న్యూఢిల్లీ: ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో ఆకర్షణీయంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి వ్యక్తమవుతోందన్నారు. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిల్లో ఉందన్న ఆందోళనలు వినిపిస్తుండగా.. దీన్ని నియంత్రించగలమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇది పారిశ్రామిక శకం అంటూ.. ఎన్నో ఫండ్స్ భారత్‌కు రానున్నట్టు చెప్పారు.
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతారామన్ ప్రసంగించారు. ‘‘మన ద్రవ్యోల్బణం నియంత్రించతగినదే. ఆర్‌బీఐ ప్రకటన కూడా మార్కెట్లకు ఎంతో సానుకూల సందేశాన్నిచ్చింది’’అని ఆమె పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ గత వారం అర శాతం మేర రెపో రేటును పెంచడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
‘‘భారత్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న సావరీన్ ఫండ్స్, పెద్ద ఫండ్స్‌తో ప్రభుత్వం చురుగ్గా చర్చలు నిర్వహిస్తోంది. విలీనాలు, కొనుగోళ్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఎందుకంటే భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంతో ఆకర్షణీయంగా, మెరుగ్గా ఉంది. ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. అందుకే ఎంతో మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు’’అని మంత్రి సీతారామన్ చెప్పారు.
ఐబీసీ ఆకర్షణ కోల్పోకూడదు..
‘‘మనకు మంచి నిపుణులు అవసరం. లిక్విడేషన్ ఎలా చేయాలి? ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీని అత్యుత్తమంగా ఎలా నిర్వహించాలో తెలిసి ఉండాలి. ఐబీసీ చట్టం తన ఆకర్షణను కోల్పోతే దాన్ని మనం తట్టుకోలేం. ఈ చట్టం ఉద్దేశ్యాలను కాపాడుకోవాల్సిందే’’అని మంత్రి అన్నారు. ఐబీసీ చట్టం కింద కేసుల స్వీకరణకు తీవ్ర జాప్యం చోటు చేసుకోవడం, పరిష్కారాలకు కూడా చాలా సమయం పడుతుండడం, వసూలు కావాల్సిన వాటిల్లో బ్యాంకులు గణనీయ మొత్తాన్ని నష్టపోతుండడంతో ఈ చట్టంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment