365 రోజులు వ్యాపార వాణిజ్య సంస్థలు
అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య సంస్థలను 365 రోజులూ తెరిచి ఉంచి లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటును మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు కార్మిక శాఖ గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. షాపులు, ఇతర సంస్థలు ఆదివారాలు, ప్రకటిత సెలవు దినాల్లో మూసివేసే పద్ధతి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని షాపులు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలను ఏడాది పొడవునా తెరిచి ఉంచే అవకాశం కల్పించారు.
ప్రయోగాత్మకంగా ఏడాది పాటు ఈ విధానం అమలు చేశారు. బుధవారంతో ఈ గడువు ముగిసిన నేపథ్యంలో నిర్వహించిన సీఎం సమీక్షలో ఈ విధానం బాగుందని తేలడంతో మరో మూడేళ్లు కొనసాగించాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా షాపులు తెరిచి ఉంచినా, కార్మికుల హక్కులకు భంగం కలగనీయొద్దన్న సీఎం సూచనలకు అనుగుణంగా కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులోని వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలి. ప్రతీ కార్మికుడు, ఉద్యోగితో గరిష్ఠంగా రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలు మాత్రమే పని చేయిం చాలి. వారానికి కచ్చితంగా ఒక రోజు సెలవు ఇవ్వాలి. ఎక్కువ గంటలు పని చేస్తే దాన్ని వేతనాల రిజిస్టర్లో నమోదు చేయాలి. రాత్రి 8.30 గంటల తర్వాత మహిళా ఉద్యోగులు, సిబ్బందితో పని చేయించాల్సి వస్తే, సదరు మహిళలు రాత్రి వేళ ఇంటికి వెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించాలి. ఉద్యోగులకు జీతాలను వారి బ్యాంకు ఖాతాల్లో వేయాలి. ప్రతీ ఉద్యోగికి అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వాలి. అర్హులైన ఉద్యోగులకు ఈఫీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి.