
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న ఆప్ అదినేత కేజ్రీవాల్ మరో సమస్యలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటున్న సమయంలో కేజ్రీవాల్ నివసించిన ఢిల్లీలోని ప్రభుత్వ భవనంలో అవినీతికి పాల్పడుతూ, అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ వచ్చిన ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణకు ఆదేశించింది. అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత, రోహిణి ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు.
శీష్ మహల్ (సీఎం ప్రభుత్వ బంగ్లాకు బీజేపీ పెట్టిన పేరు)పై విజేంద్ర గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదుపై సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆయన 2024 అక్టోబర్ 14న సీవీసీకి దీనిపై ఫిర్యాదు దాఖలు చేశారు. 40,000 చదరపు గజాల (8 ఎకరాలు) విస్తీర్ణంలో శీష్ మహల్ నిర్మించడానికి కేజ్రీవాల్ భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై 2024, అక్టోబర్ 16న సీవీసీ దర్యాప్తు ప్రారంభించింది. వాస్తవ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని నాడు హామీ ఇచ్చింది. 2025, ఫిబ్రవరి 13న వాస్తవ నివేదికను పరిశీలించిన తర్వాత, ఈ విషయంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహించాలని సంబంధిత ఉన్ననాధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి నివాసం, దాని పునరుద్ధరణ, ఇంటీరియర్ డెకరేషన్ కోసం జరిగిన వృధా ఖర్చుపై దర్యాప్తుకు సంబంధించి సీవీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసిన దరిమిలా ఇప్పుడు దీనిపై చర్యలు తీసుకోనున్నారు.
ఢిల్లీ మాజీ సీఎం అధికార నివాసానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు బీజేపీ నేత విజేందర్ గుప్తా సీవీసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. శీష్ మహల్‌ని ఆధునీకరిస్తూ, టాయిలెట్‌లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్‌పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బంగ్లాను ఆధునీకరించడంలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు కూడా పలుమార్లు విమర్శించారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు?
Comments
Please login to add a commentAdd a comment