
సేవల రంగం తోడ్పాటుతో భారత్ 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుందని ఒక నివేదిక అంచనా వేసింది. అప్పటికి జీడీపీ 23–35 ట్రిలియన్ డాలర్లకు (రూ.1,978–3,010 లక్షల కోట్లు) చేరుకుంటుందని తెలిపింది. దేశ జీడీపీలో సేవల రంగం వాటా 60 శాతంగా, తయారీ రంగం వాటా 32 శాతం మేర ఉంటుందని పేర్కొంది. ఈ నివేదికను బెయిన్ అండ్ కంపెనీ, నాస్కామ్ సంయుక్తంగా రూపొందించాయి.
‘రానున్న దశాబ్దాల్లో 20 కోట్ల మంది శ్రామికశక్తి అందుబాటులోకి వస్తారు. అధిక విలువ ఉద్యోగాలను కల్పించే వినూత్నమైన అవకాశం భారత్ ముందుంది. తద్వారా గణనీయమైన ఆర్థిక సామర్థ్యాలను వెలికితీయగలదు. ఇందుకు రంగాలవారీ టెక్నాలజీపరమైన కార్యాచరణ అవసరం. ఏఐ ఆధారిత చిప్ డిజైన్, విడిభాగాల తయారీకి కావాల్సిన ముడి సరుకుల సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు పోటీతత్వాన్ని, ఆవిష్కరణలను పెంచుతాయి. దీనివల్ల ఎగుమతుల్లో తయారీ వాటా 24 శాతం నుంచి 2047 నాటికి 45–50 శాతానికి చేరుకుంటుంది’ అని ఈ నివేదిక వివరించింది. అలాగే ఆటో విడిభాగాల ఎగుమతులు 200–250 బిలియన్ డాలర్లు చేరుకోవచ్చని అంచనా వేసింది.
ఇదీ చదవండి: ఈ–కామర్స్ దూకుడు
ఐదు కీలక రంగాలు..
అంతర్జాతీయంగా నెలకొన్న ధోరణులు, విస్తృతమైన అవకాశాల దృష్ట్యా.. ఎలక్ట్రానిక్స్, ఇంధనం, కెమికల్స్, ఆటోమోటివ్, సేవలు భారత్‌కు వృద్ధి చోదకాలుగా పనిచేస్తాయని ఈ నివేదిక తెలిపింది. పెరిగే ఆదాయం, నైపుణ్య కార్మికులు, మౌలిక వసతుల కల్పన ఈ వృద్ధికి నడిపిస్తాయని పేర్కొంది.