న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనూహ్యరీతిలో వడ్డీరేట్ల షాక్ ఇచ్చింది. కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది దీంతో ఈ రేటు 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్‌బీఐ పాలసీ రేటు పెంపు ఇది. ఈ ప్రభావంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఈఎంఐలు భారం కానున్నాయి.
కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4%కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు కొనసాగుతోంది. గడచిన 11 పాలసీ సమావేశాల్లో రెపో రేటును 4% వద్ద యథాతథంగా ఆర్‌బీఐ కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తూ వచ్చింది.
అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌సహా కమోడిటీ ధరల తీవ్రత, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితులు ఉత్పన్నం కావడం (ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలి), వ్యవస్థ నుంచి ఈజీ మనీ ఉపసంహరణలో భాగంగా అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు వంటి పలు అంశాలు ఆర్‌బీఐ తాజా అనూహ్య, ఆకశ్మిక నిర్ణయానికి కార ణమయ్యాయి. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల 2 నుంచి 4 వరకూ జరిపిన ద్వైమాసిక మధ్యంతర సమావేశంలో తాజా కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణం రెపో రేటు పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల కార్పొరేట్, వ్యక్తిగత రుణ వ్యయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ తక్షణం ఈ దిశలో నిర్ణయాలు తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును రెపో రేటుగా పేర్కొంటారు.
అర శాతం పెరిగి 4.5 శాతానికి సీఆర్‌ఆర్
రెపో రేటుతో బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. సీఆర్‌ఆర్ పెంపు వల్ల వ్యవస్థ నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వ్యవస్థ నుంచి వెనక్కు మళ్లుతాయన్నది అంచనా. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాల్సి ఉండగా జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ఏప్రిల్ మొదటి వారం ఆర్‌బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3%, 5.8%, 5.4 శాతం, 5.1శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ కమిటీ అంచనావేసింది. కాగా, సీఆర్‌ఆర్ కొత్త రేటు మే 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 7 శాతానికి చేరుకుంది. వరుసగా మూడవ నెలలో ఆర్‌బీఐ లక్ష్యానికి మించి నమోదవడం గమనార్హం. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ఫెడ్ ఫండ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చన్న అంచనాలు ఆర్‌బీఐ తాజా అనూహ్య నిర్ణయానికి నేపథ్యం.
జూన్‌లో మరో పావు శాతం పెంపు..!
కాగా ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) ఆర్‌బీఐ పాలసీ కమిటీ రెండవ ద్వైమాసిక ద్రవ్యపరపతి సమావేశం జూన్ 6వ తేదీ 8వ తేదీ మధ్య జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటును మరో పావుశాతం పెంచవచ్చన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment