కొత్త రుణాలపై వడ్డీరేట్లను రెపోరేటు, ఎమ్‌సీఎల్‌ఆర్ వంటి ఏదోఒక ప్రామాణిక రేటుతో అనుసంధానించాలన్న ఆర్‌బీఐ ఆదేశాల కారణంగా బ్యాంక్ షేర్లలో అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగానికి తగిన తోడ్పాటునందిస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అభయం ఇవ్వడంతో వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. ఆరంభంలోనే 174 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 80 పాయింట్ల నష్టంతో 36,644 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 10,848 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం 28 పైసలు పుంజుకొని 71.84కు చేరడంతో ఐటీ షేర్లు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.
357 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్: ఆర్‌బీఐ తాజా ఆదేశాల కారణంగా గృహ, వాహన, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలపై వడ్డీరేట్లు తగ్గుతాయని, దీంతో బ్యాంక్ షేర్లలో అమ్మకాలు జరిగాయని ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చౌహాన్ చెప్పారు. హాంగ్‌కాంగ్‌లో అలజడులకు కారణమైన వివాదస్పద బిల్లును అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం, వచ్చే నెలలో చర్చలు జరపడానికి అమెరికా–చైనాలు అంగీకరించడం ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చాయి. ఈ జోష్‌తో సెన్సెక్స్ 174 పాయింట్ల మేర లాభపడింది. అయితే వృద్ధి అంచనాలను రేటింగ్ సంస్థ, క్రిసిల్ తగ్గించడం ప్రతికూలత చూపింది, దీంతో ఈ లాభాలు ఆవిరయ్యాయి. మధ్యాహ్నం తర్వాత సెన్సెక్స్183 పాయింట్ల మేర నష్టపోయింది. రోజంతా 357 పాయింటల రేంజ్‌లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
వాహన షేర్ల స్పీడ్....
అమ్మకాల్లేక అల్లాడుతున్న వాహన రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభయం ఇవ్వడంతో వాహన షేర్లు పరుగులు పెట్టాయి. వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపు విషయమై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తామని గడ్కరీ తెలిపారు. పెట్రోల్, డీజీల్ వాహనాలపై నిషేధం విధించే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. దీంతో కాలుష్యం తగ్గించడానికి గాను ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించగలదన్న అంశంపై స్పష్టత వచ్చింది. దీంతో వాహన రంగ షేర్లు జోరుగా పెరిగాయి. టాటా మోటార్స్ 8 శాతం, ఎక్సైడ్ ఇండస్ట్రీస్2.8 శాతం, భారత్ ఫోర్జ్2.8 శాతం, మదర్సన్ సుమి సిస్టమ్స్ 2.6%, మారుతీ సుజుకీ 2.4%, మహీంద్రా అండ్ మహీంద్రా 2.2%, బజాజ్ ఆటో 1.6%, హీరో మోటొకార్ప్ 1.5%, టీవీఎస్ మోటార్ కంపెనీ 1.4%, అశోక్ లేలాండ్ 1%, ఐషర్ మోటార్స్ 0.7%చొప్పున లాభపడ్డాయి.
మిశ్రమంగా మార్కెట్
Published Fri, Sep 6 2019 3:05 AM | Last Updated on Fri, Sep 6 2019 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment