10న ఫ్రాన్స్‌కు.. 12న అమెరికాకు  | PM Narendra Modi to visit France and US from Feb 10 to 13 | Sakshi
Sakshi News home page

10న ఫ్రాన్స్‌కు.. 12న అమెరికాకు 

Published Sat, Feb 8 2025 4:40 AM | Last Updated on Sat, Feb 8 2025 4:40 AM

PM Narendra Modi to visit France and US from Feb 10 to 13

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు ఖరారు 

ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సుకు 

డొనాల్డ్‌ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)విదేశీ పర్యటన(foreign tour) ఖరారయ్యింది. ఆయన ఈ నెల 10 నుంచి 12వ తేదీ దాకా ఫ్రాన్స్‌లో(France)12, 13వ తేదీల్లో అమెరికాలో(America) పర్యటిస్తారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌తో కలిసి కృత్రిమ మేధ(ఏఐ) కార్యాచరణ సదస్సులో మోదీ పాల్గొంటారని చెప్పారు. అలాగే ఇండియా–ఫ్రాన్స్‌ సీఈఓల సదస్సుకు హాజరవుతారని అన్నారు. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్‌ థర్మోన్యూక్లియర్‌ ఎక్స్‌పరిమెంటల్‌ రియాక్టర్‌ను మోదీ సందర్శిస్తారని వెల్లడించారు.

అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధానమంత్రి సమావేశమవుతారని పేర్కొన్నారు. మోదీ పర్యటనతో భారత్‌–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని తెలియజేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలు, కీలక రంగాల్లో భాగస్వామ్యంపై మోదీ, ట్రంప్‌ చర్చిస్తారని వివరించారు.  అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం కొలువుదీరిన మూడు వారాల్లోపే నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిందని అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ట్రంప్‌ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించిందని చెప్పారు. ఇండియాతో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదొక ప్రతీక అని విక్రమ్‌ మిస్త్రీ వివరించారు.  

ట్రంప్‌ను ఒప్పిస్తారా?  
డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాలో అడుగుపెట్టబోతున్నారు. వారిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదార్లను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ, ట్రంప్‌ సమావేశం కాబోతున్నారు. భారత్‌–అమెరికా మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించబోతున్నట్లు సమాచారం. 

ఇరు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంధన భద్రత, కృత్రిమ మేధ(ఐఏ) వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకొనేలా నిర్ణయం తీసుకోవచ్చు. అక్రమ వలసదార్ల సమస్యను పరిష్కరించే విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం చురుగ్గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీతో భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే వీలుంది. భారతీయ అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్‌ను ఒప్పిస్తారా? అనేది వేచి చూడాలి. అమెరికాలో ఎలాన్‌ మస్క్‌ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు.  

ట్రంప్‌ ప్రియమిత్రుడు..మోదీ గొప్ప నాయకుడు  
ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన అతికొద్ది మంది ప్రపంచ దేశాల నేతల్లో మోదీ కూడా ఉన్నారు. గతవారం కూడా ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. వలసలు, భద్రత, వాణిజ్య సంబంధాలపై వారు చర్చించుకున్నారు. ట్రంప్, మోదీ మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్‌ ప్రకటించింది. ట్రంప్‌తో మోదీకి చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ట్రంప్‌ తనకు ప్రియమిత్రుడు అని మోదీ చెబుతుంటారు. 

మోదీ గొప్ప నాయకుడు అని ట్రంప్‌ సైతం ప్రశంసించారు. అయితే, ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని ట్రంప్‌ ఆక్షేపించారు. ఇండియాను టారిఫ్‌ కింగ్‌గా అభివరి్ణంచారు. గత వారం భారత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ట్రంప్‌ వ్యాఖ్యల ప్రభావం కనిపించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల మోటార్‌ సైకిళ్లతోపాటు పలు ఉత్పత్తులపై టారిఫ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. మోదీ చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించారు. క్వాడ్‌ దేశాల అధినేతల సదస్సులో             పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement