రెపో రేటును తగ్గించని ఆర్‌బీఐ
6.50 శాతంగా కొనసాగింపు
ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉండటం కారణం
గృహ, ఆటో ఈఎంఐలు యథాతథం
వృద్ధి 7%, ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనాలు
ముంబై: ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఏడోసారీ కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. రెపో రేటును ప్రస్తుత 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ ఈ మేరకు పాలసీ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు మరికొన్నాళ్ల పాటు స్థిరంగా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. 2023 ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చలేదు. అంటే ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రేటు యథాతథంగా కొనసాగింది.
తాజాగా రెపో రేటును యథాతథంగా ఉంచాలన్న ప్రతిపాదనను మానిటరీ పాలసీ కమిటీలోని (ఎంపీసీ) ఆరుగురు సభ్యుల్లో ఒకరు వ్యతిరేకించగా అయిదుగురు సభ్యులు సానుకూలత వ్యక్తపర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం స్థాయిలోనూ (2023–24లో 7.6 శాతం), ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలోను (2023–24లో 5.4 శాతం) ఉంటుందన్న అంచనాలను ఆర్‌బీఐ కొనసాగించింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా, ఆహార ధరల బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.66 శాతంగా నమోదైంది.
2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం చొప్పున మొత్తం మీద సగటున 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. కాగా విదేశాల నుంచి స్వదేశానికి పంపించే డబ్బుకు (రెమిటెన్స్) సంబంధించి భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
► యూపీఐని వినియోగించడం ద్వారా త్వరలో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ సౌకర్యం
► ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం సులభతరానికి మొబైల్ యాప్ ప్రారంభం
► ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్‌లో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌కు అనుమతి
► డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిర శ్రేణిలో కదలాడుతోంది. ఆందోళక అక్కర్లేదు
► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వ్యవస్థాగతంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు
► జూన్ 5 నుంచి 7 వరకూ 2024–25 ఆర్‌బీఐ రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష
► సీబీడీసీ వాలెట్‌లను అందించడానికి నాన్–బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్‌లకు అనుమతి
► బ్యాంకింగ్ ద్రవ్య సంబంధ ఇబ్బందులు పడకుండా లిక్విడిటీ కవరేజ్ రేషియో సమీక్ష
► 2023–24లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 41.6 బిలియన్ డాలర్లు. 2014–15 తర్వాత అత్యధికం
పసిడి నిల్వల పెంపు
విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టతలో భాగంగా పసిడి వాటాను భారత్ పెంచుకుంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. మార్చి 29వ తేదీ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ హై 645.6 బిలియన్ డాలర్లకు చేరితే, అందులో పసిడి వాటా 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది.
సాగుపై చల్లని అంచనాలు
తీవ్ర వేసవి, నీటి ఎద్దడి భయాందోళనల నేపథ్యంలో ఆర్‌బీఐ ఎకానమీపై చల్లని అంచనాలను వెలువరించింది. తగిన వర్షపాతం అంచనాల నేపథ్యంలో వ్యవసాయ, గ్రామీణ క్రియాశీలతలో సానుకూలతలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఆశించిన స్థాయిలో సాధారణ రుతుపవనాల అంచనాలు, మంచి రబీ గోధుమ పంట, ఖరీఫ్ పంటల మెరుగైన అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. బలమైన గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ– సేవల రంగంలో స్థిరమైన పురోగతి ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. అయితే దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య మార్గాలలో పెరుగుతున్న అంతరాయాలు దేశ ఎకానమీకి ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా పేర్కొంది.
ఆహార ధరలపై అనిశ్చితి..
ఆహార ధరల్లో నెలకొన్ని అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది వేసవిలో కూరగాయల ధరల కదలికలపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వృద్ధికి ఊతమిస్తూనే మరోవైపు లకి‡్ష్యంచుకున్న స్థాయికి (4 శాతం) ద్రవ్యోల్బణం దిగి వస్తే కీలక రేట్లను తగ్గించడంపైనే ఎంపీసీ ప్రధానంగా దృష్టి పెడుతుంది.
– శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్
Comments
Please login to add a commentAdd a comment