వాహనదారులకు త్వరలో కేంద్రం శుభవార్త చెప్పనుందా? దేశంలో భారీగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా? పెట్రోల్, డీజిల్‌తో సహా మరికొన్నింటిపై పన్నులు తగ్గించే అవకాశం ఉందా? అవుననే అంటున్నాయి రాయిటర్స్ కథనాలు.
ఆకాశాన్ని తాకిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు కొన్నింటిపై ట్యాక్స్ తగ్గించే అవకాశం ఉందని రాయిటర్స్ తన కథనంలో తెలిపింది. గత కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం, ఆర్‌బీఐ కృషి చేస్తున్నాయి. ఇందలో భాగంగా గతేడాది మే నెలలో పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.
అయితే జనవరి నెల నుంచి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పంజా విసరడంతో కేంద్రం, ఆర్‌బీఐ లెక్కలు తారుమారయ్యాయి. డిసెంబర్ నెలలో 5.72 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతానికి చేరింది. జనవవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 6.52 శాతంగా (2022 ఇదే నెలతో పోల్చి ధరల తీరు) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న దానిప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాలి. అయితే 10 నెలలు ఆపైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్ నెలల్లో కట్టడిలోకి (ఆరు శాతం దిగువకు) వచ్చింది.
దేశంలో ఆహార ధరలు విపరీతంగా పెరగడం వల్లే రీటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక తృణధాన్యాల ధరలు ఏడాది ప్రాతిపదికన 16.12 శాతం పెరగగా, గుడ్లు 8.78 శాతం, పాలు 8.79 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 11.7 శాతం పడిపోయాయి. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం మొక్కజొన్నపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రస్తుతం 60 శాతం బేసిక్ డ్యూటీ వర్తిస్తోంది. అలాగే పెట్రో ధరలపై మరోసారి ఊరట ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి. దీనిపై అటు ఆర్థికమంత్రిత్వ శాఖ గానీ, ఆర్‌బీఐ గానీ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment