న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 0.4 శాతం పెంచి 4.4 శాతానికి చేర్చడంతో బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. ఐసీఐసీఐ, బీఓబీ, బీఓఐ, సెంట్రల్ బ్యాంకులు తమ రుణ రేట్లను సవరించాయి. ఆయా రేట్లు పెంపు నిర్ణయాలను పరిశీలిస్తే..
► తక్షణం అమల్లోకి వచ్చే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్‌ఆర్)ను 8.10 శాతానికి పెంచింది. ఆర్‌బీఐ పాలసీ రెపో రేటును ఈబీఎల్‌ఆర్ ప్రతిబింబిస్తుంది. రెపోరేటుకు అనుగుణంగా ఈబీఎల్‌ఆర్ కదలికలు ఉంటాయి.
► బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రేటును (బీఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) 6.90%కి పెంచింది. తక్షణం ఈ రేటు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రెపో 4.40 శాతానికి ఇది 2.50% అదనమని వివరించింది. బ్యాంక్ రిటైల్ రుణాలకు ఇది వర్తిస్తుంది. రిటైల్ రుణాలకు వర్తింపజేసేందుకు వీలుగా 2019 అక్టోబర్ నుంచి రుణాలకు బీఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ ప్రాతిపదికను బీఓబీ అమలు చేస్తోంది.
► బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) తన ఆర్‌బీఎల్‌ఆర్ (రెపో ఆధారిత రుణ రేటు)ను రెపోరేటు పెంపునకు అనుగుణంగా 7.25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది.
► ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఎల్‌ఆర్ 0.40 శాతంమేర పెరిగి 7.25 శాతానికి చేరింది. 6వ తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది.
వరుసలో ఎస్‌బీఐ...!
బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్‌ఆర్ ) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రేటు అమల్లో ఉంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎస్‌బీఐ సమీక్షిస్తున్నట్లు సమాచారం. రుణ సమీకరణ ఆధారిత వ్యయాలను గత నెల ఎస్‌బీఐ 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఎస్‌బీఐ బెంచ్‌మార్క్ ఏడాది ఎంసీఎల్‌ఆర్ 7.10 శాతంగా ఉంది. ఎస్‌బీఐ కస్టమర్లు పెద్ద సంఖ్యలో ఈ రేటు ప్రాతిపదికగానే రుణాలు తీసుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 2019న కీలక ఆదేశాల జారీ చేస్తూ, వ్యక్తిగత లేదా రిటైల్, సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) రుణాలకు సంబంధించి ఫ్లోటింగ్ రేట్లకు బెంచ్‌మార్క్‌గా రెపో రేటు ఉండాలని బ్యాంకింగ్‌ను ఆదేశించింది. అదే ఏడాది అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
కోటక్ మహీంద్ర బ్యాంక్ డిపాజిట్ రేటు పెంపు
ప్రైవేటు రంగంలోకి కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్ని కాలపరిమితుల స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.35 శాతం పెంచింది. రూ.2 కోట్ల దిగువ డిపాజిట్లన్నింటికీ తాజా రేటు పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం, 390 రోజుల వరకూ డిపాజిట్ రేటు 0.30# పెరిగి 5.5 శాతానికి చేరింది. 23 నెలలకు రేటు 0.35% పెరిగి 5.6%కి ఎగసింది. సీనియర్ సిటిజన్లు 23 నెలలు, ఆపైన డిపాజిట్ల విషయంలో 6.10 శాతం వడ్డీరేటు పొందుతారు. ‘దాదాపు రెండు సంవత్సరాల తక్కువ వడ్డీరేటు ఆర్థిక వ్యవస్థలో తాజా పెంపు పరిణామం ఒక సువర్ణావకాశం. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి బ్యాంకుల వరుసలో కోటక్ ఒకటి. వినియోగదారులు తమ కీలక లక్ష్యాల కోసం పొదుపు చేసేందుకు అలాగే తమ పొదుపుపై పెరిగిన రాబడిని పొందేందుకు ఇదే సరైన సమయం’’ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ (రిటైల్, బ్రాంచ్ బ్యాంకింగ్) గ్రూప్ ప్రెసిడెంట్ విరాట్ దివాన్‌జీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment