విదేశీ వ్యాపారానికి... ఫారిన్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్ | Foreign trade expert to be continued for foreign business | Sakshi
Sakshi News home page

విదేశీ వ్యాపారానికి... ఫారిన్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్

Published Tue, Jul 29 2014 2:54 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

విదేశీ వ్యాపారానికి... ఫారిన్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్ - Sakshi

విదేశీ వ్యాపారానికి... ఫారిన్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్

అప్‌కమింగ్ కెరీర్ : ప్రాచీన కాలం నుంచే మనదేశం విదేశాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. అప్పటి పాలకులు విదేశీ వ్యాపారానికి అధిక ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇచ్చారు. ఇందుకోసం ఓడరేవులను నిర్మించారు. మౌలిక సదుపాయాలను కల్పించారు. దేశాభివృద్ధిలో ఫారిన్ ట్రేడ్ పాత్ర ఎంతో ఉంటుంది. ఆధునిక కాలంలో విదేశీ వాణిజ్యం అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఫారిన్ ట్రేడ్ నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. వ్యాపార, వాణిజ్యాలపై ఆసక్తి ఉన్న యువతకు కేరాఫ్‌గా నిలుస్తున్న వైవిధ్యమైన కెరీర్.. ఫారిన్ ట్రేడ్. విదేశీ వ్యాపార నిపుణులకు ప్రస్తుతం దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సాధారణంగా ఇందులో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగం కోసం వెతుక్కోనక్కర్లేదని నిపుణులు అంటున్నారు. ఫారిన్ ట్రేడ్ కోర్సును పూర్తి చేయగానే కొలువు సిద్ధంగా ఉంటోంది. అందుకే నేటి యువత ఈ రంగంపై దృష్టి సారించారని నిపుణులు చెబుతున్నారు.
 
 అవకాశాలు పుష్కలం: భారత్‌లోని ప్రముఖ సంస్థలు తమ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తున్నాయి. విదేశాల్లోని ప్రఖ్యాత కంపెనీలను టేకోవర్ చేస్తున్నాయి. విదేశీ సంస్థలతో కలిసి సంయుక్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇవి అంతర్జాతీయ వాణిజ్యంపై పరిజ్ఞానం ఉన్న ఫారిన్ ట్రేడ్ నిపుణులను విరివిగా నియమించుకుంటున్నాయి. మరోవైపు మనదేశం నుంచి ఎగుమతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఫారిన్‌ట్రేడ్ నిపుణులకు అవకాశాలు మెరుగవుతున్నాయి.
 
 నిపుణుల కొరత: ప్రస్తుతం చాలా సంస్థలు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పాగా వేసేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి. బ్యాంకులు, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. షిప్పింగ్ లైన్స్, ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీలు, ఎక్స్‌పోర్టు హౌసెస్, కరెన్సీ ట్రేడింగ్ ఏజెన్సీల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అంతేకాకుండా గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, కార్గో వంటివాటిలోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్, ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల్లో ఫారిన్ ట్రేడ్ నిపుణుల కొరత వేధిస్తోంది. ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్‌లోనూ వీరి అవసరం ఎంతో ఉంది.
 
 అర్హతలు: ఫారిన్ ట్రేడ్‌పై మనదేశంలో లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ కోర్సులను విద్యాసంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఐఐఎఫ్‌టీ, ఐఎస్‌బీ, ఐఐఎంలలో స్పెషలైజ్డ్ కోర్సులు ఉన్నాయి. గ్రాడ్యు యేషన్ పూర్తయిన తర్వాత వీటిలో చేరొచ్చు. టాప్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నాయి.
 
 వేతనాలు: ఫారిన్ ట్రేడ్ నిపుణులకు మంచి వేతన ప్యాకేజీలు లభిస్తాయి. ట్రైనీకి ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలు, ఎగ్జిక్యూటివ్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు, జూనియర్ మేనేజర్‌కు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు, మేనేజర్‌కు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వేతనం ఉంటుంది.
 
ఫారిన్ ట్రేడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 -    ఉస్మానియా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 -    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ)
 వెబ్‌సైట్: www.iift.edu
 -    సింబయోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్
 వెబ్‌సైట్: www.siib.ac.in
 -    ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
 కోర్సు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)
 వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
-   ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్
 వెబ్‌సైట్: www.ipeindia.org
 
కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి
 ‘‘గ్లోబలైజేషన్‌తో అంతర్జాతీయంగా వ్యాపార లావాదేవీలు విస్తృతమయ్యాయి. దీనికి తగినట్లుగా నైపుణ్యవంతమైన మానవ వనరుల అవసరం నానాటికీ పెరుగుతోంది. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఫారిన్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్‌కు డిమాండ్ పెరగడానికి కారణం కూడా అదే. అవకాశాలను అందిపుచ్చుకోవడం కేవలం డిగ్రీతోనే సాధ్యం కాదు. దానికి అవసరమైన మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని అభివృద్ధి చేసుకోవాలి. విదేశీ వాణిజ్య వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి. ఎంబీఏలో కేవలం సబ్జెక్టుగా ఉండే ఫారిన్ ట్రేడ్‌కు ప్రత్యేక కరిక్యులమ్‌ను రూపొందించి మరింతగా విద్యార్థుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. కెరీర్‌లో రాణించేందుకు మార్గం చూపే ఈ కోర్సును ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో పూర్తిచేస్తే మంచి వేతనాలు అందుకోవచ్చు’’
 -ప్రొఫెసర్ బి.కృష్ణారెడ్డి,
 డీన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఓయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement