనూహ్యంగా 418 బిలియన్ డాలర్లు అంటే 31 లక్షల కోట్ల రూపాయల ఎగుమతితో సరికొత్త రికార్డ్‌ను సృష్టించాం. ♦ఈరోజు ప్రతి మంత్రిత్వ శాఖ, ప్రభుత్వంలోని ప్రతి విభాగం 'పూర్తి ప్రభుత్వ' విధానంతో ఎగుమతులను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి." ఎంఎస్ఎంఈ, మంత్రిత్వ శాఖ లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వ్యవసాయం,వాణిజ్య మంత్రిత్వ శాఖ..ఇలా అందరూ ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి కట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
శతమానం భారతి విదేశీ వాణిజ్యం
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సందర్భంలోనైనా అనే మాట ఒకటి ఉంది : స్వావలంబన మాత్రమే కాదు, అంతకు మించి దేశం ఎదగాలి అని. అంతర్థాం ఏమంటే మన ఉత్పత్తులపై విదేశాలను ఆధారపడేలా చేయడం. తద్వారా విదేశీ మారక నిల్వల్ని పెంచుకుంటూ పోవడం. అప్పుడు దేశం ఆర్థికంగా ఆగ్రరాజ్యం అవుతుంది. స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు అయ్యేనాటికి దేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధిగా ఉండాలని ప్రధాని ఆకాంక్ష. విదేశీ వాణిజ్య రంగంలో ఆ ఆకాంక్ష నేరవేరడం అలవిమాలని లక్ష్యం అయితే కాబోదని పాత గణాంకాలను చూస్తే తేటతెల్లం అవుతుంది. మొదటి పంచవర్ష ప్రణాళికలోని ఐదేళ్లలో మన ఎగుమతుల సగటు విలువ 647 కోట్ల రూపాయలు ఉండగా, 2022 నాటికి ఆ మొత్తం 32 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. భారత్ నుంచి పలు రకాలైన ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలలో అమెరికా, చైనా, యూ.ఎ.ఇ. హాంకాంగ్, బంగ్లాదేశ్, సింగపూర్, యు.కె. జర్మనీ, నేపాల్, నెదర్లాండ్ ఉన్నాయి. ఈ వరుస క్రమంలో అమెరికా మనకున్న పెద్ద దిగుమతి దారు. ఇంజనీరింగ్ ఉత్పత్తులు మన ప్రధాన ఎగుమతులు కాగా, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్త్రాలు, అభరణాలు, చేనేత, రెడీమేడ్ దుస్తులు, ప్లాస్టిక్స్, సముద్ర ఉత్పత్తులు.. మిగతావి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభం అయిన 1991 నాటికి భారత్ ఎగుమతులు 1800 కోట్ల డాలర్లు కాగా.. ఈ విలువ లక్ష కోట్ల డాలర్లకు పెరిగితేనే, భారత్ తను నిర్దేశించుకున్న ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోగలదు. (చదవండి: శతమానం భారతి : బ్రిటిష్ ఇండియాలో తొలి ఇంజనీరింగ్ కాలేజ్ ఐ.ఐ.టి. రూర్కీ) -
ఆస్ట్రేలియా, యూఏఈలతో వ్యాపారాభివృద్ధి
చెన్నై: ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)లతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ద్వారా ఒనగూడే వాణిజ్య అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఆయా దేశాల్లో భాగస్వాములను గుర్తించాలని కూడా పిలుపునిచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఇక్కడ నిర్వహించిన ‘స్టేక్‌హోల్డర్స్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’లో సీతారామన్ ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), ఆస్ట్రేలియాతో ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకాలు చేయడంతో, ఇప్పుడు ఆ రెండు దేశాలలో ‘‘తమ జాయింట్ వెంచర్ భాగస్వామి‘ని గుర్తించడం పరిశ్రమలకు కీలకం. ఇది ఆయా దేశాల్లో వ్యాపారావకాశాలను పెంచుతుంది. యూఏఈలో వ్యాపారవేత్తలు భారత్‌లో 75 బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు సింద్ధంగా ఉన్నారు. ► ఆరేడేళ్ల క్రితం తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు, భారతదేశం ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశలో ముందడుగు వేయాలని పలు సూచనలు వచ్చాయి. ఈ రోజు భారత్ యూఏఈ, ఆస్ట్రేలియాతో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ► స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ఆస్ట్రేలియాతో 10 ఏళ్లకు పైగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఒప్పందం కేవలం 88 రోజుల్లోనే కుదరడం భారత్ ప్రభుత్వం ఈ విషయంలో సాధించిన పురోగతికి నిదర్శనం. ఇండో–పసిఫిక్ స్ట్రాటజిక్ ఫ్రేమ్‌వర్క్‌లో ఆస్ట్రేలియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ► కంపెనీ లేదా ఇతర ఏదైనా సంస్థ తన కార్యకలాపాలలో పారదర్శకంగా ఉండాలి. కంపెనీలోని పెట్టుబడిదారులుసహా అన్ని వివరాలు ‘‘పబ్లిక్ డొమైన్’’లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఆయా అంశాలే పరిశ్రమ కార్యకలాపాలకు సంబంధించి పారదర్శకతను పెంపొందిస్తాయి. ► కేంద్రం పరిశ్రమకు తన పూర్తి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. పన్ను విధానాల్లో ప్రభుత్వం సూచించిన పారదర్శక పద్దతులు పాటిస్తూ, పన్నులు చెల్లిస్తే ఎటువంటి తనిఖీలూ ఉండవు. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున భారత్ పరిశ్రమ ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తగిన అన్ని చర్యలూ తీసుకోవాలి. పరిశ్రమకు ఇది చాలా కీలకం. ► చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చారు. ఈ సమావేశానికి చాలా ఆసక్తితో హాజరు కావడానికి సమయం తీసుకున్నారు. మనం మన కార్యకలాపాలలో పారదర్శకతను తీసుకురావడం, సాంకేతికతను పెంచడం వంటి చర్యల ద్వారా వ్యాపారాన్ని వేగంగా వృద్ధిబాటన నడపగలుగుతాము. ► కంపెనీలు ఇతర దేశాలలో వ్యాపార సంబంధాలు నెరపడానికి గతంలో పలు అవరోధాలను ఎదుర్కొనాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఎటువంటి అవరోధాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏ విషయంలోనైనా ప్రభుత్వం తన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. పరిశ్రమకు విద్యుత్ కష్టాలు రానీయకండి...రాష్ట్రాలకు సూచన కాగా, పరిశ్రమలకు విద్యుత్ కష్ట నష్టాలు రానీయద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికమంత్రి విజ్ఞప్తి చేశారు. తగిన రేట్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరాలు చేయాలని ఆమె ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. 24 గంటలై 365 రోజులు పరిశ్రమకు విద్యుత్ అందేలా చర్యలు ఉండాలన్నారు. ఇందుకు తగిన మౌలిక ఇంధన ప్రణాళికను రూపొందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ పురోగతికి ఇది కీలకమని పిలుపునిచ్చారు. ఈ దిశలో రాష్ట్రాలకు కేంద్రం తగిన సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందిస్తుందని భరోసాను ఇచ్చారు. దేశ మౌలిక రంగం పురోగతికి 2021–22 బడ్జెట్‌తో పోల్చితే 2022–23 బడ్జెట్లో నిధుల కల్పనను రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.7.5 లక్షల కోట్లకు పెంచిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం 50 ఏళ్లపాటు రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాన్ని అందజేస్తామని బడ్జెట్లో ప్రకటించామనీ తెలిపారు. -
ఎయిర్‌టెల్‌కు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ నష్టాలకు తోడు ఇటీవలి ఏజీఆర్ వివాదంతో ఇబ్బందులు పడుతున్న ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్‌కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ భారతి ఎయిర్‌టెల్‌ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాల (ఇపీసీజీ) పథకం కింద ఎగుమతి నిబంధలను నెరవేర్చకపోవడంతో భారతి ఎయిర్‌టెల్‌ను విదేశీ వాణిజ్య రెగ్యులేటరీ ఈ జాబితాలో చేరింది. ఎగుమతి ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం కింద ఎగుమతి బాధ్యతను నెరవేర్చడంలో ఎయిర్టెల్ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌టెల్‌ను "తిరస్కరించిన ఎంట్రీ లిస్ట్" లో ఉంచినట్లు తెలిపాయి. దీంతో కంపెనీలు తమ దిగుమతి లైసెన్స్‌ను కోల్పోతాయి. మరోవైపు అవసరం లేని కారణగా 2018 ఏప్రిల్ నుండి అలాంటి లైసెన్స్ తీసుకోలేదని ఎయిర్టెల్ వివరించింది. అయినప్పటికీ గత లైసెన్సులన్నీ ముగిసిన నేపథ్యంలో కొత్త లెసెన్స్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. అయితే ఏ వస్తువులు (ఎగుమతి, దిగుమతి) ఈ లైసెన్సుల కిందికి వస్తాయనేది వెల్లడించలేదు ఈపీసీజీ పథకం కింద, ఎగుమతిదారుడు కొంతవరకు కేపిటల్ గూడ్స్‌ను సుంకాలేవీ లేకుండానే దిగుమతి చేసుకునే వీలుంటుంది. అలాగే ఎగుమతులకు సంబంధించిన ప్రక్రియలో సాంకేతికతను పెంచుకోవడం కోసం అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. కాగా 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉండేలా కొత్త వాణిజ్య విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కసరత్తును చేస్తోంది. -
సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచుతాం
ఫారిన్ ట్రేడ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అలోక్ త్రివేది సాక్షి,విశాఖపట్నం: దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచే 45 శాతం జరుగుతున్నాయని, వీటిని మరింత పెంచడమే తమలక్ష్యమని ఫారిన్ ట్రేడ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అలోక్ త్రివేది చెప్పారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల పెంపుదలపై భారత ఎగుమతి దారుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖలో మంగళవారం సదస్సు జరిగింది. ఎగుమతి చేయడం ఎలా మొదలుపెట్టాలి, మార్కెట్ రీసెర్చ్, కొనుగోలు దారులను గుర్తించడం వంటి అంశాలను ఆయన వివరించారు. భారత ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ స్కీమ్ వివరాలను ఫారెన్ ట్రేడ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పున్నం కుమార్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడాలని జాయింట్ డైరెక్టర్ జనరల్ ఉన్ని కృష్ణన్ సూచించారు. ఈ సదస్సులో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ పి.వి.వి.ఎస్.ఎస్. శ్రీనివాస్, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
విదేశీ వాణిజ్య నిబంధనల సరళీకరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేశంలోని అన్ని ఓడరేవుల్లో ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించడానికి విదేశీ వాణిజ్య నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించిందని విదేశీ వాణిజ్యం జాయింట్ డెరైక్టర్ జనరల్ జి.సీతారామరెడ్డి చెప్పారు. ఈ వాణిజ్యానికి అవసరమైన అన్ని అనుమతులూ ఇకపై ఆన్లైన్లోనే పొందవచ్చన్నారు. సరుకుల ఎగుమతి, దిగుమతిదారులను ప్రోత్సహించే లక్ష్యంతో కస్టమ్స్ నిబంధనలను మారుస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నిర్యత్ బంధు’ విధానంపై.. ఔత్సాహిక వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు కాకినాడ కస్టమ్స్ హౌస్‌లో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామరెడ్డి మాట్లాడుతూ, పేపర్‌లెస్ విధానం ఔత్సాహిక వాణిజ్యవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చే సరకులను తనిఖీ చేసే పాత్ర మాత్రమే నిర్వహిస్తున్న కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు.. ఇప్పుడు ఎగుమతి, దిగుమతిదారులకు ప్రోత్సాహం కల్పించే బాధ్యతను తీసుకున్నారని చెప్పారు. కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఎం.శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ వి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ, హోప్ ఐలాండ్ సహజ రక్షణ కవచంలా ఉన్న కాకినాడ రేవు ఎగుమతులు, దిగుమతుల్లో పూర్వ వైభవం సాధిస్తుందనడంలో సందేహం లేదన్నారు. విదేశీ వాణిజ్యంలో ప్రవేశించాలనుకునే ఔత్సాహికులు ఆన్లైన్లో పూర్తి చేయాల్సిన దరఖాస్తులపై అసిస్టెంట్ కమిషనర్ పున్నమ్కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాకినాడ సీపోర్టు జనరల్ మేనేజర్ ఎం.జాకబ్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కొన్ని సంపన్న దేశాలు ఆర్థికమాంద్యంతో సతమతమవుతున్నా.. ఈ ఏడాది 15.5 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యాన్ని సాధించామని వివరించారు. కాకినాడ రేవు ద్వారా గత మూడేళ్లలో ఎగుమతులు, దిగుమతుల్లో 80 శాతం వృద్ధి సాధించామన్నారు. ఓఎన్జీసీ, రిలయన్స్, జీఎస్పీసీ, ట్రాన్సోసియాన్, కెయిర్న్ వంటి సంస్థలు పెట్రోలియం, సహజవాయువు వెలికితీత కార్యకలాపాలను కాకినాడ సమీపాన నిర్వహించడం కూడా దీనికి ప్రధాన కారణమన్నారు. ఎరువులు, బొగ్గు, అల్యూమినియం వంటివాటిని యాంత్రీకరణ విధానంలో రవాణా చేసే సౌకర్యాలు కాకినాడ పోర్టులో ఉన్నాయని చెప్పారు. పెద్ద నౌకలకు సర్వీసింగ్ సదుపాయం కూడా ఉందన్నారు. త్వరలో మరో బెర్తు సిద్ధమవుతోందని వివరించారు. కాకినాడ కంటైనర్ టెర్మినల్ లిమిటెడ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి విశాఖకన్నా కాకినాడ రేవు సమీపాన ఉందని, భవిష్యత్తులో ఇక్కడినుంచే విదేశీ వర్తకం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని వివరించారు. తమ సంస్థ కూడా రెండు బెర్తులను సిద్ధం చేస్తోందని తెలిపారు. కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ దంటు సూర్యారావు కూడా మాట్లాడారు. -
విదేశీ వ్యాపారానికి... ఫారిన్ ట్రేడ్ ఎక్స్పర్ట్
అప్‌కమింగ్ కెరీర్ : ప్రాచీన కాలం నుంచే మనదేశం విదేశాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. అప్పటి పాలకులు విదేశీ వ్యాపారానికి అధిక ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇచ్చారు. ఇందుకోసం ఓడరేవులను నిర్మించారు. మౌలిక సదుపాయాలను కల్పించారు. దేశాభివృద్ధిలో ఫారిన్ ట్రేడ్ పాత్ర ఎంతో ఉంటుంది. ఆధునిక కాలంలో విదేశీ వాణిజ్యం అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఫారిన్ ట్రేడ్ నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. వ్యాపార, వాణిజ్యాలపై ఆసక్తి ఉన్న యువతకు కేరాఫ్‌గా నిలుస్తున్న వైవిధ్యమైన కెరీర్.. ఫారిన్ ట్రేడ్. విదేశీ వ్యాపార నిపుణులకు ప్రస్తుతం దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సాధారణంగా ఇందులో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగం కోసం వెతుక్కోనక్కర్లేదని నిపుణులు అంటున్నారు. ఫారిన్ ట్రేడ్ కోర్సును పూర్తి చేయగానే కొలువు సిద్ధంగా ఉంటోంది. అందుకే నేటి యువత ఈ రంగంపై దృష్టి సారించారని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు పుష్కలం: భారత్‌లోని ప్రముఖ సంస్థలు తమ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తున్నాయి. విదేశాల్లోని ప్రఖ్యాత కంపెనీలను టేకోవర్ చేస్తున్నాయి. విదేశీ సంస్థలతో కలిసి సంయుక్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇవి అంతర్జాతీయ వాణిజ్యంపై పరిజ్ఞానం ఉన్న ఫారిన్ ట్రేడ్ నిపుణులను విరివిగా నియమించుకుంటున్నాయి. మరోవైపు మనదేశం నుంచి ఎగుమతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఫారిన్‌ట్రేడ్ నిపుణులకు అవకాశాలు మెరుగవుతున్నాయి. నిపుణుల కొరత: ప్రస్తుతం చాలా సంస్థలు ఇంటర్నేషనల్ మార్కెట్లో పాగా వేసేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి. బ్యాంకులు, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. షిప్పింగ్ లైన్స్, ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీలు, ఎక్స్‌పోర్టు హౌసెస్, కరెన్సీ ట్రేడింగ్ ఏజెన్సీల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అంతేకాకుండా గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, కార్గో వంటివాటిలోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఏజెన్సీల్లో ఫారిన్ ట్రేడ్ నిపుణుల కొరత వేధిస్తోంది. ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్‌లోనూ వీరి అవసరం ఎంతో ఉంది. అర్హతలు: ఫారిన్ ట్రేడ్‌పై మనదేశంలో లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ కోర్సులను విద్యాసంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఐఐఎఫ్‌టీ, ఐఎస్బీ, ఐఐఎంలలో స్పెషలైజ్డ్ కోర్సులు ఉన్నాయి. గ్రాడ్యు యేషన్ పూర్తయిన తర్వాత వీటిలో చేరొచ్చు. టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నాయి. వేతనాలు: ఫారిన్ ట్రేడ్ నిపుణులకు మంచి వేతన ప్యాకేజీలు లభిస్తాయి. ట్రైనీకి ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలు, ఎగ్జిక్యూటివ్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు, జూనియర్ మేనేజర్‌కు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు, మేనేజర్‌కు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వేతనం ఉంటుంది. ఫారిన్ ట్రేడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: - ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ) వెబ్సైట్: www.iift.edu - సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ వెబ్సైట్: www.siib.ac.in - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కోర్సు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in - ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ వెబ్సైట్: www.ipeindia.org కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి ‘‘గ్లోబలైజేషన్‌తో అంతర్జాతీయంగా వ్యాపార లావాదేవీలు విస్తృతమయ్యాయి. దీనికి తగినట్లుగా నైపుణ్యవంతమైన మానవ వనరుల అవసరం నానాటికీ పెరుగుతోంది. మేనేజ్మెంట్ కోర్సుల్లో ఫారిన్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్‌కు డిమాండ్ పెరగడానికి కారణం కూడా అదే. అవకాశాలను అందిపుచ్చుకోవడం కేవలం డిగ్రీతోనే సాధ్యం కాదు. దానికి అవసరమైన మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని అభివృద్ధి చేసుకోవాలి. విదేశీ వాణిజ్య వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి. ఎంబీఏలో కేవలం సబ్జెక్టుగా ఉండే ఫారిన్ ట్రేడ్‌కు ప్రత్యేక కరిక్యులమ్‌ను రూపొందించి మరింతగా విద్యార్థుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. కెరీర్లో రాణించేందుకు మార్గం చూపే ఈ కోర్సును ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో పూర్తిచేస్తే మంచి వేతనాలు అందుకోవచ్చు’’ -ప్రొఫెసర్ బి.కృష్ణారెడ్డి, డీన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఓయూ