ఈఎంఐలు ఇక దిగొస్తాయ్‌! | RBI repo rate cut to home loan EMIs go down | Sakshi
Sakshi News home page

ఈఎంఐలు ఇక దిగొస్తాయ్‌!

Published Sat, Feb 8 2025 6:01 AM | Last Updated on Sat, Feb 8 2025 6:01 AM

RBI repo rate cut to home loan EMIs go down

కొత్త గవర్నర్‌ సారథ్యంలో ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం 

అయిదేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు... 

రెపో రేటు పావు శాతం కోత.. 6.25 శాతానికి డౌన్‌ 

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు చికిత్స 

2025–26లో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా అంచనా

ద్రవ్యోల్బణం 4.2%కి తగ్గే చాన్స్‌

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్లుగా దాదాపు ఐదేళ్ల తర్వాత రుణ గ్రహీతలకు ఆర్‌బీఐ నుంచి చల్లని కబురు అందింది. కీలక రెపో రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలపై వడ్డీ రేట్లు ఇక దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పెరగడమే కానీ, తగ్గడమంటే ఏంటో తెలియని గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్‌ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్‌ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ముంబై: రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సారథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించేలా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును పావు శాతం తగ్గించింది.

 దీంతో ఈ ప్రామాణిక వడ్డీ రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగి రానుంది. గవర్నర్‌ సారథ్యంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్లో కేంద్రం మధ్య తరగతి వర్గాలకు ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం కల్పించిన వెంటనే ఆర్‌బీఐ కూడా తీపి కబురు అందించడం విశేషం. కాగా, ప్రస్తుత పాలసీ విషయంలో ప్రస్తుత తటస్థ (న్యూట్రల్‌) విధానాన్నే కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. 

వృద్ధి రేటు ఇలా...: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. మరోపక్క, ద్రవ్యోల్బణం కూడా 4.2 శాతానికి (ఈ ఆర్థిక సంవత్సరం అంచనా 4.8 శాతం) దిగొస్తుందని లెక్కగట్టింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.4 శాతానికి (నాలుగేళ్ల కనిష్టం) తగ్గిపోవచ్చని, ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేయడం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.21 శాతం గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత నెమ్మదిగా శాంతిస్తూ.. నవంబర్లో 5.48 శాతానికి, డిసెంబర్లో 5.22 శాతానికి దిగొచ్చింది.

 కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి వెంటాడుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం భయాలతో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్‌ ఇచ్చింది. ఈ పరిణామాలతో రూపాయి ఘోరంగా పడిపోతోంది. తాజాగా డాలరు మారకంలో సరికొత్త ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి 87.60కి క్రాష్‌ అవ్వడం తెలిసిందే. ఈ తరుణంలో ఆర్‌బీఐ రేట్ల కోత దేశీయంగానూ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని, రూపాయి పతనంతో విదేశీ నిధులు మరింత తరలిపోయే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రెపో రేటు అంటే.. 
బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీ రేటునే రెపో (రీపర్చేజ్‌) రేటుగా వ్యవహరిస్తారు. రెపో అధికంగా ఉంటే బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుంది, దీంతో రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతాయి. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదలాయిస్తాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత  కార్పొరేట్‌ లోన్లపైనా వడ్డీ భారం తగ్గుతుంది. అయితే, రెపో రేటు తగ్గడం వల్ల డిపాజిట్‌ రేట్లతో పాటు ఇతర పొదుపు సాధనాలపై కూడా తక్కువ వడ్డీ లభిస్తుంది.

ఇతర ముఖ్యాంశాలు... 
→ సైబర్‌ మోసాలకు అడ్డకట్ట వేసి, భద్రతను కట్టుదిట్టం చేయడం కోసం ప్రత్యేకంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటర్నెట్‌ డొమైన్‌ను డాట్‌ ఇన్‌ (.in)కు మార్చుకోవాలి. అంటే బ్యాంకులు ‘bank.in’, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ‘fin.in’ ఉపయోగించాలి. బ్యాంకు డొమైన్‌ మార్పు 2025 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానుండగా.. నాన్‌–బ్యాంకులకు రాబోయే రోజుల్లో అమలు చేయనున్నారు.
→ స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీలో రిజిస్టర్‌ అయిన బ్యాంకింగేతర బ్రోకరేజ్‌ సంస్థలు తమ క్లయింట్ల తరఫున... ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్‌ లావాదేవీల కోసం ఇక నేరుగా నెగోషియేటెడ్‌ డీలింగ్‌ సిస్టమ్‌–ఆర్డర్‌ మ్యాచింగ్‌ (ఎన్‌డీఎస్‌–ఓఎం) ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎల్రక్టానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నియంత్రిత సంస్థలకు, బ్యాంకులు, ప్రత్యేక ప్రైమరీ డీలర్ల తరఫున క్లయింట్లకే అందుబాటులో ఉంది. 
→ తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్‌ 7–9 తేదీల్లో జరుగుతుంది.

గృహ రుణంపై ఊరట ఎంతంటే..? 
ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 9 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ. 25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,493 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్‌బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.75 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.22093కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.400 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ. 96 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.

5ఏళ్లలో తొలిసారి.. 
    2020 తర్వాత తొలి సారి రెపో రేటు ను తగ్గించగా.. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ కీలక రేట్లలో మార్పులు చేయడం విశేషం. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఆర్‌బీఐ రెపో రేటును ఏకధాటిగా 4% నుంచి 6.5 శాతానికి, అంటే 2.5% పెంచేసింది. ఆ తర్వాత రేట్లలో మార్పు లేకుండా యథాతథ పాలసీని కొనసాగిస్తూ వస్తోంది. ఇక గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఆల్‌టైమ్‌ కనిష్టాన్ని (దాదాపు 6%) తాకిన తర్వాత కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం 9–9.5% రేంజ్‌లో తీవ్ర భారంగా మారాయి. అధిక వడ్డీ రేట్లకు తోడు పన్నుల భారం ధరల పెరుగుదల డెబ్బతో గత రెండేళ్లుగా ఇల్లు కొనాలంటే బెదిరిపోయే పరిస్థితి నెలకొంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణ గ్రహీతలకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

సానుకూల పరిస్థితులతోనే... 
గడిచిన కొన్ని పాలసీ చర్యల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలున్నాయి. 2025–26లో ద్రవ్యోల్బణం మరింత శాంతించి ఆర్‌బీఐ టార్గెట్‌ (4%) స్థాయికి చేరుతుందని భావిస్తున్నాం. ఈ సానుకూల పరిస్థితుల కారణంగానే మందగమనంలో ఉన్న వృద్ధికి తోడ్పాటు అందించేలా ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటు కోతకు మొగ్గు చూపింది. 2024–25 రెండో త్రైమాసికంలో వృద్ధి 5.4 శాతానికి (రెండేళ్ల కనిష్టం) తగ్గిన తర్వాత మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. 

ఈ వృద్ధి–ద్రవ్యోల్బణం లెక్కలను భేరీజు వేసుకునే నిర్ణయం ప్రకటించాం. స్థూల ఆర్థిక అంచనాల మేరకు భవిష్యత్తు సమావేశాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటాం. ఫైనాన్షియల్‌ వ్యవస్థలో తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) ఉండేలా అవసరమైన చర్యలన్నీ చేపడతాం. భారత్‌ మళ్లీ కచ్చితంగా 7 శాతానికి మించి వృద్ధి రేటు సాధిస్తుంది. బడ్జెట్లో ఆదాయపు పన్ను ఊరట వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు, నిజానికి ఇది వృద్ధికి చేదోడుగా నిలుస్తుంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, డాలరుతో దేశీ మారకం విలువ ’నిర్దిష్ట స్థాయి లేదా శ్రేణి’లో ఉండాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకోలేదు. 
– సంజయ్‌ మల్హోత్రా, ఆర్‌బీఐ గవర్నర్‌

సమయానుకూల నిర్ణయం.. 
ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయం సరైన సమయంలో వెలువడింది. నియంత్రణపరంగా చేపట్టిన చర్యలను కూడా స్వాగతిస్తున్నాం.      
– సి.ఎస్‌. శెట్టి, ఎస్‌బీఐ చైర్మన్‌  

ఇది సరిపోదు... 
ఆర్‌బీఐ పావు శాతం రేట్ల తగ్గింపు వల రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావం పరిమితంగానే ఉంటుంది. మొత్తం డిమాండ్‌ను పెంచి, ఇళ్ల విక్రయాలు జోరందుకోవాలంటే (ముఖ్యంగా అందుబాటు ధరల విభాగంలో) మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని ఆశిస్తున్నాం. 
– బొమన్‌ ఇరానీ, క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు

హౌసింగ్‌కు బూస్ట్‌... 
ఆర్‌బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రేపో తగ్గింపు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి. దీంతో మళ్లీ ఇళ్ల కొనుగోళ్లు పుంజుకునేందుకు దోహదం చేస్తుంది. 
– జి. హరిబాబు, నరెడ్కో జాతీయ అధ్యక్షుడు 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement