Piyush Goyal unveils foreign trade policy 2023 - Sakshi
Sakshi News home page

ఎగుమతుల లక్ష్యం.. 2 ట్రిలియన్‌ డాలర్లు

Published Sat, Apr 1 2023 3:25 AM | Last Updated on Sat, Apr 1 2023 1:56 PM

Piyush Goyal unveils Foreign Trade Policy 2023 - Sakshi

ఎఫ్‌టీపీ 2023ని ఆవిష్కరిస్తున్న వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ తదితరులు

న్యూఢిల్లీ: ఎగుమతులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్‌టీపీ)ని భారత్‌ ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్‌ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించింది. అంతేకాకుండా ఈకామర్స్‌ ఎగుమతులకు ప్రోత్సాహకాలను అందించాలని కూడా ప్రతిపాదించింది.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం ప్రవేశపెట్టిన ఎఫ్‌టీపీ 2023 ప్రకారం రాయితీల జమానా నుండి ప్రోత్సాహకాల దిశగా మారేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఎగుమతిదారులు, రాష్ట్రాలు, జిల్లాలు, భారతీయ మిషన్‌ల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించనున్నారు. లావాదేవీల వ్యయాన్ని తగ్గించడం, మరిన్ని ఎగుమతి హబ్‌లను అభివృద్ధి చేయడం కూడా తాజా పాలసీలో భాగం.

డైనమిక్‌ పాలసీ...
గతంలో అయిదేళ్లకోసారి ప్రకటించే ఎఫ్‌టీపీల మాదిరిగా కాకుండా ఈసారి ప్రభుత్వం డైనమిక్‌ అలాగే పరిస్థితులకు అనుగుణంగా స్పందించే పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీకి గడువు ముగింపు అంటూ ఏదీ ఉండదు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా పాలసీని సవరిస్తారు. ‘ఈ పాలసీకి గడువు తేదీ ఏదీ లేదు, కాలానుగుణంగా మార్పులు చేయడం జరుగుతుంది’ అని పాలసీ ఆవిష్కరణ అనంతరం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీటీఎఫ్‌టీ) సంతోష్‌ సారంగి పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు మరిన్ని ప్రాంతాలకు భారీగా విస్తరించే విధంగా వాణిజ్య శాఖ చర్యలు చేపడుతుందని మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. రంగాల వారీగా లేదంటే దేశాల వారీగా దృష్టి పెడతామన్నారు. వచ్చే 4–5 నెలల్లో విదేశాల్లోని భారతీయ మిషన్‌లతో కలిసి వాణిజ్య శాఖ ఈ దిశగా చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. ‘2030 నాటికి 2 ట్రలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవాలనేది మా లక్ష్యం.

దీన్ని సాధిస్తామన్న నమ్మకం ఉంది. అయితే వస్తు ఎగుమతులు, సేవల ఎగుమతులను అధిగమించాలని మేము భావించడం లేదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారంతో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుండి వస్తు, సేవల ఎగుమతులు 765 బిలియన్‌ డాలర్లను అధిగమించనున్నాయని డీజీఎఫ్‌టీ తెలిపారు. 2021–22లో ఈ మొత్తం ఎగుమతుల విలువ 676 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

రూపాయికి గ్లోబల్‌ హోదా...
అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలని ఎఫ్‌టీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, విదేశీ వాణిజ్య లావాదేవీలకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశీ కరెన్సీలో సెటిల్‌మెంట్లకు ఎగుమతి ప్రయోజనాలను కల్పించనున్నారు. ‘కరెన్సీపరమైన సంక్షోభాలు, లేదంటే డాలర్లకు కొరత ఉన్న దేశాలతో రూపాయిల్లో వాణిజ్య లావాదేవీలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌ పేర్కొన్నారు.

కాగా, యంత్రపరికరాల ఎగుమతి ప్రోత్సాహక (ఈపీసీజీ) స్కీమ్‌ అలాగే ముందస్తు అనుమతులకు ప్రతిగా ఎగుమతి బాధ్యతలను (ఈఓ) నెరవేర్చడంలో విఫలమైన ఎగుమతిదారులకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కోసం క్షమాబిక్ష స్కీమ్‌ను కూడా తాజా ఎఫ్‌టీపీలో పొందుపరిచారు. దీని ప్రకారం ఈఓల విషయంలో డిఫాల్ట్‌ అయిన పెండింగ్‌ కేసులన్నింటినీ క్రమబద్దీకరిస్తారు. దీనికోసం మినహాయింపు పొందికస్టమ్స్‌ సుంకాలను, అలాగే 100% వడ్డీతో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఆచరణాత్మక పాలసీ..
ఎఫ్‌టీపీ 2023ని కార్పొరేట్‌ వర్గాలు స్వాగతించాయి. ప్రపంచ వాణిజ్యంలో భారత వాటాను పెంచేలా ఆచరణాత్మక, సానుకూలమైన పాలసీగా పరిశ్రమ చాంబర్లు, ఎగుమతిదారులు దీన్ని అభివర్ణించారు. 2 ట్రిలియన్‌ డాలర్ల వస్తు, సేవల ఎగుమతి లక్ష్యాన్ని సాధించేలా అనేక వినూత్న చర్యలను పాలసీలో ప్రకటించారని భారతీయ పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. ఈ కొత్త పాలసీ అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌ వాటాను భారీగా పెంచేందుకు దోహదం చేస్తుందని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ వ్యాఖ్యానించారు.

పాలసీలో ఇతర చర్యలు...
► జిల్లాలను ఎగుమతి హబ్‌లుగా చేసేందుకు రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో కలిసి పనిచేయడంపై కూడా ఎఫ్‌టీపీ 2023 దృష్టిపెట్టింది.
► యూఏవీ/డ్రోన్స్, క్రయోజనిక్‌ ట్యాంక్స్,  ప్ర త్యేక రసాయనాల వంటి ద్వంద్వ వినియోగ హై ఎండ్‌ ఉత్పత్తులు, టెక్నాలజీల ఎగుమతుల కోసం సరళమైన పాలసీలపై దృష్టిసారిస్తారు.
► ఈకామర్స్‌ ఎగుమతులకు ఎగుమతి ప్రయోజనాలను ప్రత్యేకంగా అందించాలని పాలసీ నిర్దేశించింది. కొరియర్‌ ద్వారా ఎగుమతుల విలువ పరిమితిని రెంట్టింపు చేస్తూ, ఒక్కో కన్‌సైన్‌మెంట్‌ను రూ.10 లక్షలకు చేర్చనున్నారు. కాగా, ఈకామర్స్‌ అగ్రిగేటర్లకు స్టాకింగ్, కస్టమ్స్‌ అనుమతులు, రిటర్న్‌ల ప్రక్రియను సులభతం చేసేందుకు గిడ్డంగి సదుపాయంతో కూడిన ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.  2030 నాటికి ఈకామర్స్‌ ఎగుమతులు 200–300 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందుతాయని అంచనా.
► అన్ని రకాల బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాలు (బీఈవీ), వర్టికల్‌ సాగు యంత్రాలు, మురుగునీటి శుద్ధి, రీసైక్లింగ్, వర్షపు నీటి ఫిల్లర్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌లను పర్యావరణహిత టెక్నాలజీ ఉత్త్పత్తుల్లోకి చేర్చారు. తద్వారా ఈపీసీజీ స్కీమ్‌ ప్రకారం వీటిపై ఎగుమతి పరమైన నియంత్రణలు తగ్గుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement