Union Budget 2024-25: ఉపాధికి ఊతం.. ధరలకు కళ్లెం! | Union Budget 2024-25: Finance Minister Nirmala Sitharaman presents Economic Survey 2023-24 | Sakshi
Sakshi News home page

Union Budget 2024-25: ఉపాధికి ఊతం.. ధరలకు కళ్లెం!

Published Tue, Jul 23 2024 4:41 AM | Last Updated on Tue, Jul 23 2024 4:41 AM

Union Budget 2024-25: Finance Minister Nirmala Sitharaman presents Economic Survey 2023-24

మోదీ 3.0 ఆర్థిక సర్వేలో ప్రభుత్వం ఉద్ఘాటన..

ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.5–7 శాతంగా అంచనా

లక్షలాది ఉద్యోగాల కల్పనే లక్ష్యం...

2030 నాటికి ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి

తయారీ, ఎగుమతులకు చైనా పెట్టుబడుల దన్ను...

నిర్మాణాత్మక సంస్కరణలతో 7 శాతం పైగా వృద్ధి..

ప్రైవేటు పెట్టుబడులు, చిన్న పరిశ్రమలకు ఊతం...

విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాల్సిందే...

కార్మిక, వ్యవసాయ సంస్కరణలు తక్షణావసరం..

పార్లమెంట్‌లో సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం అచితూచి నిర్ధేశించింది. స్థూలదేశీయోత్తత్తి (జీడీపీ) వృద్ధి 6.5–7 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్థిక సర్వేలో లెక్కగట్టింది. ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కిచెప్పింది. 

ధరాభారంతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ లేదా కూపన్ల రూపంలో నిర్ధిష్టంగా ఆర్థిక తోడ్పాటు కల్పించాల్సిఇన అవసరం ఉందని కూడా సర్వే సూచించింది. దేశంలో తయారీ రంగానికి తోడ్పాటు అందించడంతో పాటు ఎగుమతులను పెంచాలంటే చైనా నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, గతేడాది (2023–24) 8.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలు చాలా తక్కువగా ఉండటం విశేషం. ఆర్‌బీఐ నిర్దేశించిన 7.2 శాతం వృద్ధి రేటు అంచనాలతో పోలి్చనా సర్వేలో వృద్ధి అంచనా తగ్గింది.

 అనిశి్చత వర్షపాతం, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల మందగమనం వంటివి వృద్ధి అంచనాల తగ్గుదలకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. ‘భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ సవాళ్లన్నింటినీ దీటుగా ఎదుర్కొంటోంది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ సర్వే ముందుమాటలో పేర్కొన్నారు. కాగా, నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యకాలం పాటు నిలకడగా 7% వృద్ధి రేటు కొనసాగవచ్చని సర్వే తేల్చిచెప్పింది.

కార్మిక సంస్కరణలు వేగవంతం... 
కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రకటించే అవకాశం ఉంది. 

ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, చిన్న–మధ్య తరహా వ్యాపారాలకు చేయూతనందించడం, సాగును లాభసాటిగా మార్చేలా వ్యవసాయ సంస్కరణలు, వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు వనరుల సమీకరణ, ఆర్థిక అసమానాతలను తగ్గించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాలని కూడా సర్వే నొక్కిచెప్పింది.

 దేశంలో ఉద్యోగ కల్పనకు మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించాలంటే కార్మిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సి ఉంటుంది’ అని సర్వే తెలిపింది. 

చైనా పెట్టుబడులు పెరగాలి... 
భారత్‌ ఎగుమతులు, దేశీ తయారీ రంగం మరింత పుంజుకోవాలంటే, చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగాలని, లేదంటే చైనా సరఫరా వ్యవస్థతో భారత్‌ అనుసంధానం కావాల్సి ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. మరోపక్క, చైనా నుంచి దేశంలోకి దిగుమతులు తగ్గాలని కూడా పేర్కొంది. ‘అమెరికా తదితర కీలక మార్కెట్లకు భారత్‌ ఎగుమతులు భారీగా పెరగాలంటే చైనా పెట్టుబడులపై మనం మరింత దృష్టి సారించాలి. తూర్పు ఆసియా దేశాలు గతంలో ఇదే విధంగా లబ్ధి పొందాయి’ అని సర్వే తెలిపింది. 

2020లో గాల్వాన్‌లో చోటు చేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్‌ టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా 200 చైనా మొబైల్‌ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా ఎలక్ట్రిక్‌ వాహన దిగ్గజం బీవైడీ భారీ పెట్టుబడి ప్రతిపాదనలను కూడా తిరస్కరించింది.  2000–2024 మధ్య భారత్‌ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐలలో చైనా కేవలం 0.37% (2.5 బిలియన్‌ డాలర్లు) వాటాతో 22 స్థానంలో ఉంది. కాగా, కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సర్వే స్పష్టం చేసింది.

పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీ
వడ్డీరేట్ల నిర్ణయంలో ఆహార ధరలను పక్కనబెట్టండి..
ఆర్‌బీఐకి సర్వే సూచన 
వడ్డీ రేట్లను నిర్ణయించడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. ‘‘భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్‌.. ఫుడ్‌ ఆరి్టకల్స్‌ను పక్కనబెట్టాలి. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్‌ ప్రేరితం కాదు’’ అని ఆర్థిక సర్వే పేర్కొంది. 

మధ్య, దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం అవుట్‌లుక్‌ ధరల యంత్రాంగం పటిష్టత, మార్కెట్‌ అంశాలు, నిత్యావసారాల దేశీయ ఉత్పత్తి, దిగుమతులు వంటి అంశాలపై ఆధారపడుతుందని వివరించింది. అననుకూల వాతావరణం, తక్కువ రిజర్వాయర్‌ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసి, గత రెండేళ్లలో ఆహార ధరలను పెంచడానికి దారితీసిందని కూడా సర్వే పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ఆర్‌బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ఆధారపడే సంగతి తెలిసిందే. ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో ఇది 4 శాతంగా ఉండాలే చూడాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్ధేశిస్తోంది. 

ఈ సూచీలో ఫుడ్‌ ఆరి్టకల్స్‌ ఒక భాగం. రిటైల్‌ ద్రవ్యోల్బణం 4  శాతం లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్‌బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని పక్కనపెట్టి... రుణ రేట్లను తగ్గిస్తే ఆ నిర్ణయం వృద్ధికి దోహదపడుతుందన్నది సర్వే అభిప్రాయం.  

ప్రయివేట్‌ రంగ పెట్టుబడులు కీలకం 
ప్రయివేట్‌ రంగ ఫైనాన్సింగ్, కొత్త వర్గాల నుంచి వనరుల సమీకరణ దేశీయంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల(ఇన్‌ఫ్రా) నిర్మాణానికి కీలకమని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పాలసీలు, సంస్థాగత మద్దతుతోపాటు.. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సైతం ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. మౌలిక రంగంలోని వివిధ విభాగాలకు పెట్టుబడులు సమకూర్చడంలో గణాంకాలు, మార్గదర్శకాలు తదితర నివేదికలు అత్యవసరం.

 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కున్న డిమాండ్‌ను అంచనా వేయడం, ఉపవిభాగాల కల్పనలో సౌకర్యాల వినియోగం వంటి అంశాలకు ప్రస్తుత డేటాబేస్‌ సామర్థ్యం సరిపోదు.  ఆర్థికపరమైన ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకీకృత ప్రణాళికల నేపథ్యంలో ఆచరణసాధ్యమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తిచేయవలసి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం కీలకమవుతుంది.

రైల్వేల సామర్థ్యం పెరగాలి.. 
సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం, కార్యకలాపాలను ఆధునీకరించుకోవడం, ఇంధన ఆదా తదితర అంశాలపై రైల్వేస్‌ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎకనమిక్‌ సర్వే సూచించింది. ఇందుకు అనుగుణంగా సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, హై స్పీడ్‌ రైళ్లు, వందే భారత్‌.. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ .. ఆస్థా స్పెషల్‌ ట్రెయిన్స్‌ వంటి ఆధునిక ప్యాసింజర్‌ సరీ్వస్‌ రైళ్లు, అధిక సామర్థ్యం ఉండే రైల్వే కోచ్‌లు, లాస్ట్‌–మైల్‌ రైల్‌ లింకేజీలు మొదలైన వాటిపై ఇన్వెస్ట్‌ చేయాలని పేర్కొంది. లాజిస్టిక్స్‌ వ్యయాలను, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రైల్వేస్‌ 3 ప్రధాన కారిడార్ల రూపకల్పనలో ఉందని వివరించింది. ట్రాఫిక్‌ సాంద్రత అధికంగా ఉండే కారిడార్లు, ఇంధన.. ఖనిజ.. సిమెంట్‌ కారిడార్లు, రైల్‌ సాగర్‌ (పోర్టు కనెక్టివిటీ) కారిడార్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది.

పర్యాటక రంగంలో అవకాశాలు అపారం..
పర్యాటక రంగం కలి్పస్తున్న అవకాశాలను సొంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. కరోనా విపత్తు తర్వాత పర్యాటక రంగం వేగంగా కోలుకోవడాన్ని ప్రస్తావించింది. ‘2023లో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 43.5 శాతం ఎక్కువ. భారత పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో 39వ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. పర్యాటకం ద్వారా రూ. 2.3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. ఇది క్రితం ఏడాదితో పోలి్చతే 65.7% అధికం’అని సర్వే తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) భారత సేవల  ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ‘క్యాపిటల్‌ ఎకనమిక్స్‌’ నివేదికను ప్రస్తావిస్తూ.. ఉపాధి కల్పన విషయంలో తక్కువ నైపుణ్యాలపై ఆధారపడిన పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తోందని పేర్కొంది. 

వృద్ధిలో క్యాపిటల్‌ మార్కెట్లు కీలకం
దేశీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్యాపిటల్‌ మార్కెట్లు కీలకంగా మారుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. టెక్నాలజీ, ఇన్నొవేషన్, డిజిటైజేషన్‌ దన్నుతో మూలధన నిర్మాణం, పెట్టుబడుల విస్తరణలో క్యాపిటల్‌ మార్కెట్ల వాటా బలపడుతోంది. అంతేకాకుండా దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ రిసు్కలు, వడ్డీ రేట్లుసహా కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలోనూ దేశీ క్యాపిటల్‌ మార్కెట్లు గతేడాది(2023–24) ఉత్తమ పనితీరు చూపిన వర్ధమాన మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. 

ఈ కాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇన్వెస్టర్లకు భారీ(25%కిపైగా) రిటర్నులు అందించాయి. ఇందుకు స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వం,  దేశీ ఇన్వెస్టర్ల బలిమి తోడ్పాటునిచి్చనట్లు సీతారామన్‌ పేర్కొన్నారు. 2024 మే నెలలో ఈక్విటీ మార్కెట్ల విలువ 5 ట్రిలియన్‌ డాలర్ల(రూ. 415 లక్షల కోట్లు)కు చేరింది. ప్రస్తుతం 9.5 కోట్లమంది రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా 2,500 లిస్టెడ్‌ కంపెనీలలో 10% వాటాను కలిగి ఉన్నారు. గతేడాది ప్రైమరీ మార్కెట్ల ద్వారా రూ. 10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటుకు సహకారమందింది.

వ్యవసాయంలో సత్వర సంస్కరణలు 
వ్యవసాయ రంగంలో సంస్కరణలను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. లేదంటే ఈ రంగంలో నెలకొన్న వ్యవస్థీకృత సమస్యలు దేశ వృద్ధికి అడ్డుపడతాయని విధానకర్తలను హెచ్చరించింది. తూర్పు ఆసియా దేశాలు, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలి్చతే.. దేశ వ్యవసాయరంగం సామర్థ్యాలను ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు వ్యవసాయరంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ రంగంపై దేశవ్యాప్తంగా చర్చలు అవసరమని నాగేశ్వరన్‌ పిలుపునిచ్చారు.

 ‘‘దేశ వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎలాంటి సంక్షోభంలో లేదు. కాకపోతే నిర్మాణాత్మక మార్పు అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పులు, నీటి సమస్య రానున్న రోజుల్లో పెద్దవి కానున్నాయి’’అని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విద్యుత్, ఆదాయపన్ను, మద్దతు ధరల పరంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ ప్రస్తుత విధానాలను తిరిగి సమీక్షించా లని అభిప్రాయపడింది. టెక్నాలజీ ఆధునికీకరణ, మార్కెటింగ్‌ మార్గాలను మెరుగుపరచడం, సాగులో ఆవిష్కరణలు, వ్యవసాయం–పరిశ్రమల మధ్య అనుసంధానత పెంపు దిశగా సంస్కరణలను సూచించింది.  

ఆర్థిక సర్వే హైలైట్స్‌..

→ అసాధారణరీతిలో వరుసగా మూడోసారి ప్రజలు మోదీ 3.0 సర్కారుకు పట్టం కట్టడం దేశంలో రాజకీయపరమైన, విధానపరమైన స్థిరత్వాతనికి అద్దం పడుతోంది. 
→ అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయ వృద్ధి చోదకాలు 2023–24లో ఆర్థిక పురోగతికి దన్నుగా నిలిచాయి. 
→ భౌగోళిక, రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత 
ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన, స్థిరమైన ప్రగతిని సాధిస్తోంది. 
→ కరోనా మహమ్మారి తదనంతరం దేశీయ వ్యాపార, వాణిజ్య రంగం రికవరీ కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంది. 
→ వాణిజ్యం, పెట్టుబడులు, వాతావారణ మార్పుల వంటి ప్రపంచ సమస్యల విషయంలో వివిధ దేశాలతో ఒప్పందాలు క్లిష్టతరంగా మారాయి. 
→ స్వల్పకాలానికి ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుముఖ ధరోణిలోనే ఉన్నప్పటికీ, పప్పుధాన్యాల కొరత , ధరల ఒత్తిడి నిలకడగా కొనసాగుతోంది. 
→ సాధారణ వర్షపాతం, దిగుమతులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ధరలు శాంతించడంతో ఆర్‌బీఐ సానుకూల ద్రవ్యోల్బణం అంచనాలకు దన్నుగా నిలుస్తోంది. 
→ అధిక ఆహార ధరలతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, నిర్దిష్ట కొనుగోళ్లకు కూపన్‌ల రూపంలో కొంతకాలం పాటు ప్రయోజనాలను అందించాలి. 
→ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానంపై ప్రభావం చూపొచ్చు. 
→ భారతదేశ ఆర్థిక సేవల రంగం పటిష్టమైన అవకాశాలున్నాయి. ఈ రంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా, దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. 
→ కార్పొరేట్‌ కంపెనీలు, బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లు పటిష్టంగా ఉండటంతో ప్రైవేటు పెట్టుబడులు మరింత పుంజుకోనున్నాయి. 
→ పన్ను నిబంధలనను సరళతరం చేయడం, వ్యయ నియంత్రణ, డిజిటైజేషన్‌ వంటివి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను సాధించేందుకు దోహదం చేస్తున్నాయి. 
→ భారత వృద్ధి పథానికి క్యాపిటల్‌ మార్కెట్లు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక షాక్‌లకు మన మార్కెట్లు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. 
→ చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకోవడం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలు మెరుగుపరచడంలో, ఎగుమతులను పెంచుకోవడంలో భారత్‌కు దన్నుగా నిలుస్తుంది. 
→ 2024లో దేశంలోకి వచి్చన రెమిటెన్సులు (ప్రవాసులు స్వదేశానికి పంపిన నిధులు) 3.4 శాతం వృద్ధితో 124 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఈ మొత్తం 129 బిలియన్‌ డాలర్లను తాకనుంది.

గ్రీన్‌ ఎనర్జీ @ రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు 
దేశీయంగా 2024–2030 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన (ఆర్‌ఈ) రంగంలో రూ. 30.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం స్థల సమీకరణ సమస్యలను పరిష్కరించుకోవడం, సానుకూల నిబంధనలతో నిధులను సమీకరించుకోవడం కీలకమని పేర్కొంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాలను సాధించే క్రమంలో వివిధ విభాగాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరగలదని వివరించింది. మరోవైపు, ఉద్గారాల విషయంలో 2070 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలంటే భారత్‌కు ఏటా సగటున 28 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని సర్వే తెలిపింది. నిధులను సమకూర్చుకోవడమనేది ఒక అసాధారణ సవాలు కాగలదని వివరించింది.

14 శాతం ఐఫోన్ల తయారీ ఇక్కడే 
ఎల్రక్టానిక్స్‌ తయారీలో అంతర్జాతీయంగా భారత్‌ తన వాటాను పెంచుకుంటున్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24లో స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌  14% ఐఫోన్లను భారత్‌లోనే అసెంబుల్‌ చేసినట్టు వెల్లడించింది. దేశ ఎలక్ట్రానిక్స్‌ తయారీ 2014 తర్వాత నుంచి గణనీయమైన వృద్ధిని చూస్తోందంటూ, 2021–22లో అంతర్జాతీయంగా మన వాటా 3.7%. దేశ జీడీపీలో 4% వాటాను ఆక్రమించింది. ఎల్రక్టానిక్స్‌ ఎగుమతుల్లో మొబైల్‌ ఫోన్ల విభాగం అధిక వృద్ధిని చూస్తోందని, అమెరికాకు మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు 2022–23లో 2.2 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2023–24లో 5.7 బిలియన్‌ డాలర్లకు దూసుకుపోయినట్టు వివరించింది. 2022–23లో దేశీయంగా ఎల్రక్టానిక్స్‌ తయారీ రూ.8.22 లక్షల కోట్లకు చేరితే, ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది.

ఏటా 78 లక్షల కొలువులు సృష్టించాలి.. 
కార్మిక శక్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయేతర రంగాల్లో 2030 నాటికి ఏటా దాదాపు 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ విషయంలో ప్రైవేట్‌ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి అనేది ఉద్యోగాల కల్పన కన్నా జీవనోపాధి కల్పించడంపై ఆధారపడి ఉంటుందని సర్వే వివరించింది. 

వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి 2023లో 45.8 శాతం స్థాయి నుంచి 2047 నాటికి 25 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇదంతా వ్యవసాయేతర రంగాల వైపు మళ్లు తుంది కాబట్టి ఆ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుందని సర్వే పేర్కొంది. పీఎల్‌ఐ స్కీములు, మిత్రా టెక్స్‌టైల్‌ స్కీము మొదలైనవి ఇందుకు కొంత తోడ్పడగలవని తెలిపింది. 

స్టాఫింగ్‌ కంపెనీల ద్వారా తాత్కాలిక సిబ్బంది నియామకాలు పెరుగుతున్నందున అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు దీన్నొక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చని వివరించింది. తయారీ రంగ శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి సాధన దిశగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వ్యాపారసంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పునఃసమీక్షించాలని సూచించింది. వర్కర్ల తొలగింపునకు కాకుండా ఉద్యోగాల కల్పనకు కృత్రిమ మేథ(ఏఐ)రెని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాలని ముందుమాటలో ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు.  

వికసిత భారత్‌ వైపు పయనం
వికసిత భారత్‌ను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నందున ప్రస్తుత పటిష్టతలతోపాటు మరింత పురోగతికి అవకాశాలు ఉన్న మార్గాలను సర్వే గుర్తించింది. ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రబలమైన పటిష్టతలతను హైలైట్‌ చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకువచి్చన వివిధ సంస్కరణల ఫలితాలను కూడా సుస్పష్టం చేస్తోంది.  
– ఎక్స్‌ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ  

అంచనాలు సుసాధ్యం
7 శాతం వృద్ధి రేటు సాధన భారత్‌కు తేలికే. మేము నిరాశావాదులం కాదు.  రుతుపవనాల పురోగతి సవాళ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఫైనాన్షియల్‌ రంగం అవుట్‌లుక్‌ పటిష్టంగా కనబడుతోందని,  పొదుపులను  ఫైనాన్షియల్‌ మార్కెట్లవైపునకు మళ్లించడాన్ని చూస్తే.. భారత్‌ కుటుంబాలు కష్టాల్లో లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.  
– వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ  

పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్‌ బృందంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి పంకజ్‌ చౌదరి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement