business and commercial organizations
-
365 రోజులు వ్యాపార వాణిజ్య సంస్థలు
అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య సంస్థలను 365 రోజులూ తెరిచి ఉంచి లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటును మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు కార్మిక శాఖ గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. షాపులు, ఇతర సంస్థలు ఆదివారాలు, ప్రకటిత సెలవు దినాల్లో మూసివేసే పద్ధతి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని షాపులు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలను ఏడాది పొడవునా తెరిచి ఉంచే అవకాశం కల్పించారు. ప్రయోగాత్మకంగా ఏడాది పాటు ఈ విధానం అమలు చేశారు. బుధవారంతో ఈ గడువు ముగిసిన నేపథ్యంలో నిర్వహించిన సీఎం సమీక్షలో ఈ విధానం బాగుందని తేలడంతో మరో మూడేళ్లు కొనసాగించాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా షాపులు తెరిచి ఉంచినా, కార్మికుల హక్కులకు భంగం కలగనీయొద్దన్న సీఎం సూచనలకు అనుగుణంగా కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలి. ప్రతీ కార్మికుడు, ఉద్యోగితో గరిష్ఠంగా రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలు మాత్రమే పని చేయిం చాలి. వారానికి కచ్చితంగా ఒక రోజు సెలవు ఇవ్వాలి. ఎక్కువ గంటలు పని చేస్తే దాన్ని వేతనాల రిజిస్టర్లో నమోదు చేయాలి. రాత్రి 8.30 గంటల తర్వాత మహిళా ఉద్యోగులు, సిబ్బందితో పని చేయించాల్సి వస్తే, సదరు మహిళలు రాత్రి వేళ ఇంటికి వెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించాలి. ఉద్యోగులకు జీతాలను వారి బ్యాంకు ఖాతాల్లో వేయాలి. ప్రతీ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. అర్హులైన ఉద్యోగులకు ఈఫీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. -
విదేశీ వ్యాపారానికి... ఫారిన్ ట్రేడ్ ఎక్స్పర్ట్
అప్‌కమింగ్ కెరీర్ : ప్రాచీన కాలం నుంచే మనదేశం విదేశాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. అప్పటి పాలకులు విదేశీ వ్యాపారానికి అధిక ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇచ్చారు. ఇందుకోసం ఓడరేవులను నిర్మించారు. మౌలిక సదుపాయాలను కల్పించారు. దేశాభివృద్ధిలో ఫారిన్ ట్రేడ్ పాత్ర ఎంతో ఉంటుంది. ఆధునిక కాలంలో విదేశీ వాణిజ్యం అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఫారిన్ ట్రేడ్ నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. వ్యాపార, వాణిజ్యాలపై ఆసక్తి ఉన్న యువతకు కేరాఫ్‌గా నిలుస్తున్న వైవిధ్యమైన కెరీర్.. ఫారిన్ ట్రేడ్. విదేశీ వ్యాపార నిపుణులకు ప్రస్తుతం దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సాధారణంగా ఇందులో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగం కోసం వెతుక్కోనక్కర్లేదని నిపుణులు అంటున్నారు. ఫారిన్ ట్రేడ్ కోర్సును పూర్తి చేయగానే కొలువు సిద్ధంగా ఉంటోంది. అందుకే నేటి యువత ఈ రంగంపై దృష్టి సారించారని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు పుష్కలం: భారత్‌లోని ప్రముఖ సంస్థలు తమ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తున్నాయి. విదేశాల్లోని ప్రఖ్యాత కంపెనీలను టేకోవర్ చేస్తున్నాయి. విదేశీ సంస్థలతో కలిసి సంయుక్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇవి అంతర్జాతీయ వాణిజ్యంపై పరిజ్ఞానం ఉన్న ఫారిన్ ట్రేడ్ నిపుణులను విరివిగా నియమించుకుంటున్నాయి. మరోవైపు మనదేశం నుంచి ఎగుమతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఫారిన్‌ట్రేడ్ నిపుణులకు అవకాశాలు మెరుగవుతున్నాయి. నిపుణుల కొరత: ప్రస్తుతం చాలా సంస్థలు ఇంటర్నేషనల్ మార్కెట్లో పాగా వేసేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి. బ్యాంకులు, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. షిప్పింగ్ లైన్స్, ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీలు, ఎక్స్‌పోర్టు హౌసెస్, కరెన్సీ ట్రేడింగ్ ఏజెన్సీల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అంతేకాకుండా గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, కార్గో వంటివాటిలోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఏజెన్సీల్లో ఫారిన్ ట్రేడ్ నిపుణుల కొరత వేధిస్తోంది. ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్‌లోనూ వీరి అవసరం ఎంతో ఉంది. అర్హతలు: ఫారిన్ ట్రేడ్‌పై మనదేశంలో లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ కోర్సులను విద్యాసంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఐఐఎఫ్‌టీ, ఐఎస్బీ, ఐఐఎంలలో స్పెషలైజ్డ్ కోర్సులు ఉన్నాయి. గ్రాడ్యు యేషన్ పూర్తయిన తర్వాత వీటిలో చేరొచ్చు. టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నాయి. వేతనాలు: ఫారిన్ ట్రేడ్ నిపుణులకు మంచి వేతన ప్యాకేజీలు లభిస్తాయి. ట్రైనీకి ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలు, ఎగ్జిక్యూటివ్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు, జూనియర్ మేనేజర్‌కు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు, మేనేజర్‌కు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వేతనం ఉంటుంది. ఫారిన్ ట్రేడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: - ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ) వెబ్సైట్: www.iift.edu - సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ వెబ్సైట్: www.siib.ac.in - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కోర్సు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in - ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ వెబ్సైట్: www.ipeindia.org కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి ‘‘గ్లోబలైజేషన్‌తో అంతర్జాతీయంగా వ్యాపార లావాదేవీలు విస్తృతమయ్యాయి. దీనికి తగినట్లుగా నైపుణ్యవంతమైన మానవ వనరుల అవసరం నానాటికీ పెరుగుతోంది. మేనేజ్మెంట్ కోర్సుల్లో ఫారిన్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్‌కు డిమాండ్ పెరగడానికి కారణం కూడా అదే. అవకాశాలను అందిపుచ్చుకోవడం కేవలం డిగ్రీతోనే సాధ్యం కాదు. దానికి అవసరమైన మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని అభివృద్ధి చేసుకోవాలి. విదేశీ వాణిజ్య వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి. ఎంబీఏలో కేవలం సబ్జెక్టుగా ఉండే ఫారిన్ ట్రేడ్‌కు ప్రత్యేక కరిక్యులమ్‌ను రూపొందించి మరింతగా విద్యార్థుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. కెరీర్లో రాణించేందుకు మార్గం చూపే ఈ కోర్సును ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో పూర్తిచేస్తే మంచి వేతనాలు అందుకోవచ్చు’’ -ప్రొఫెసర్ బి.కృష్ణారెడ్డి, డీన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఓయూ -
సందడిగా నుమాయిష్
అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఈ 74వ నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 1 బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నుమాయిష్‌లో దాదాపు 50 శాతం స్టాళ్లు ఏర్పాటుకాగా మిగతా స్టాళ్ల ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి మరిన్ని స్టాళ్లు ప్రారంభం కానున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి అశ్వినీ మార్గం తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ రంగానికి చెందిన పరిశ్రమల స్టాళ్లు నుమాయిష్‌లో ఆకట్టుకుంటుండడంతో రెండో రోజు సందర్శకుల తాకిడి కనిపించింది. అన్ని రకాల వస్తువులు... నుమాయిష్‌లో ఏర్పాటు చేసిన వివిధ సంస్థల స్టాళ్లలో అన్నిరకాల వస్త్రాలు, వస్తువులు, గృహోపకరణాలు, మ హిళాలంకరణ సామగ్రి, ఫ్యాన్సీ డ్రస్ మెటీరియల్, ఫు ట్వేర్, డ్రైఫ్రూట్స్, వంట వస్తువులు, పిల్లల ఆట వస్తువు లు, క్రీడా పరికరాలు, మ్యాజిక్ టాయీస్, ఫ్లోర్‌మ్యాట్, కర్టెన్స్, బెడ్షీట్స్లతోపాటు రకరకాల వస్తువులు నుమాయిష్‌లో కొలువుదీరాయి. అన్ని రకాల వస్తువులు నుమాయిష్‌లో అందుబాటులో ఉండడం ఎంతో సౌలభ్యంగా ఉందని సందర్శకులు పేర్కొంటున్నారు. చిన్నారుల కేరింతలు... నుమాయిష్‌లో ప్రజలకు వినోదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ఎమ్యూజ్మెంట్ విభాగం చిన్నారుల కేరింతలతో కోలాహలంగా మారింది. ఎమ్యూజ్మెంట్లో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, టోరా టోరా, హెలికాప్టర్, రోలింగ్ కప్‌సాసర్, రోలింగ్ టవర్, ఫ్రిజ్బీ, రేంజర్‌తోపాటు మోటారు బైక్‌లపై యువకుల సాహస విన్యాసాలు, సర్కస్ ఫీట్లు చిన్నారులతోపాటు పెద్దలను అలరిస్తున్నాయి. నోరూరిస్తున్న ఫుడ్‌కోర్టులు... నుమాయిష్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్టులు రుచికరమై న వంట కాలతో సందర్శకుల నోరూరిస్తున్నాయి. సందర్శకుల అభిరుచి మేరకు ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్టు స్టాళ్ల లో చాట్‌బండార్, ఎగ్ఫాస్టుఫుడ్, వెజిటేరియన్ ఫాస్ట్‌ఫు డ్ తదితర రుచికరమైన వంటకాలతోపాటు ఫ్రూట్జ్యూ స్లు, స్వీట్లు, హాట్ చిప్స్, షుగర్ క్యాండీ, ఐస్ క్రీమ్‌లు ఆరగిస్తూ సందర్శకులు రుచులను ఆస్వాదిస్తున్నారు. భారీ బందోబస్తు... ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనున్న నుమాయిష్‌కోసం నిర్వాహకులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులతోపాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన 200 మంది సెక్యూరిటీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎగ్జిబిషన్ మైదానం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిఘాను కట్టుదిట్టం చేశారు. మూడు ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రైమ్ మెటల్ డిటెక్టర్స్, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లతో సందర్శకులను తనిఖీలు చేసి లోనికి అనుమతిస్తున్నారు. ముందు జాగ్రత్తగా జనరేటర్లు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు.