
ప్రపంచ పర్యాటకంలో భారత్ కీలక పాత్ర
విలాసవంతమైన అనుభూతి కోసం భారీ ఖర్చుకూ వెనుకాడని భారత పర్యాటకులు
విదేశీ పర్యటనకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చు
భారత పర్యాటకులను ఆకర్షించేందుకు వీసా ప్రక్రియ సులభతరం చేస్తున్న వివిధ దేశాలు
సాక్షి, అమరావతి: ప్రపంచ పర్యాటక రంగ పునర్నిర్మాణంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విదేశీ గమ్యస్థానాలను అన్వేషించడంలో ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎంత ఖర్చయినా.. ప్రపంచాన్ని చుట్టేసేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో భారత పర్యాటకులను ఆకర్షించడానికి ప్రపంచ దేశాలు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. వీసా లేకుండానే తమ దేశాల్లో పర్యటించే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి.
ఖర్చుకు వెనుకాడట్లేదు..
కరోనా అనంతర పరిస్థితుల్లో భారతీయుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని అంతర్జాతీయ టూరిస్ట్ ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి. విదేశాల్లో పర్యటించేందుకు.. కొత్త అనుభూతి పొందేందుకు భారతీయులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడట్లేదని పేర్కొంటున్నాయి. భారత పర్యాటకుడు ఒక్కో అంతర్జాతీయ పర్యటనకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాయి. ఈ ఖర్చు క్రమంగా పెరుగుతోందని వెల్లడించాయి.
కాగా, 2023లో 2.82 లక్షల మంది విదేశాలకు ప్రయాణించడం ద్వారా రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేశారని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ తెలిపింది. దేశంలో అవుట్‌బౌండ్ ట్రావెల్ మార్కెట్‌లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోందని.. 2034 నాటికి రూ.4.78 లక్షల కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. అలాగే భవిష్యత్‌లో అవుట్ బౌండ్ పర్యాటకులు 8 కోట్లకు చేరుకుంటారని.. ముఖ్యంగా ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం దేశాలకు ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తోంది. ఇది భారత పర్యాటకుల విలాసవంతమైన జీవనశైలి అభివృద్ధిని సూచిస్తోందని, పెరుగుతున్న ఆదాయ మార్గాలు కూడా సరిహద్దుల దాటి ప్రయాణాలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయని అభిప్రాయపడింది.
మెరుగైన ఆతిథ్యం..
భారత పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ దేశాలు ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నాయి. థాయిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఎంట్రీ ప్రోటోకాల్‌లను సరళీకృతం చేశాయి. యూఏఈ, టర్కీ తదితర దేశాలు భారతదేశంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. అలాగే పలు దేశాలు అంతరాయం లేని కనెక్టివిటీ, అవాంతరాలు లేని వీసా ప్రక్రియలను అందజేస్తున్నాయి. యూరప్, ఉత్తర అమెరికాకు వీసాల కోసం ఎక్కువ నిరీక్షించాల్సి రావడంతో.. భారత పర్యాటకులు ఎక్కువగా మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలకు తరలి వెళ్తున్నారు.
అలాగే భారత పర్యాటకుల కోసం హాస్పిటాలిటీ దిగ్గజ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అకార్, హిల్టన్, ఐహెచ్‌జీ వంటి హాస్పిటాలిటీ సంస్థలు తమ చైన్‌లను ప్రధాన నగరాల నుంచి టైర్ 2, 3 పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తున్నాయి. విమానయాన సంస్థలు కూడా దేశీయ, అంతర్జాతీయ సామర్థ్యాలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment