Monetary policies
-
వడ్డీరేట్ల తగ్గింపుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్లో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశారు. సింగపూర్లో బ్రెట్టన్ వుడ్స్ కమిటీ నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు.‘ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేలా ప్రణాళికలు పాటిస్తున్నాం. వరుసగా రెండో నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉందని గణాంకాలు వెలువడ్డాయి. అయినప్పటికీ కీలక వడ్డీరేట్ల తగ్గింపు విషయంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోం. పాలసీ విధానకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కరోనా కారణంగా తగ్గిపోయిన ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుని వృద్ధిపథంలో దూసుకుపోతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశ జీడీపీ సరాసరి 7.5 శాతం వృద్ధి చెందింది. కానీ గత త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల వల్ల ప్రభుత్వ వ్యయం మందగించడం ఇందుకు కారణం’ అని దాస్ తెలిపారు.ఇదీ చదవండి: విమానం దారి మళ్లింపు.. కారణం..ఇదిలాఉండగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే 18 నెలలకు పైగా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. కొందరు ఆర్థికవేత్తలు ఈ సంవత్సరం చివరి త్రైమాసికం వరకు ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను మార్చబోదని అభిప్రాయపడుతున్నారు. అయితే పట్టణ ప్రజల వ్యయ సామర్థ్యం క్షీణిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతుండడంతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా వడ్డీరేట్లు తగ్గించాలని కొందరు అంటున్నారు. ఇప్పటికే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ 4 శాతంగా ఉన్న కీలక వడ్డీరేట్లను 3.75 శాతానికి తగ్గించింది. ఈ నెల 17, 18న జరిగే ఫెడ్ సమావేశంలో అమెరికా సైతం వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనాలున్నాయి. -
భారత్ వృద్ధికి ఢోకా లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ద్రవ్య, పరపతి విధానాలు కఠినంగా ఉన్నప్పటికీ, స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మెరుగైన స్థితిలో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక గురువారం తెలిపింది. ఖరీఫ్ పంట చేతికి అందడంతో రానున్న నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుందని, అదే సమయంలో వ్యాపార అవకాశాలు మెరుగుపడటంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 2022కు సంబంధించి నెలవారీ నివేదికను విడుదల చేసింది. అమెరికా వడ్డీరేట్లు పెంపు ‘‘భవిష్యత్ ఇబ్బంది’’కి సంబంధించినది పేర్కొంటూ, స్టాక్ ధరలు తగ్గడానికి దారితీసే అంశం ఇదని పేర్కొంది. దీనితోపాటు బలహీన కరెన్సీలు, అధిక బాండ్ ఈల్డ్స్, అధిక వడ్డీరేట్ల సమస్యలు పలు ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనాల్సి రావచ్చని పేర్కొంది. వృద్ధి అవకాశాల మందగమనం, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రపంచాన్ని మాంద్యం ముందు నిలబెట్టే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. భారత్ ఎగుమతులపై ఇది ప్రభావం చూపినప్పటికీ, దేశీయ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్ సైకిల్ పటిష్టత, వ్యవస్థాగత సంస్కరణలు భారత్కు రక్షణగా ఉంటున్నట్లు పేర్కొంది. -
క్రిప్టోలను నిషేధించాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్య.. ఆర్థిక విధానాల స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు దెబ్బతీసే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వాటిపై నిషేధం విధించాలన్న అభిప్రాయంతో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు వెల్లడించారు. ‘దేశ ద్రవ్య, ఆర్థిక విధానాలను అస్థిరపర్చే అవకాశమున్నందున క్రిప్టోలపై చట్టాలను రూపొందించాలని ఆర్బీఐ సూచించింది. క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నది ఆర్బీఐ అభిప్రాయం‘ అని లోక్సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఏ కరెన్సీనైనా కేంద్రీయ బ్యాంకులు లేదా ప్రభుత్వాలే జారీ చేయాల్సి ఉంటుందని.. క్రిప్టోలు ఆ కోవకు చెందవు కాబట్టి వాటిని కరెన్సీగా పరిగణింపజాలమని ఆర్బీఐ పేర్కొంది. అధికారిక కరెన్సీల విలువకు ఒక చట్టబద్ధత ఉంటుందని, కానీ క్రిప్టోలన్నీ కూడా స్పెక్యులేషన్పైనే పనిచేస్తాయి కాబట్టి దేశ ద్రవ్య, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది. క్రిప్టోకరెన్సీలకు సరిహద్దులేమీ లేకపోవడంతో వీటిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాల్సిన అవసరం ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అప్పుడు మాత్రమే క్రిప్టోలపై నిషేధం సమర్థంగా అమలు కాగలదని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాతాళానికి రూపాయి, మరింత పతనం తప్పదా? -
యధాతథంగా వడ్డీ రేట్ల కొనసాగింపు?
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలిసారిగా ఏప్రిల్ 6 నుండి 8 వరకూ సమావేశం కానుంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను 8న వెల్లడించనుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, వృద్ధికి ఊతమిచ్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉండటం తదితర అంశాల కారణంగా ఆర్బీఐ ఇప్పటివరకూ అనుసరిస్తున్న ధోరణిలో కొంత మార్పు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాలను ఎంపీసీ ఎగువ వైపుగా సవరించవచ్చని, 2022–23 వృద్ధి అంచనాలను కొంత తగ్గించవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ ఏప్రిల్ 2022 పాలసీ రివ్యూ నివేదికలో పేర్కొన్నారు. అయినప్పటికీ విదేశీ అంశాల కారణంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయడం కోసం వృద్ధిని పూర్తిగా త్యాగం చేయకపోవచ్చని తెలిపారు. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే రేటు) 4 శాతంగాను, రివర్స్ రెపో (బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ) 3.35 శాతంగాను ఉంది. ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ 4 శాతం స్థాయిలో (2 శాతం అటూ, ఇటూగా) కట్టడి చేయాల్సి ఉంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో పరపతి విధానాన్ని మరింత కఠినతరం చేసేందుకు ఆర్బీఐకి పరిమిత స్థాయిలోనే అవకాశాలు ఉన్నాయని ఎక్యూటీ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి అభిప్రాయపడ్డారు. -
వర్థమాన దేశాల ద్రవ్య విధానాలు భేష్!
♦ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ♦ దీనిపై ఐఎంఎఫ్ వైఖరి మారాలని సూచన ముంబై: వర్థమాన దేశాలు అనుసరించే ద్రవ్య విధానాల పట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ వంటి బహుళజాతి సంస్థలు తమ ధోరణిని మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్య, పరపతి విధానాలు పటిష్టంగా అన్నీ ఆలోచించి తగిన విధంగా తీసుకుంటారని, వర్థమాన దేశాల్లో అలాకాకుండా ప్రభుత్వం లేదా గవర్నర్ల ‘తిక్క’ నిర్ణయాలు ఉంటాయని బహుళజాతి సంస్థలు భావిస్తుంటాయని, ఈ ధోరణి సరికాదని రాజన్ ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. పటిష్ట రీతిలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకునే వర్థమాన దేశాల్లో కూడా ద్రవ్య పరపతి విధానాలు ఉంటాయని వివరించారు. ఏప్రిల్5 రేటు కోతలో మెజారిటీ నిర్ణయానికే రాజన్ ఓటు! ఆర్బీఐ ఈ నెల 5వ తేదీన బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ఈ సందర్భంగా గవర్నర్ రఘురామ్ రాజన్, ఇందుకు సంబంధించి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మెజారిటీ అభిప్రాయానికే ఓటు చేశారు. ఈ విషయంలో ఆయన ప్రస్తుతం తనకుతానుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నా... మెజారిటీ ప్రాతిపదికన రేటు కోత నిర్ణయం తీసుకున్నట్లు నేడు విడుదలైన నాటి సమావేశం మినిట్స్ వివరాలు తెలిపాయి.