repo rates
-
కీలక వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం ఇదేనా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో వడ్డీ రేట్లపై ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఆర్బీఐ ఎంపీసీ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. అనంతరం ఎంపీసీ సమావేశంలోని నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించనున్నారు. అయితే ఈ తరుణంలో ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!
రెపోరేట్ల పెంపుతో బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ, ప్రభుత్వ రంగం బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ రుణ రేట్లను పెంచాయి. అయితే తాజాగా మరో ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’(బీవోబీ) ఎంసీఎల్ఆర్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. నవంబర్ నెలలో బీవోబీ ఎంసీఎల్ఆర్ రేటును పెంచింది. అప్పుడు రేట్ల పెంపు 15 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఈ రుణ రేటు పెంపు నిర్ణయం డిసెంబర్ 12 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెరగడం వల్ల హౌసింగ్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, ఎంఎస్ఈ (Small Medium Enterprises) లోన్స్ వంటివి భారం కానున్నాయి. ఇప్పటికే లోన్ తీసుకున్న వారు రీసెట్ డేట్ నుంచి అధిక వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో బ్యాంకులకు కట్టే నెలవారీ ఈఎంఐ పెరుగుతుంది. బీవోబీలో ఎంసీఎల్ రేట్లు ఇక బీవోబీ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేటు 8.3 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతం నుంచి 8.05 శాతానికి చేరింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.9 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. -
భారత్ ఆర్థిక వ్యవస్థ భేష్, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తాం : నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో ఆకర్షణీయంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి వ్యక్తమవుతోందన్నారు. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిల్లో ఉందన్న ఆందోళనలు వినిపిస్తుండగా.. దీన్ని నియంత్రించగలమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇది పారిశ్రామిక శకం అంటూ.. ఎన్నో ఫండ్స్ భారత్‌కు రానున్నట్టు చెప్పారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతారామన్ ప్రసంగించారు. ‘‘మన ద్రవ్యోల్బణం నియంత్రించతగినదే. ఆర్బీఐ ప్రకటన కూడా మార్కెట్లకు ఎంతో సానుకూల సందేశాన్నిచ్చింది’’అని ఆమె పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ గత వారం అర శాతం మేర రెపో రేటును పెంచడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ‘‘భారత్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న సావరీన్ ఫండ్స్, పెద్ద ఫండ్స్‌తో ప్రభుత్వం చురుగ్గా చర్చలు నిర్వహిస్తోంది. విలీనాలు, కొనుగోళ్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఎందుకంటే భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంతో ఆకర్షణీయంగా, మెరుగ్గా ఉంది. ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. అందుకే ఎంతో మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు’’అని మంత్రి సీతారామన్ చెప్పారు. ఐబీసీ ఆకర్షణ కోల్పోకూడదు.. ‘‘మనకు మంచి నిపుణులు అవసరం. లిక్విడేషన్ ఎలా చేయాలి? ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీని అత్యుత్తమంగా ఎలా నిర్వహించాలో తెలిసి ఉండాలి. ఐబీసీ చట్టం తన ఆకర్షణను కోల్పోతే దాన్ని మనం తట్టుకోలేం. ఈ చట్టం ఉద్దేశ్యాలను కాపాడుకోవాల్సిందే’’అని మంత్రి అన్నారు. ఐబీసీ చట్టం కింద కేసుల స్వీకరణకు తీవ్ర జాప్యం చోటు చేసుకోవడం, పరిష్కారాలకు కూడా చాలా సమయం పడుతుండడం, వసూలు కావాల్సిన వాటిల్లో బ్యాంకులు గణనీయ మొత్తాన్ని నష్టపోతుండడంతో ఈ చట్టంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. -
మరోసారి వడ్డీ రేట్లు పెంచిన ఆర్ బీఐ
-
హోం లోన్ తీసుకున్నవారికి మరో భారీ షాక్ తప్పదా? ఏం చేయాలి?
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం (ఎంపీసీ) ఆగస్టు 3 బుధవారం ప్రారంభం కానుంది. అయితే రెపో రేటు బాదుడు తప్పదనే అంచనాల మధ్య హోం లోన్ రేట్లు ఎంత పెరుగుతాయోననే ఆందోళన వినియోగదారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ద్రవ్యోల్బణానికి చెక్ చెప్పేలా ఆర్బీఐ వరుసగా మూడోసారి రెపో రేటును పెంచే అవకాశం ఉందని మార్కెట్‌వర్గాలు, ఇటు నిపుణులు భావిస్తున్నారు. (నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ) ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ తాజా రివ్యూలో రెపో రేట్లను పెంచే అవకాశాలపైనే ఎక్కువ అంచనాలు కనిపిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపు 35-50 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. అంచనాలకనుగుణంగా రెపో రేటు పెరిగితే, అనివ్యారంగా బ్యాంకులు కూడా మొత్తం రేటు పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. రెపో రేటు పెరిగితే ఆర్బీఐకి బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్ల మీదే వేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంటిలోన్లపై భారం తప్పదు. ఉదా: రూ. 50 లక్షల రుణం, 7.65 శాతం వడ్డీతో 20 సంవత్సరాల కాలవ్యవధితో ఉన్న లోన్‌పై వడ్డీ రేటు 0.50 శాతం పెంచితే, వడ్డీ రేటు 8.15కి పెరుగుతుంది అనుకుంటే, రుణ వ్యవధిని రెండేళ్లు పొడిగింపు ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే లోన్ కాలం రెండేళ్లు పొడిగించడంతో ఖచ్చితంగా రూ. 10.14 లక్షలు అదనపుభారం తప్పదు. ఒకవేళ చెల్లించాల్సిన కాలం కాకుండా, ఈఎంఐ భారాన్ని పెంచుకుంటే.. ఉదా: 20 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 50 లక్షల రుణంపై, వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని భావిస్తే.. మునుపటి ఈఎంఐ రూ. 40,739తో పోలిస్తే రూ. 42,289 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటి రుణం తీసుకున్న వారు ఏ సిస్టంలో ఉన్నారో చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం ఈఎంఐ పెంచుకోవడమా, కాల వ్యవధిని పెంచుకోవడమా అనేది రుణగ్రహీత జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇప్పటికే లోబడ్జెట్‌లో ఉండి ఉంటే పొదుపు, ఖర్చులపై దెబ్బపడకుండా లోన్ టెన్యూర్‌ను లేదా ఈఎంఐని పెంచుకోవడంమంచిది. అలాగే ఏ ఆప్షన్ ఎంచుకన్నా, దీర్ఘకాలిక రాబడి, భవిష్యత్తు అవసరాలకోసం ఎంతో కొంత పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) కాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని పాలసీ కమిటీ మూడు రోజుల పాటు సమావేశం కానుంది. పాలసీ విధానాన్ని శుక్రవారం (ఆగస్టు 5న) ప్రకటించనుంది. అయితే ఈ సారి రివ్యూలో కూడా రేటు పెంపు తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ మే 4, 2022 నుండి రెపో రేటును 0.9 శాతం పెంచింది. ఫలితంగా 6.72 శాతం వద్ద గృహ రుణం తీసుకున్న వారు ఇప్పుడు 7.62 శాతం చెల్లించాల్సి వస్తోంది. గత రెండు మానిటరీ పాలసీ సమావేశాల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇటీవల అమెరికా ఫెడ్ రికార్డు స్థాయిలో 75 బేసిస్ పాయింట్లు రేట్లు పెంచింది. అలాగే ఆ తరువాత కూడా పెంపు ఉంటుందనే సంకేతాలు అందించింది. -
Repo rate rise: రేట్లకు రెక్కలు.. ఏం చేద్దాం?
ఈ ఏడాది ఏప్రిల్ వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు 6.5 శాతం. ఇళ్ల కొనుగోలుదారులను ఈ రేటు ఎంతో ఆకర్షించింది. కనిష్ట రేటును చూసి ఇళ్లను కొనుగోలు చేసిన వారు ఎందరో..? పాశ్చాత్య దేశాల మాదిరే మన ఆర్థిక వ్యవస్థ కూడా తక్కువ రేట్ల దిశగా అడుగులు వేస్తుందన్న విశ్లేషణలు అంతకుముందు వరకు వినిపించాయి. కానీ, కేవలం కొన్ని నెలల్లోనే పరిస్థితులు మారిపోయాయి. రుణ రేట్లు సుమారు ఒక శాతం మేర పెరిగాయి. ఆర్బీఐ రెపో రేటును 0.90 శాతం మేర పెంచింది. ఇది కచ్చితంగా రుణ గ్రహీతలపై భారం మోపేదే. రేట్ల పెంపు కథ ఇంతటితో ముగియలేదు. ఇప్పుడే మొదలైంది. మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ తరుణంలో రేట్ల పెంపు ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది..? గృహ రుణాలు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి..? తీసుకోబోయే వారి ముందున్న మార్గాలు ఏంటన్న విషయాలను చర్చించే కథనమే ఇది. 80 శాతం రిటైల్ రుణాలు ఫ్లోటింగ్ రేటు ఆధారితంగానే ఉంటున్నాయి. కనుక ఆర్బీఐ రేట్ల సవరణ ప్రభావం దాదాపు అన్ని రకాల రిటైల్ రుణాలపైనా ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా ఈబీఎల్ఆర్ను గృహ రుణాలను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టిందేనని గుర్తు పెట్టుకోవాలి. రిటైల్ రుణాల్లో సగానికి పైన గృహ రుణాలే ఉన్నాయి. కనుక బ్యాంకులు వేగంగా గృహ రుణ రేట్లను సవరించాయి. కారు, ద్విచక్ర వాహన రుణాలపైనా అదనపు భారం పడింది. అయితే ఈ విభాగంలోని మొత్తం రుణాల్లో ఈబీఎల్ఆర్కు అనుసంధానమై ఉన్నవి 40 శాతం కంటే తక్కువ. ఈ తరహా రుణాలకు ఈబీఎల్ఆర్ కంటే ముందు విధానమైన ఎంసీఎల్ఆర్నే బ్యాంకులు అనుసరిస్తున్నాయి. బ్యాంకులు రెపో మాదిరే గృహ రుణాలపై 0.90 శాతం పెంపును అమలు చేయగా.. ఇతర రుణ ఉత్పత్తులపై పెంపు వాటి విచక్షణకు అనుగుణంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకు కారు రుణంపై రేటును 7.45 శాతం నుంచి 8.5 శాతానికి పెంచగా.. ఎస్బీఐ 7.2 శాతం నుంచి 7.7 శాతానికి సవరించింది. ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్ వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో ఉన్నాం. కనుక గృహ రుణం తీసుకునే వారు డౌన్ పేమెంట్ (తన వంతు వాటా) ఎక్కువ సమకూర్చుకోవడం ఒక మార్గం. ఎక్కువ సమకూర్చుకునేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు ‘హోమ్‌లోన్ ఇంటరెస్ట్ సేవర్ అకౌంట్’ లేదా ‘స్మార్ట్లోన్’ను పరిశీలించొచ్చు. ఒక్కో బ్యాంకు ఒక్కో పేరుతో ఈ తరహా రుణాలను మార్కెట్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు ‘మనీ సేవర్ హోమ్ లోన్’, ఎస్బీఐ ‘మ్యాక్స్ గెయిన్ హోమ్‌లోన్’, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ‘హోమ్ సేవర్’ అనేవి ఈ తరహా రుణ ఉత్పత్తులే. రెండు ప్రయోజనాలు.. ఈ రుణం కరెంటు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. మీ దగ్గర ఉన్న మిగులు బ్యాలన్స్ ఎంతైనా కానీయండి ఈ కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసుకుంటే చాలు. ఆ మేరకు రుణంపై వడ్డీ భారం తగ్గిపోయినట్టే. ఉదాహరణకు మీరు రూ.50 లక్షల గృహ రుణాన్ని ఇంకా చెల్లించాల్సి ఉందనుకుంటే.. రూ.5 లక్షలు మిగులు మీ వద్ద ఉంటే దాన్ని కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసుకోవాలి. అప్పుడు గృహ రుణం రూ.45 లక్షలపైనే వడ్డీ పడుతుంది. మరొక ప్రయోజనం ఏమిటంటే.. మిగులు రూ.5లక్షలను కరెంటు ఖాతా నుంచి ఎప్పుడైనా వెనక్కి తీసేసుకోవచ్చు. కనుక మిగులు నిల్వలను ఈ ఖాతాలో ఉంచుకోవడం ద్వారా గృహ రుణంపై వడ్డీ భారాన్ని కొంత దింపుకోవడం ఇందులో ఉన్న అనుకూలత. మంచి మార్గం అందరూ కాకపోయినా.. కొందరు అయినా అత్యవసర నిధి అంటూ కొంత మొత్తాన్ని నిర్వహిస్తుంటారు. కొందరు బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఉంచేస్తుంటారు. లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టేవారు కూడా ఉన్నారు. ఇలా ఉంచేయడానికి బదులు ఆ మొత్తాన్ని తీసుకెళ్లి హోమ్‌లోన్ ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్లో ఉంచుకోవడం మంచి మార్గమని ఆర్థిక సలహాదారుల సూచన. మిగులు నిల్వలు ఏవైనా కానీ ఈ ఖాతాలో ఉంచుకోవడం వల్ల వడ్డీ భారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చని లాడర్7వెల్త్ ప్లానర్స్ ప్రిన్సిపల్ ఆఫీసర్ సురేష్ సెడగోపన్ సూచించారు. వడ్డీ రేటు వేరు సాధారణ గృహ రుణాలతో పోలిస్తే,, ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్‌తో కూడిన రుణాలపై వడ్డీ రేటు 0.5–0.6 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మిగులు నిల్వలు లేని వారికి ఇదేమంత ప్రయోజనం కాదు. వేతన జీవులు, వ్యాపారులు సాధారణంగా తమ అవసరాల కోసం మిగులు నిల్వలు ఎంతో కొంత నిర్వహిస్తుంటారు. అటువంటి వారికి ఈ తరహా రుణం అనుకూలం. వడ్డీ ఆదా/ముందస్తు చెల్లింపు ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్‌కు బదులు రెగ్యులర్ హోమ్ లోన్ తీసుకుని.. మధ్య మధ్యలో తమకు బోనస్, ఇతర రూపాల్లో అందిన నిధులతో ముందస్తు గృహ రుణం చెల్లింపు మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా కూడా అదనపు రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు. కానీ, మిగులు నిల్వలు ఎప్పుడూ ఎంతో కొంత ఉండే వారికి.. వాటిని రాబడి మార్గంగా మలుచుకోవడం తెలియని వారికి ఇంట్రెస్ట్ సేవర్ హోమ్ లోన్ అకౌంట్ మెరుగైన మార్గం అవుతుంది. అయితే, కొన్ని బ్యాంకులే ఈ ఉత్పత్తిని ఆఫర్ చేస్తున్నాయి. ఆయా అంశాలపై ఈ విభాగంలోని నిపుణులు, బ్యాంకర్ల సలహాలను తీసుకోవాలి. ఈఎంఐ పెరుగుదల..? రూ.75 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలవ్యవధిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.5 శాతం రేటు మీద తీసుకుని ఉన్నారనుకుంటే.. నెలవారీ ఈఎంఐ రూ.55,918 అవుతుంది. గృహ రుణ రేటు 7.3 శాతానికి పెరిగిందని అనుకుంటే ఈఎంఐ రూ.59,506 అవుతుంది. సుమారు రూ.4,500 పెరిగింది. అది కూడా క్రెడిట్ స్కోరు 791కి పైన ఉన్నవారికే ఇది. 681 నుంచి 790 మధ్య క్రెడిట్ స్కోరు ఉన్న వారికి వడ్డీ రేటు 7.65 శాతం నుంచి 7.9 శాతం వరకు చేరింది. ఈ రేటు ప్రకారం చూస్తే రూ.75 లక్షల గృహ రుణం ఈఎంఐ రూ.55,918 నుంచి రూ.61,109–62,267కు పెరిగినట్టు అవుతుంది. ఏడాదికి చూసుకుంటే వడ్డీ పెంపు వల్ల పడుతున్న అదనపు భారం రూ.46,000–73,000 మధ్య ఉంది. ప్రత్యామ్నాయాలు.. ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారు ఈఎంఐ పెరగడకుండా ఉండేందుకు రుణ కాలవ్యవధిని పెంచుకోవచ్చు. నిజానికి చాలా బ్యాంకులు ఈఎంఐ పెంపునకు బదులు వాటంతట అవే రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. రుణ కాలవ్యవధి ఎంత మేర పెరుగుతుందన్న దానికి ఒక సూత్రం ఉంది. 20 ఏళ్ల కాలానికి గృహ రుణాన్ని తీసుకుని ఉంటే.. తీసుకునే నాటి రేటుపై ప్రతి పావు శాతం పెంపునకు 10 నెలల మేర కాలవ్యవధి పెరుగుతుంది. 6.5 శాతం రేటుపై గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకుని ఉన్నారనుకుంటే.. 0.90 శాతం రేటు అధికం కావడం వల్ల రుణ కాలవ్యవధి సుమారు మూడేళ్లపాటు పెరుగుతుంది. మరో 0.75శాతం మేర ఈ ఆర్థిక సంవత్సరంలో రేటు పెరుగుతుందని అనుకుంటే.. ఈఎంఐ ఇప్పటి మాదిరే ఉండాలనుకుంటే రుణ కాలవ్యవధి 5.5 ఏళ్లు పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈఎంఐ భారం కాకూడదు, రుణ కాలవ్యవధి పెరగొద్దు అనుకుంటే రుణ గ్రహీతల ముందున్న మరో మార్గం ఒకే విడత కొంత మొత్తం గృహ రుణాన్ని చెల్లించడమే. ఒకవేళ గృహ రుణం ముగియడానికి ఇంకా చాలా వ్యవధి ఉంటే, అప్పుడు పలు విడతలుగా కొంత మొత్తం చొప్పున ఈఎంఐకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం కాల వ్యవధి చివర్లో ఉంటే.. పెరిగిన మేర ఈఎంఐను కడుతూ వెళ్లాలి. లేదంటే పొదుపు, పెట్టుబడులు ఉంటే వాటితో గృహ రుణాన్ని కొంత చెల్లించేయాలి. కానీ, ఇక్కడ చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడం వల్ల పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి రావచ్చు. కనుక పన్ను పరిధిలో ఉన్న వారు లెక్కలు వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మిగులు నిల్వలు ఉంటే వాటిని గృహ రుణంగా తీర్చివేయడం కంటే పెట్టుబడి ద్వారా ఎక్కువ రాబడి వచ్చే మార్గం ఉంటే దాన్ని కూడా కోల్పోవాల్సి రావచ్చు. కనుక ఈ కోణాల నుంచి పరిశీలించాకే ఈ నిర్ణయానికి రావాలి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు రుణాన్ని పరిశీలించొచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఫిక్స్డ్ రేటుపై గృహ రుణాలను 9.6 శాతం రేటుకు ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అయితే ఇది 11.5 శాతం మేర ఉంది. కాకపోతే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి ఫ్లోటింగ్ రేటుపై రుణమే నయం. 2023 మార్చి నాటికి గృహ రుణ రేటు 8.15 శాతం! గతంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించినా, పెంచినా ఆ ప్రభావం రుణాలపై ప్రతిఫలించడానికి కొన్ని నెలలు పట్టేది. దీన్ని గమనించిన ఆర్బీఐ.. రేట్ల సవరణ సత్వరం అమలయ్యేందుకు వీలుగా.. 2019లో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును (ఈబీఎల్ఆర్) ప్రవేశపెట్టింది. దీంతో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలోనే బ్యాంకులు కూడా సవరణ చేయక తప్పని పరిస్థితి. రెపో రేటు, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఇవన్నీ ఈబీఎల్ఆర్కు ప్రామాణికం. ఆర్బీఐ నూతన విధానం నేపథ్యంలో చాలా వరకు గృహ రుణాలకు రెపో రేటు ప్రామాణికంగా మారిపోయింది. ఈ విధానం కారణంగానే 2020లో రెపో రేటు 4% కనిష్టానికి తగ్గిపోవడం వల్ల రుణ గ్రహీతలు ప్రయోజనం పొందారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపు తప్పిన క్రమంలో మళ్లీ రేట్ల పెంపు ప్రభావం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే మరో 0.75 శాతం మేర ఆర్బీఐ రేట్లను పెంచుతుందని విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తక్కువలో తక్కువ గృహ రుణ రేటు 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా రేట్లను పెంచితే 2023 మార్చి నాటికి గృహ రుణ రేటు ఎంత లేదన్నా 8.15 శాతానికి చేరుతుంది. 2019లోనూ 8 శాతం స్థాయిలోనే గృహ రుణ రేట్లు ఉన్నాయి. -
ఇక వడ్డీరేట్లు పైపైకి!
ముంబై: విశ్లేషణలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కేవలం ఐదు వారాల వ్యవధిలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను మరో అరశాతం పెంచింది. దీనితో ఈ కీలక రేటు 4.9%కి చేరింది. గత నెల 4వ తేదీన ఆర్బీఐ అనూహ్యరీతిలో బ్యాంకులకు రెపోను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెం చింది. దీనితో ఈ రేటు 4.4%కి చేరింది. మూడురోజుల భేటీ అనంతరం గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో పెంపు నిర్ణయంలో కీలక రేటు 4.9%కి ఎగసింది. మొదటి విడత పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు తమ బెంచ్‌మార్క్ రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఈ స్వల్ప వ్యవధిలోనే రెండు దఫాలుగా వడ్డీరేట్లను పెంచాయి. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు మరింత భారంగా మారనున్నాయి. అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణలో భాగంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎండీఎఫ్) రేటు అరశాతం పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీనితో ఈ రేట్లు వరుసగా 4.65%, 5.15%కి చేరాయి. ద్రవ్యోల్బణంపై అందోళన... అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్బీఐ తాజా సమీక్ష సందర్భంగా అభిప్రాయపడ్డం గమనార్హం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్ కట్టడికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికం. ఏకగ్రీవ నిర్ణయం 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన పాలసీ సమీక్షలో ఆరుగురు సభ్యులు 4.9 శాతం వరకూ రేటు పెంపునకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పాలసీ విధానాన్ని ‘‘రిమైనింగ్ అకామిడేటివ్’’ (తగిన ద్రవ్యలభ్యత ఉండే స్థాయి) నుంచి ‘‘ విత్‌డ్రాయెల్ ఆఫ్ అకామిడేటివ్’’ (ద్రవ్యలభ్యత ఉపసంహరణ)కు మార్చుతున్నట్లు పేర్కొన్న ఆర్బీఐ పాలసీ సమీక్ష, భవిష్యత్తు చర్యలపై మార్కెట్‌కు మరింత స్పష్టత ఇవ్వాలన్న లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే వృద్ధికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా తగిన చర్యలను అన్నింటినీ ఆర్బీఐ తీసుకుంటుందని పాలసీ సమీక్ష స్పష్టం చేసింది. వృద్ధి బాట పటిష్టం కాగా, ఒకవైపు వడ్డీరేట్లు పెరిగే పరిస్థితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ వృద్ధి బాట పటిష్టంగానే ఉంటుందన్న భరోసాను ఆర్బీఐ ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి నెలకొంటుందన్న క్రితం అంచనాలను మరోసారి పునరుద్ఘాటించింది. ఏప్రిల్, మే నెలల్లో సూచీలు దేశీయ ఎకానమీ క్రియాశీలత పటిష్టతను సూచిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ సమీక్ష పేర్కొంది. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా వృద్ధి రేటు 16.2%, 6.2%, 4.1%, 4.0% వృద్ధి రేట్లు నమోదవుతుందని అంచనా వేసింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకనామీ మందగమనం వంటి ప్రతికూలతలూ ఉన్నాయని గుర్తు చేసింది. ఆర్బీఐ ఇంతక్రితమే వృద్ధి రేటును 7.8% నుంచి 7.2%కి తగ్గించిన సంగతి తెలిసిందే. రిజిస్టర్‌కాని డిజిటల్ లెండింగ్ యాప్‌లపై హెచ్చరిక కాగా, డిజిటల్ లెండింగ్ యాప్‌లపై ప్రజల్లో నెలకొంటున్న ఆసక్తి నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తత ప్రకటించింది. ఏదైనా అవకతవకలు జరిగితే రిజిస్టరయిన డిజిటల్ యాప్‌లపైనే ఆర్బీఐ చర్యలు తీసుకోగలుగుతుందని తెలిపింది. రిజిస్టర్ కాని యాప్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ ప్రజలకు సూచించింది. డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా వేధింపులు, అవి ఆత్మహత్యలకు దారితీయడం వంటి సంఘటనల నేపథ్యం లో ఆర్బీఐ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రెడిట్ కార్డులకు ‘యూపీఐ’ లింక్ క్రెడిట్ కార్డులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో లింక్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. యూపీఐ ప్లాట్‌ఫారమ్ వినియోగం విస్తృతికి, ఎక్కువ మంది ఈ విధానంలో చెల్లింపులు చేయడానికి దోహదపడే చర్య ఇది. ఇప్పటి వరకూ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు మాత్రమే యూపీఐ అనుసంధానమైంది. ముందుగా రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు చేయడం ఉచితం. అయితే క్రెడిట్ కార్డ్ కంపెనీలు సాధారణంగా మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)పై ఆధారపడి ఉంటాయి. ఆదాయ మార్గంగా మర్చంట్ పేమెంట్స్‌కు సంబంధించి ప్రతి వినియోగంపై ఎండీఆర్ చార్జ్ ఉంటుంది. తాజా ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో యూపీఐతో అనుసంధానమయ్యే క్రెడిట్ కార్డుల విషయంలో వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. మేలో 594.63 కోట్ల లావాదేవీలకు సంబంధించి రూ.10.40 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ప్రాసెస్ జరిగినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మ్యాండేట్ పరిమితి రూ.15,000కు పెంపు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ప్రాతిపదికన నిర్వహించే రికరింగ్ చెల్లింపుల విషయంలో ఈ–మ్యాండేట్ (కస్టమర్ ఆమోదం తప్పనిసరి) పరిమితి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఈ పరిమితి రూ.5,000 కాగా, దీన్ని రూ.15,000కు పెంచుతున్నట్లు తెలిపింది. అంటే ఇక రూ.15,000 లోపు లావాదేవీలకు ఈ–మ్యాండేట్ అవసరం లేదన్నమాట. రియల్టీ మందగమనమే ఆర్బీఐ తాజా నిర్ణయం వల్ల గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. విక్రయాలు తగ్గే పరిస్థితి నెలకొంది. వెరసి సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మందగమనంలోకి జారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెపో రేటు పెంపు తప్పనిసరి అయినప్పటికీ, ఇది రియల్టీ రంగాన్ని రెడ్ జోన్లోకి నెట్టేసింది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే ద్రవ్యోల్బణం కట్టడి... 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనితోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉన్నాం. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో పట్టణ నివాసితుల నుంచి కొంత సంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు మా సర్వేలో తెలిసింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాలు వ్యాట్‌లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పాటు ఈ అంచనాలను తగ్గించడానికి ఖచ్చితంగా దోహదం చేస్తుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ సహకార బ్యాంక్ గృహ రుణ పరిమితి రెట్టింపు రియల్టీలో సహకార బ్యాంకులు ఇక మరింత క్రియాశీల పాత్ర పోషించనున్నాయి. గృహ రుణాలకు సంబంధించి సహకార బ్యాంకు ఒక వ్యక్తికి ఇచ్చే గరిష్ట రుణ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ రెట్టింపు చేసింది. గృహాల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దశాబ్ద కాలం క్రితం చేసిన మార్గదర్శకాల్లో మార్పులు జరగనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ తెలిపిన సమాచారం ప్రకారం, పట్టణ గ్రామీణ బ్యాంకుల విషయంలో గరిష్ట రుణ పరిమితి ప్రస్తుతం రూ.70 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెరిగితే, గ్రామీణ సహకార బ్యాంకుల విషయంలో ఈ పరిమితి రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలకు ఎగసింది. డెవలపర్లకు ఉత్సాహాన్ని ఇచ్చే దిశలో ఆర్బీఐ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన బిల్డర్లకు రుణాలు ఇవ్వడానికి గ్రామీణ సహకార బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిఇచ్చింది. ప్రస్తుతం దీనిపై నిషేధం ఉంది. గ్రామీణ సహకార బ్యాంకులు వాణిజ్య రియల్ ఎస్టేట్ – రెసిడెన్షియల్ హౌసింగ్ (సీఆర్ఈ–ఆర్‌హెచ్) రంగానికి రుణాలు ఇవ్వడానికీ ఆర్బీఐ అనుమతులు మంజూరు చేయడం ఈ రంగాలకు సానుకూల అంశం. వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయడానికి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల నిర్వహణకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలపడం మరో విశేషం. సమగ్ర అంచనాలు... ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనాలు సమగ్రంగా ఉన్నాయి. వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యం తత్సంబంధ అంశాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని ఆర్బీఐ కమిటీ ఎకానమీ పురోగమనానికి తగిన నిర్ణయాలు తీసుకుంది. రియల్టీ రుణాల విషయంలో సహకార బ్యాంకింగ్‌కు తగిన అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాలు ఈ రంగానికి సానుకూల అంశం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ కీలక దశ... ఒకపక్క వృద్ధి పురోగమనం. మరోపక్క ద్రవ్యోల్బణం కట్టడి. ఈ కీలక లక్ష్యాల సాధన దిశగా ఎకానమీ అడుగులు వేయాల్సిన పరిస్థితిలో ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంది. పాలసీ సమీక్ష దాదాపు ఊహించిందే. వృద్ధి బాట చెక్కుచెదరకుండా ప్రభుత్వం, ఆర్బీఐ పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ సమతుల్య పాలసీ... ద్రవ్యోల్బణం తగ్గడానికి, వృద్ధి పురోగతికి తగిన చర్యలు తీసుకుంటూ ద్రవ్య, పరపతి అధికారులు తగిన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి దేశీయంగా ఎదురవుతున్న సవాళ్లలో అధికభాగం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల తలెత్తుతున్నవే. ఆర్థికాభివృద్ధికి– ధరల కట్టడికి ఆర్బీఐ పాలసీ కమిటీ తన నిర్ణయాలను తాను తీసుకుంది. – అజయ్ సేథ్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి. -
బ్యాంకుల వడ్డింపు షురూ..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 0.4 శాతం పెంచి 4.4 శాతానికి చేర్చడంతో బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. ఐసీఐసీఐ, బీఓబీ, బీఓఐ, సెంట్రల్ బ్యాంకులు తమ రుణ రేట్లను సవరించాయి. ఆయా రేట్లు పెంపు నిర్ణయాలను పరిశీలిస్తే.. ► తక్షణం అమల్లోకి వచ్చే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)ను 8.10 శాతానికి పెంచింది. ఆర్బీఐ పాలసీ రెపో రేటును ఈబీఎల్ఆర్ ప్రతిబింబిస్తుంది. రెపోరేటుకు అనుగుణంగా ఈబీఎల్ఆర్ కదలికలు ఉంటాయి. ► బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రేటును (బీఆర్ఎల్ఎల్ఆర్) 6.90%కి పెంచింది. తక్షణం ఈ రేటు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రెపో 4.40 శాతానికి ఇది 2.50% అదనమని వివరించింది. బ్యాంక్ రిటైల్ రుణాలకు ఇది వర్తిస్తుంది. రిటైల్ రుణాలకు వర్తింపజేసేందుకు వీలుగా 2019 అక్టోబర్ నుంచి రుణాలకు బీఆర్ఎల్ఎల్ఆర్ ప్రాతిపదికను బీఓబీ అమలు చేస్తోంది. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) తన ఆర్బీఎల్ఆర్ (రెపో ఆధారిత రుణ రేటు)ను రెపోరేటు పెంపునకు అనుగుణంగా 7.25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ► ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఎల్ఆర్ 0.40 శాతంమేర పెరిగి 7.25 శాతానికి చేరింది. 6వ తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. వరుసలో ఎస్బీఐ...! బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్ ) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రేటు అమల్లో ఉంది. ఆర్బీఐ తాజా నిర్ణయంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎస్బీఐ సమీక్షిస్తున్నట్లు సమాచారం. రుణ సమీకరణ ఆధారిత వ్యయాలను గత నెల ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఎస్బీఐ బెంచ్‌మార్క్ ఏడాది ఎంసీఎల్ఆర్ 7.10 శాతంగా ఉంది. ఎస్బీఐ కస్టమర్లు పెద్ద సంఖ్యలో ఈ రేటు ప్రాతిపదికగానే రుణాలు తీసుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 2019న కీలక ఆదేశాల జారీ చేస్తూ, వ్యక్తిగత లేదా రిటైల్, సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) రుణాలకు సంబంధించి ఫ్లోటింగ్ రేట్లకు బెంచ్‌మార్క్‌గా రెపో రేటు ఉండాలని బ్యాంకింగ్‌ను ఆదేశించింది. అదే ఏడాది అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ డిపాజిట్ రేటు పెంపు ప్రైవేటు రంగంలోకి కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్ని కాలపరిమితుల స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.35 శాతం పెంచింది. రూ.2 కోట్ల దిగువ డిపాజిట్లన్నింటికీ తాజా రేటు పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం, 390 రోజుల వరకూ డిపాజిట్ రేటు 0.30# పెరిగి 5.5 శాతానికి చేరింది. 23 నెలలకు రేటు 0.35% పెరిగి 5.6%కి ఎగసింది. సీనియర్ సిటిజన్లు 23 నెలలు, ఆపైన డిపాజిట్ల విషయంలో 6.10 శాతం వడ్డీరేటు పొందుతారు. ‘దాదాపు రెండు సంవత్సరాల తక్కువ వడ్డీరేటు ఆర్థిక వ్యవస్థలో తాజా పెంపు పరిణామం ఒక సువర్ణావకాశం. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి బ్యాంకుల వరుసలో కోటక్ ఒకటి. వినియోగదారులు తమ కీలక లక్ష్యాల కోసం పొదుపు చేసేందుకు అలాగే తమ పొదుపుపై పెరిగిన రాబడిని పొందేందుకు ఇదే సరైన సమయం’’ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ (రిటైల్, బ్రాంచ్ బ్యాంకింగ్) గ్రూప్ ప్రెసిడెంట్ విరాట్ దివాన్జీ పేర్కొన్నారు. -
నాలుగేళ్ల తర్వాత..సామాన్యులకు ఆర్బీఐ భారీ షాక్!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనూహ్యరీతిలో వడ్డీరేట్ల షాక్ ఇచ్చింది. కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది దీంతో ఈ రేటు 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. ఈ ప్రభావంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఈఎంఐలు భారం కానున్నాయి. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4%కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు కొనసాగుతోంది. గడచిన 11 పాలసీ సమావేశాల్లో రెపో రేటును 4% వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌సహా కమోడిటీ ధరల తీవ్రత, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితులు ఉత్పన్నం కావడం (ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలి), వ్యవస్థ నుంచి ఈజీ మనీ ఉపసంహరణలో భాగంగా అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు వంటి పలు అంశాలు ఆర్బీఐ తాజా అనూహ్య, ఆకశ్మిక నిర్ణయానికి కార ణమయ్యాయి. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల 2 నుంచి 4 వరకూ జరిపిన ద్వైమాసిక మధ్యంతర సమావేశంలో తాజా కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణం రెపో రేటు పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల కార్పొరేట్, వ్యక్తిగత రుణ వ్యయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ తక్షణం ఈ దిశలో నిర్ణయాలు తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును రెపో రేటుగా పేర్కొంటారు. అర శాతం పెరిగి 4.5 శాతానికి సీఆర్ఆర్ రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. సీఆర్ఆర్ పెంపు వల్ల వ్యవస్థ నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వ్యవస్థ నుంచి వెనక్కు మళ్లుతాయన్నది అంచనా. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాల్సి ఉండగా జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3%, 5.8%, 5.4 శాతం, 5.1శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. కాగా, సీఆర్ఆర్ కొత్త రేటు మే 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 7 శాతానికి చేరుకుంది. వరుసగా మూడవ నెలలో ఆర్బీఐ లక్ష్యానికి మించి నమోదవడం గమనార్హం. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ఫెడ్ ఫండ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చన్న అంచనాలు ఆర్బీఐ తాజా అనూహ్య నిర్ణయానికి నేపథ్యం. జూన్‌లో మరో పావు శాతం పెంపు..! కాగా ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) ఆర్బీఐ పాలసీ కమిటీ రెండవ ద్వైమాసిక ద్రవ్యపరపతి సమావేశం జూన్ 6వ తేదీ 8వ తేదీ మధ్య జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటును మరో పావుశాతం పెంచవచ్చన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. చదవండి👉రెపో రేటు పెంపు.. ఎవరికి మేలు.. ఎవరికి భారం ? -
మార్కెట్‌కు ఆర్బీఐ షాక్..
ముంబై: ఊహించని విధంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచడంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఎల్ఐసీ ఐపీఓ ప్రారంభం నేపథ్యంలో బడా ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ హోల్డింగ్స్ నుంచి పెద్ద ఎత్తున నగదు ఉపసంహరించుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. వడ్డీరేట్ల పెంపు నిర్ణయంతో బాండ్ మార్కెట్ వణికింది. పదేళ్ల కాలపరిమితి కలిగిన బాండ్లపై రాబడి రెండేళ్ల గరిష్ట స్థాయి 7.41 శాతానికి చేరింది. యూఎస్ ఫెడ్ ద్రవ్యపాలసీ ప్రకటన (బుధవారం రాత్రి)కు ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. ఈ అంశాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక, రియల్టీ షేర్లలో భారీ స్థాయిలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 56 వేల స్థాయిని కోల్పోయి 1,307 పాయింట్లు క్షీణించి 55,669 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 392 పాయింట్లు నష్టపోయి 16,680 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు ఎనిమిది వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. సెన్సెక్స్ సూచీలో పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, కొటక్ బ్యాంక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ రెండున్నర శాతం, స్మాల్ క్యాప్ సూచీ రెండుశాతం చొప్పున పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,338 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 76.40 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ ప్రకటకు ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వేచిచూచే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్‌కాంగ్, కొరియా మార్కెట్లు నష్టపోయాయి. చైనా, ఇండోనేషియా, జపాన్ మార్కెట్లకు సెలవు. యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. కుప్పకూలిన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు ఆర్బీఐ రెపో రేటు 40 బేసిస్ పాయింట్ల పెంపు నిర్ణయంతో వడ్డీరేట్ల ఆధారిత కుప్పకూలిన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు కుప్పుకూలాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఏయూ స్మాల్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ షేర్లు నాలుగు శాతం నుంచి అరశాతం వరకు క్షీణించాయి.అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, మారుతీ, హీరో మోటోకార్ప్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ షేర్లు నాలుగున్నర శాతం నుంచి రెండు శాతం పతనమయ్యాయి. రూ.6.27 లక్షల కోట్లు సంపద ఆవిరి ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు నిర్ణయంతో సోమవారం ఒక్కరోజే రూ.6.27 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.259 లక్షల కోట్లకు దిగివచ్చింది. -
వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్బీఐ?!
ముంబై:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ప్రారంభం కానుంది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం మూడు రోజుల పాటు అంటే 6వ తేదీ వరకూ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. శుక్రవారం కమిటీ కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. మూడవ వేవ్ భయాలు, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలలుగా ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శ్రేణికి మించి నమెదుకావడం వంటి అంశాల నేపథ్యంలో తాజా సమావేశం జరగనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4%) కమిటీ యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం ఉండడం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి కారణం. రెపోను వరుసగా 6 ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది. -
మిశ్రమంగా మార్కెట్
కొత్త రుణాలపై వడ్డీరేట్లను రెపోరేటు, ఎమ్సీఎల్ఆర్ వంటి ఏదోఒక ప్రామాణిక రేటుతో అనుసంధానించాలన్న ఆర్బీఐ ఆదేశాల కారణంగా బ్యాంక్ షేర్లలో అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగానికి తగిన తోడ్పాటునందిస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అభయం ఇవ్వడంతో వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. ఆరంభంలోనే 174 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 80 పాయింట్ల నష్టంతో 36,644 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 10,848 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం 28 పైసలు పుంజుకొని 71.84కు చేరడంతో ఐటీ షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 357 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్: ఆర్బీఐ తాజా ఆదేశాల కారణంగా గృహ, వాహన, ఎమ్ఎస్ఎమ్ఈలపై వడ్డీరేట్లు తగ్గుతాయని, దీంతో బ్యాంక్ షేర్లలో అమ్మకాలు జరిగాయని ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చౌహాన్ చెప్పారు. హాంగ్‌కాంగ్‌లో అలజడులకు కారణమైన వివాదస్పద బిల్లును అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం, వచ్చే నెలలో చర్చలు జరపడానికి అమెరికా–చైనాలు అంగీకరించడం ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చాయి. ఈ జోష్‌తో సెన్సెక్స్ 174 పాయింట్ల మేర లాభపడింది. అయితే వృద్ధి అంచనాలను రేటింగ్ సంస్థ, క్రిసిల్ తగ్గించడం ప్రతికూలత చూపింది, దీంతో ఈ లాభాలు ఆవిరయ్యాయి. మధ్యాహ్నం తర్వాత సెన్సెక్స్183 పాయింట్ల మేర నష్టపోయింది. రోజంతా 357 పాయింటల రేంజ్లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. వాహన షేర్ల స్పీడ్.... అమ్మకాల్లేక అల్లాడుతున్న వాహన రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభయం ఇవ్వడంతో వాహన షేర్లు పరుగులు పెట్టాయి. వాహనాలపై జీఎస్టీ తగ్గింపు విషయమై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తామని గడ్కరీ తెలిపారు. పెట్రోల్, డీజీల్ వాహనాలపై నిషేధం విధించే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. దీంతో కాలుష్యం తగ్గించడానికి గాను ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించగలదన్న అంశంపై స్పష్టత వచ్చింది. దీంతో వాహన రంగ షేర్లు జోరుగా పెరిగాయి. టాటా మోటార్స్ 8 శాతం, ఎక్సైడ్ ఇండస్ట్రీస్2.8 శాతం, భారత్ ఫోర్జ్2.8 శాతం, మదర్సన్ సుమి సిస్టమ్స్ 2.6%, మారుతీ సుజుకీ 2.4%, మహీంద్రా అండ్ మహీంద్రా 2.2%, బజాజ్ ఆటో 1.6%, హీరో మోటొకార్ప్ 1.5%, టీవీఎస్ మోటార్ కంపెనీ 1.4%, అశోక్ లేలాండ్ 1%, ఐషర్ మోటార్స్ 0.7%చొప్పున లాభపడ్డాయి. -
ఆర్బీఐ వరమిచ్చినా..
ముంబై: అంచనాలు, విశ్లేషణలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6% నుంచి 5.75%కి తగ్గింది. రెపో రేటు తగ్గించడం జనవరి నుంచీ ఇది మూడవసారి. రెండు నెలలకోసారి జరిగే సమీక్షలో గడిచిన ఆరు నెలల్లో మూడు సార్లు 0.25% చొప్పున రేటును ఆర్బీఐ తగ్గిస్తూ వస్తోంది. తాజా రేటు తగ్గింపుతో రెపో తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లయింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రేటు కోత నిర్ణయం తీసుకుంది. ఇక ముందూ రేటు తగ్గిస్తామనే సంకేతాలను ఇస్తూ, పాలసీ విధానాన్ని ‘తటస్థం’ నుంచి ‘మార్పునకు వీలైన సరళ వైఖరికి’ మార్చింది. ఏంటీ రెపో... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపోగా వ్యవహరిస్తారు. గడిచిన ఆరునెలల్లో ఇది ఏకంగా 0.75 శాతం తగ్గింది. ఇలా తగ్గటం వల్ల ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చౌక వడ్డీకే నిధులు లభ్యమవుతాయి. అప్పుడు బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. అలా చేసినా వాటి లాభాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడదు. కానీ ఇక్కడే జరగాల్సింది సరిగా జరగడం లేదు. స్వయంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50% రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం తగ్గింపును మాత్రమే కస్టమర్లకు బదలాయించాయి. అది కూడా కొత్తగా రుణాలు తీసుకునే వారికి మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందజేశాయి. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04%. ఈ విషయంపై తాను బ్యాంకర్లతో మాట్లాడతానని కూడా ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. రుణాల్లో వృద్ధే ప్రధాన లక్ష్యంగా తాజా పాలసీ సమీక్ష, నిర్ణయాలు జరిగినట్లు తెలిపారు. రేటు తగ్గింపు పరిస్థితులు చూస్తే... బ్యాంకులకు తగ్గించిన రేటు ప్రయోజనం... సాధారణ వినియోగదారు నుంచి పరిశ్రమల వరకూ అందినప్పుడు అది వ్యవస్థలో రుణ రేటు తగ్గుదలకు తోడ్పడుతుంది. రుణాలపై వడ్డీ తక్కువ కనక రుణాలు ఎక్కువ తీసుకుంటారు. ఇది వృద్ధి మెరుగుదలకు దోహదపడుతుందనేది క్లుప్తంగా ఆర్థిక విశ్లేషణ. ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిపోయింది. మందగమనం చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో... రెపో రేటు తగ్గింపునకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. ఆ అంశాలను పరిశీలిస్తే... ► అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్బీఐ నిర్దేశిత శ్రేణి 2%కి అటు ఇటుగా 4 శాతం వద్దే కొనసాగుతున్నాయి. ► మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణి పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి. వాహన రంగం రివర్స్‌గేర్‌లో ప్రయాణిస్తోంది. ► గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (208–19, జనవరి–మార్చి) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది. వాహన, ఆటో, గృహ రుణ రేట్లు తగ్గే చాన్స్... బ్యాంకులు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని గనక వినియోగదారులకు బదలాయిస్తే... దీనికి అనుసంధానమయ్యే వాహన, ఆటో, గృహ రుణాలపై కస్టమర్ నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం (ఈఎంఐ) తగ్గుతుంది. కొత్త రుణాలకు సైతం వడ్డీ రేట్లు తగ్గుతాయి. మరోవంక డిపాజిట్లపై చెల్లించే వడ్డీని కూడా బ్యాంకులు తగ్గించేస్తాయి. అసంఘటిత రంగమే అత్యధికంగా ఉండే మన దేశంలో చాలామంది రిటైరైన తరవాత సరైన ఆదాయం కోసం వడ్డీపైనే ఆధారపడుతుంటారు. అలాంటి వారికి ఈ వడ్డీ తగ్గింపులు అశనిపాతం లాంటివే. కొన్నాళ్లుగా బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే... ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే అవి డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించేస్తున్నాయి. అదే స్పీడులో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించటం లేదు. దీనివల్ల బ్యాంకుల లాభాలు పెరుగుతాయి తప్ప కస్టమర్లకు ఒరిగేదేమీ ఉండదు. బ్యాంకుల ఈ వైఖరి వల్ల వృద్ధి రేటు వచ్చే మూడేళ్లు కూడా పెద్దగా పెరిగేదేమీ ఉండకపోవచ్చనేది రేటింగ్ ఏజెన్సీల అంచనా. పాలసీ ప్రధానాంశాలు... ► రెపో రేటును పావుశాతం తగ్గించడం వరుసగా ఇది మూడవసారి. ఇంతక్రితం వరుసగా రెండు దఫాలుగా తగ్గిన అరశాతంసహా తాజా పావుశాతం తగ్గింపుతో ఈ రేటు 5.75 శాతానికి దిగివచ్చింది. ఇది తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి. ► రివర్స్ రెపో రేటు 5.50 శాతంగా ఉంది. ► మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6%. ► పాలసీ వైఖరిని ‘తటస్థం’ నుంచి ‘తగిన విధం గా మార్చుకునే సరళ విధానం’ వైపు మార్పు. ► జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు. ► ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1 శాతం శ్రేణిలో ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ రేటు 3.4–3.7 శ్రేణిలో ఉంటుంది. ► వర్షపాతం విషయంలో అనిశ్చితి, క్రూడ్ ఆయి ల్ ధరలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతాయి. ► డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చార్జీల రద్దు. ► బ్యాంకులు విధించే ఏటీఎం చార్జీలు, ఫీజుల సమీక్షకు కమిటీ నియామకం. ► నిర్దిష్టకాల పరిమితితో సంబంధం లేకుండా, ఎప్పటికప్పుడు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్సుల జారీకి సంబంధించి ఆగస్టు నాటికి ముసాయిదా మార్గదర్శకాల జారీ. ► పెట్టుబడుల్లో తీవ్ర మందగమనం, ప్రైవేటు వినియోగ వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలపై ఆందోళన. ► పావుశాతం రేటు తగ్గింపునకు సానుకూలంగా మొత్తం ఆరుగురు సభ్యుల ఏకగ్రీవ ఓటు. ► జూన్ ప్రారంభంనాటికి వ్యవస్థలో సగటు రోజువారీ ద్రవ్యలభ్యత రూ.66,000 కోట్లు. ► దేశంలో మే 31వ తేదీ నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 421.9 బిలియన్ డాలర్లు. ► మొండిబకాయిల పరిష్కారం దిశలో 3, 4 రోజుల్లో కొత్త నిబంధనలు ► ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల సవాళ్లను ఎదుర్కొనడంలో సహకారం. ► తదుపరి విధాన సమీక్ష ఆగస్టు 7. బ్యాంకర్లూ... మీరెంతో చేయాలి! ఆర్బీఐ రేటు తగ్గించినా... ఆ ప్రయోజ నాన్ని బ్యాంకర్లు వ్యవస్థలోకి బదలాయించకపోవడంపట్ల గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు మరెంతో చేయాల్సి ఉందని ఆయన సూచిం చారు. పాలసీ అనంతరం శక్తికాంతదాస్ పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూస్తే... ‘‘గతంలో ఆర్బీఐ పాలసీ రేటు తగ్గింపు నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రభావం వ్యవస్థలో ప్రతిబింబించడానికి నాలుగు నుంచి ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50 శాతం రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం కస్టమర్లకు బదలాయించాయి. కొత్త రుణ గ్రహీతలకే ఈ మొత్తం ప్రయోజనం దక్కింది. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04% మాత్రమే. రేటు తగ్గింపు ప్రయోజనం మరింతమేర, మరింత వేగంగా అందాలన్నది మా అభిప్రాయం. వినియోగదారులకు, ద్విచక్ర వాహన గ్రహీతలకు అందరికీ ఈ ప్రయోజనం అందాలి. రేటు ప్రయోజనం బదలాయింపు ఏ మేర జరుగుతోందన్న విషయాన్ని ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రేటు ప్రయోజనం ఎంతో కీలకం. బ్యాంకులతో ఈ విషయంపై చర్చిస్తాం. చేయాల్సినదంతా చేస్తాం. ఏప్రిల్‌లో పావుశాతం రేటు తగ్గించాం. అయితే కొన్ని బ్యాంకులు కేవలం 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల రేటు కోత నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే మరింత రేటు ప్రయోజన బదలాయింపు జరగాలి. రుణ డిమాండ్, ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు ఇది ఎంతో అవసరం’’ – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ -
కీలక వడ్దీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ
-
రూపాయి 76పైసలు డౌన్
ముంబై: మూడు రోజుల రూపాయి లాభాలకు గురువారం బ్రేక్ పడింది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించడంతో రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76 పైసలు క్షీణించి 69.17కు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే డాలర్ బలపడటం.. రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. వరుసగా రెండో పాలసీలో కీలక రేట్లలో ఆర్బీఐ కోత విధించింది. దీంతో రూపాయి, బాండ్ల ధరలు పడిపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసల నష్టంతో 68.56 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. బుధవారం రూపాయి 33 పైసలు లాభపడిన విషయం తెలిసిందే. -
దాస్.. ‘డబుల్’ ధమాకా!
ముంబై: మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో 2వ తేదీ నుంచీ ఎంపీసీ ద్రవ్య విధాన కమిటీ ద్వైమాసిక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం కీలక నిర్ణయాలు మూడవరోజు– గురువారం వెలువడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) ఇది తొలి ద్వైమాసిక సమావేశం. రెండు నెలల క్రితం జరిగిన ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. గత ఏడాది ఆర్బీఐ రెండు సార్లు అరశాతం రేటు పెంచింది. తాజా నిర్ణయంతో పెరిగిన మేర రివర్స్ అయినట్లయ్యింది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ మరో వారంలో ఉండగా ఆర్బీఐ తాజా కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, రివర్స్ రెపో రేటును కూడా ఆర్బీఐ పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి సర్దుబాటు అయ్యింది. బ్యాంకులు తమ వద్ద మిగులు నిధులు ఉంటే, వాటిని ఆర్బీఐ వద్ద ఉంచి వడ్డీ పొందుతాయి. ఈ రేటునే రివర్స్ రెపోగా పేర్కొంటారు. ఈ రేటు ఎక్కువగా ఉంటే, తద్వారానే అధిక ప్రయోజనం పొందడానికి బ్యాంకులు మొగ్గుచూపుతాయి. వ్యవస్థలో రుణ లభ్యత, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెరగాలంటున్న ఆర్బీఐ, రివర్స్రెపో రేటును కూడా తగ్గించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరంలో రెండవ ద్వైమాసిక సమావేశం జూన్ 3 నుంచి 6వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలు ఎలా ఉంటాయంటే? బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. దీనిని తగ్గిస్తే, బ్యాంకులకు నిధుల సమీకరణ భారం తగ్గుతుంది. ఇలా తమకు లభించే వడ్డీరేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయిస్తే, గృహ, రుణ, వాహన రుణాలపై కస్టమర్ల నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) తగ్గుతాయి. అయితే తమకు లభించిన రేటు ప్రయోజనాన్ని యథాతథంగా బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించడం లేదన్న విమర్శ అన్ని వర్గాల నుంచీ వ్యక్తమవుతుంది. ఆర్బీఐ తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తగ్గించిన రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందేలా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఫిబ్రవరిలో పావుశాతం రేటు తగ్గిస్తే, కొన్ని బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్స్) కేవలం 5 నుంచి 10 బేసిస్ పాయింట్లే తగ్గించిన విషయాన్ని గుర్తుచేసింది. మరింత రేటు కోత అవసరాన్ని స్పష్టంచేసింది. కాగా రెపో రేటు, బాండ్ ఈల్డ్స్ వంటి బెంచ్‌మార్క్ రేట్లతో వ్యక్తిగత, గృహ, ఆటో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాల అనుసంధానంపై బ్యాంకులతో ఆర్బీఐ మరిన్ని చర్చలు జరుపుతుందని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. దీనితో ఇందుకు సంబంధించి తుది మార్గదర్శకాల జారీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. యథాతథమే బెటరన్న ఇరువురు కాగా రేటు కోత నిర్ణయం ఏకాభిప్రాయ ప్రాతిపదికన జరగలేదు. ఇరువురు సభ్యులు ఇందుకు ‘నో’ అన్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ఎంసీసీ సభ్యుడు ఛేతన్ ఘాటే ఇందులో ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్‌తో పాటు పామీదువా, రవీంద్ర దోలాకియా, మైఖేల్పాత్రలు రేటుకోతకు సానుకూలంగా ఓటు వేశారు. ఇక ద్రవ్య వ్యవస్థకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరిపై ఆరుగురిలో ఐదుగురు ప్రస్తుతం ఉన్న ‘న్యూట్రల్’ (తటస్థం)ను కొనసాగించాలని పేర్కొంటే, రవీంద్ర డోలాకియా మాత్రం ‘అకామిడేటివ్’ (సర్దుబాటుకు అనువైన) విధానాన్ని అనుసరించడానికి ఓటు చేశారు. దీనితో తటస్థం విధానాన్నే ఆర్బీఐ ఎంచుకున్నట్లయ్యింది. ధరా‘భయం’ ఉపశమనం... ద్రవ్యోల్బణం రేటు అంచనాలను మాత్రం ఆర్బీఐ తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 2.9–3 శాతం శ్రేణిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరిలో ఈ అంచనాలను 3.2–3.4 శ్రేణిగా ఆర్బీఐ పేర్కొంది. కాగా ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో 3.5–3.8% వరకూ ఉంటుందని అంచనావేసింది. అంటే ఆర్బీఐ లక్ష్యం 4% దిగువనే ద్రవ్యోల్బణం ఉంటుందన్నమాట. ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2.57 శాతం. కాగా ఆహార, ఇంధన ధరలు తీవ్రంగా పెరిగితే మాత్రం మొత్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. వృద్ధి, ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా... ‘తాజా నిర్ణయానికి ప్రధానంగా రెండు అంశాలు కారణం. ఒకటి వృద్ధిరేటు మందగమనంలో ఉండడం. రెండవది ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం. ధరల స్పీడ్ తక్కువగా ఉన్నందువల్ల వృద్ధి లక్ష్యంగా రేటు కోతకు తగిన సమయమని భావించడం జరిగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో ఎగుమతుల వృద్ధి బలహీనంగా ఉంది. దిగుమతులు విషయానికి వస్తే, చమురు యేతర దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతులూ తగ్గాయి. దేశంలో వృద్ధి మందగమన పరిస్థితులను ఇది సూచిస్తోంది. ఇక ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) అవరోధాలు లేకుండా చూస్తాం’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ఎదురీత... దేశీయ ఆర్థిక వ్యవస్థ ఎదురీదుతోందని విధాన ప్రకటన తెలిపింది. ప్రత్యేకించి అంతర్జాతీయ రంగంలో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరిలో ఈ రేటును 7.4 శాతంగా అంచనా వేసింది. అంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టిందన్నమాట. డిసెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)వృద్ధి రేటు 6.6 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రైవేటు పెట్టుబడుల్లో బలహీనత దీనికి కారణం. బలహీనంగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులకు ఊతం ఇవ్వడం ద్వారా దేశీయ వృద్ధి రేటును పటిష్ట పరచుకోవాల్సి ఉందని ప్రకటన పేర్కొంది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.1 శాతం శ్రేణిలో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేయగా, రెండవ అర్ధభాగంలో 7.3 శాతం నుంచి 7.4 శాతం మధ్య ఉంటుందని భావించింది. సుప్రీం తీర్పు వ్యతిరేకం కాదు... మొండిబకాయిలకు సంబంధించి 2018 ఫిబ్రవరి 12 ఆర్బీఐ సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిందంటే.. దానర్థం, ఆర్బీఐ అధికారాలను తీసుకుందని కాదు. ఇందుకు సంబంధించిన అధికారాలను ఎలా వినియోగించాలన్నది సుప్రీంకోర్టు సూచించింది. అందువల్ల ఎన్పీఏ పునర్వ్యవస్థీకరణ, పరిష్కార ప్రణాళికలకు సంబంధించి త్వరలో ఆర్బీఐ సవరిత మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఎన్పీఏల సత్వర పరిష్కారానికి ఆర్బీఐ కట్టుబడి ఉంది. బ్యాంకింగ్ స్థిరత్వానికి ఇది ఎంతో అవసరం. మొత్త ఫైనాన్షియల్ రంగంలో పరిస్థితులకు అనుసంధానమైన అంశం ఇది. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న ఒక సంస్థ సహా (కొటక్ మహీంద్రా బ్యాంక్) విద్యుత్ కంపెనీలు ఆర్బీఐని కోర్టుకు లాగడం ఆందోళనకరమన్న విశ్లేషణలు సరికాదు. ఏ సంస్థ నిర్ణయాన్నైనా చట్టం ముందు సవాలు చేయడం ఒక రాజ్యాంగ హక్కు. ఐఎల్ ఎఫ్ఎస్ రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించవద్దని ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన రూలింగ్ విషయానికి వస్తే, దీనిని సవరించవలసిందిగా ఆర్బీఐ ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇక గణాంకాల విషయానికి వస్తే, అధికారికంగా అందిన డేటాకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, తమ పాలసీలపై స్పందనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. కార్పొరేట్ రుణాలకు సెకండరీ మార్కెట్ అభివృద్ధిపై కార్యాచరణ బృందం ఏర్పాటు చేయడం జరుగుతుంది. – శక్తికాంత్ దాస్, ఆర్బీఐ గవర్నర్ రేట్ల తగ్గింపును బ్యాంకులు బదలాయిస్తే మంచిదే: పరిశ్రమలు పారిశ్రామిక వర్గాలు రేటు తగ్గింపును స్వాగతించాయి. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చే అంశంగా పేర్కొన్నాయి. వినియోగ వ్యయాలు పెరుగుతాయని విశ్లేషించాయి. అయితే తాజా రేటు కోత ప్రయోజనాలన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయిస్తేనే ఇది సాధ్యమని పేర్కొన్నాయి. ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం రేటు కోతకు దోహదపడిందన్నారు. రేటు మరికొంత తగ్గింపునకూ అవకాశం ఉందని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ తల్వార్ అభిప్రాయపడ్డారు. వృద్ధి పటిష్టతపై ఆర్బీఐ పాలసీ దృష్టి సారించిందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. అయితే రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకింగ్ తగిన చర్యలు తీసుకోవాలని వీరు అభిప్రాయపడటం గమనార్హం. బ్యాంకుల నుంచి స్పందన నిల్... ఆర్బీఐ వరుసగా రెండవదఫా రేటుకోత నిర్ణయం తీసుకున్నా... ఈ ప్రయోజనాన్ని తక్షణం కస్టమర్లకు బదలాయించడంపై బ్యాంకుల నుంచి తగిన స్పందన రాలేదు. పాలసీ బాగుందని పేర్కొన్నా, తమ నుంచి రేటు కోతపై ఏ బ్యాంక్ నుంచీ తక్షణం ఎటువంటి స్పష్టమైన ప్రకటనలు వెలువడలేదు. సంక్లిష్టతలు ఉన్నాయ్ జీడీపీ రేటు అంచనా తగ్గింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న అంచనాలు ఉన్నా, తగిన వర్షపాతం లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. లిక్విడిటీ లభ్యతలకు చర్యలు బాగున్నాయి. ముందుచూపుతో రూపొందించిన ద్రవ్య విధానమిది. మార్కెట్ భాగస్వాముల డిమాండ్‌ను నెరవేర్చుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చీఫ్ బ్యాంకింగ్‌కు సానుకూలం రేటు తగ్గింపు, లిక్విడిటీ అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు బ్యాంకర్లకు సానుకూలం. అలాగే రేటు తగ్గింపు ప్రయోజనం సత్వర బదలాయింపునకూ ఈ నిర్ణయం దోహదపడుతుంది. రేటు కోత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ధరలు అదుపులో ఉంటాయన్న అంచనాలు సానుకూలం. – సునిల్ మెహతా, ఐబీఏ చైర్మన్ భయపడాల్సింది ఏదీలేదు ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను తగ్గించినంత మాత్రాన భయపడాల్సింది ఏమీలేదు. వృద్ధికి సంబంధించి రానున్న కాలంలో ఆశాజనకమైన పలు అంశాలు ఉన్నాయి. బడా కార్పొరేట్ కంపెనీలకు రుణ వృద్ధి అంతకంతకూ పెరుగుతుండడం ఇందులో ఒకటి. – కృష్ణమూర్తి సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు ఆర్బీఐ రిజర్వ్స్‌పై త్వరలో జలాన్ నివేదిక రిజర్వ్ బ్యాంక్ వద్ద నిల్వలు ఏ స్థాయిలో ఉండాలన్న అంశంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ త్వరలో తన నివేదికను సమర్పిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కమిటీ ప్రస్తుతం ముమ్మర చర్చల్లో ఉందన్నారు. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. భారీ ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ఆర్బీఐ నిధుల్లో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. -
ఎక్కడి ‘రేట్లు’ అక్కడే...
ముంబై: ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రేట్లలో ఎటువంటి మార్పులూ చేయలేదు. దీనితో స్వల్పకాలిక రుణ రేటు రెపో(8 శాతం) సహా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్-4 శాతం), స్టాల్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్-22 శాతం) యథాయథంగా కొనసాగనున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులూ చేయకపోవడం ఇది వరుసగా నాల్గవసారి. ధరల పెరుగుదల భయాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అంచనాల స్థాయికి ద్రవ్యోల్బణం దిగివచ్చేంతవరకూ రేట్ల కోత అవకాశం లేదని ఉద్ఘాటించింది. మొత్తంగా చూస్తే పండుగల సీజన్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో అటు బ్యాంకర్లు, ఇటు పరిశ్రమలు కొంత నిరాశకు గురయ్యాయి. పండుగల సీజన్లో వడ్డీరేట్లు తగ్గవచ్చన్న అంచనాలు దీనితో ఆవిరయ్యాయి. సమీక్ష... ముఖ్యాంశాలు... పస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.5%. 2015-16లో ఈ రేటు 6.3 శాతం ఉంటుందన్నది అంచనా. తొలి త్రైమాసికంలో(2014-15, ఏప్రిల్-జూన్) 5.7% వృద్ధి రేటు 3, 4 త్రైమాసికాల్లోనూ కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. అయితే క్యూ4లో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉండవచ్చు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతంగా ఉంటుందని అంచనా. 2016 నాటికి 6 శాతానికి తగ్గవచ్చు. చిన్న, పేమెంట్ బ్యాంకులపై మార్గదర్శకాలు నవంబర్ చివరి నాటికి వెలువడతాయి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై సానుకూలత. ‘నో యువర్ కస్టమర్’ నిబంధనల సరళీకరణ. బ్యాంక్ అకౌంట్ల ప్రారంభానికి సొంత ధ్రువీకరణ పత్రాలకు సైతం అనుమతి. ‘లో రిస్క్’ అకౌంట్ల విషయంలో కాలగుణంగా చిరునామా ధ్రువీకరణలకు సంబంధించి నిబంధనల సరళతరం. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి నిర్వచనంలో మార్పు ప్రక్రియ. రుణ ఎగవేత కంపెనీల డెరైక్టర్లనూ ఈ పరిధిలోకి తెచ్చేలా మార్పులు. మోసాల నివారణకు సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ ఏర్పాటు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల రద్దు వల్ల బ్యాంకింగ్‌కు సంబంధించి నెలకొన్న రుణ సమస్యలను ఎదుర్కొనే సత్తా, వెసులుబాటు వ్యవస్థలో ఉంది. బాండ్ మార్కెట్లో ట్రేడింగ్ మరింత పెరిగేందుకు చర్యలు. జన ధన యోజన వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ సేవలు మరింత విస్తృతం అవుతాయని భావిస్తున్నాం. ఇందుకు సంబంధించి నో యువర్ కస్టమర్ నిబంధనల సరళీకరణ వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండ వు. తదుపరి ద్వైమాసిక పరపతి సమీక్ష డిసెంబర్ 2న. బ్యాంకర్లు ఏమన్నారంటే... ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో రుణ, డిపాజిట్ రేట్లు సమీప భవిష్యత్తులో తగ్గించే అవకాశం లేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ... అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ నిర్ణయాలు ఉన్నాయన్నారు. అయితే మార్చితో పోల్చిచూస్తే, రేట్ల పెంపుకన్నా తగ్గింపువైపే పాలసీ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని మాత్రం ఆమె అన్నారు.ద్రవ్యోల్బణం తగ్గుతున్న ధోరణులు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ద్రవ్య లభ్యత(లిక్విడిటీ) పరిస్థితులు, రుణ వృద్ధి వంటి అంశాల ఆధారంగానే సమీప భవిష్యత్తులో తమ బ్యాంక్ రేట్లపై నిర్ణయాలు ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ చెప్పారు.