Union Budget 2024: పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూసిన 2024-25 కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా కొన్ని చర్యలను ఈ బడ్జెట్‌లో ఎన్‌డీఏ సర్కారు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా అనుమానం సర్వత్రా నెలకొంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పాత పన్ను విధానాన్ని ఎప్పుడు రద్దు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి తెలిపారు.
"పాత పన్ను విధానాన్ని ఏం చేయాలన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలన్నదే మా
ఉద్దేశం అని మాత్రమే చెప్పగలం. పాత పన్ను విధానం ఉంటుందో లేదో చెప్పలేను" అన్నారామె.
కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ తాజా బడ్జెట్‌లో పలు ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 నుంచి రూ. 75,000కి పెంచడం, స్లాబ్‌లను విస్తరించడం వంటివి ఉన్నాయి. దీంతో జీతం పొందే పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆమె చెప్పారు.
కొత్త పన్ను విధానాన్ని 2020లో ప్రవేశపెట్టారు. గత సంవత్సరం బడ్జెట్‌లో దీన్ని డిఫాల్ట్ చేశారు. పాత పన్ను విధానం ఇంటి అద్దె, సెలవు ప్రయాణ భత్యాలు, అలాగే సెక్షన్లు 80C, 80D, 80CCD(1b), 80CCD(2) కింద తగ్గింపులతో సహా అనేక తగ్గింపులు, మినహాయింపులను అందిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు, తగ్గింపులు లేవు.
Comments
Please login to add a commentAdd a comment