ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలిసారిగా ఏప్రిల్ 6 నుండి 8 వరకూ సమావేశం కానుంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను 8న వెల్లడించనుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, వృద్ధికి ఊతమిచ్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉండటం తదితర అంశాల కారణంగా ఆర్‌బీఐ ఇప్పటివరకూ అనుసరిస్తున్న ధోరణిలో కొంత మార్పు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాలను ఎంపీసీ ఎగువ వైపుగా సవరించవచ్చని, 2022–23 వృద్ధి అంచనాలను కొంత తగ్గించవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ ఏప్రిల్ 2022 పాలసీ రివ్యూ నివేదికలో పేర్కొన్నారు. అయినప్పటికీ విదేశీ అంశాల కారణంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయడం కోసం వృద్ధిని పూర్తిగా త్యాగం చేయకపోవచ్చని తెలిపారు. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే రేటు) 4 శాతంగాను, రివర్స్ రెపో (బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులపై ఆర్‌బీఐ ఇచ్చే వడ్డీ) 3.35 శాతంగాను ఉంది. ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ 4 శాతం స్థాయిలో (2 శాతం అటూ, ఇటూగా) కట్టడి చేయాల్సి ఉంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో పరపతి విధానాన్ని మరింత కఠినతరం చేసేందుకు ఆర్‌బీఐకి పరిమిత స్థాయిలోనే అవకాశాలు ఉన్నాయని ఎక్యూటీ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment