ముంబై: ఊహించని విధంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను పెంచడంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఎల్‌ఐసీ ఐపీఓ ప్రారంభం నేపథ్యంలో బడా ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ హోల్డింగ్స్ నుంచి పెద్ద ఎత్తున నగదు ఉపసంహరించుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. వడ్డీరేట్ల పెంపు నిర్ణయంతో బాండ్ మార్కెట్ వణికింది. పదేళ్ల కాలపరిమితి కలిగిన బాండ్లపై రాబడి రెండేళ్ల గరిష్ట స్థాయి 7.41 శాతానికి చేరింది.
యూఎస్ ఫెడ్ ద్రవ్యపాలసీ ప్రకటన (బుధవారం రాత్రి)కు ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. ఈ అంశాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక, రియల్టీ షేర్లలో భారీ స్థాయిలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 56 వేల స్థాయిని కోల్పోయి 1,307 పాయింట్లు క్షీణించి 55,669 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 392 పాయింట్లు నష్టపోయి 16,680 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు ఎనిమిది వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. సెన్సెక్స్ సూచీలో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, కొటక్ బ్యాంక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కాయి.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ రెండున్నర శాతం, స్మాల్ క్యాప్ సూచీ రెండుశాతం చొప్పున పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,338 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 76.40 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ ప్రకటకు ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వేచిచూచే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్‌కాంగ్, కొరియా మార్కెట్లు నష్టపోయాయి. చైనా, ఇండోనేషియా, జపాన్ మార్కెట్లకు సెలవు. యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.
కుప్పకూలిన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు
ఆర్‌బీఐ రెపో రేటు 40 బేసిస్ పాయింట్ల పెంపు నిర్ణయంతో వడ్డీరేట్ల ఆధారిత కుప్పకూలిన బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు కుప్పుకూలాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఏయూ స్మాల్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంక్ షేర్లు నాలుగు శాతం నుంచి అరశాతం వరకు క్షీణించాయి.అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, మారుతీ, హీరో మోటోకార్ప్, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్ షేర్లు నాలుగున్నర శాతం నుంచి రెండు శాతం పతనమయ్యాయి.
రూ.6.27 లక్షల కోట్లు సంపద ఆవిరి
ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు నిర్ణయంతో సోమవారం ఒక్కరోజే రూ.6.27 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.259 లక్షల కోట్లకు దిగివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment