వడ్డీరేట్ల తగ్గింపుపై గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు | RBI governor signaled no immediate plans to cut interest rates | Sakshi
Sakshi News home page

‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’

Published Fri, Sep 13 2024 5:47 PM | Last Updated on Fri, Sep 13 2024 6:53 PM

RBI governor signaled no immediate plans to cut interest rates

ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తారని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశారు. సింగపూర్‌లో బ్రెట్టన్ వుడ్స్ కమిటీ నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు.

‘ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేలా ప్రణాళికలు పాటిస్తున్నాం. వరుసగా రెండో నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉందని గణాంకాలు వెలువడ్డాయి. అయినప్పటికీ కీలక వడ్డీరేట్ల తగ్గింపు విషయంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోం. పాలసీ విధానకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కరోనా కారణంగా తగ్గిపోయిన ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుని వృద్ధిపథంలో దూసుకుపోతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశ జీడీపీ ‍సరాసరి 7.5 శాతం వృద్ధి చెందింది. కానీ గత త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల వల్ల ప్రభుత్వ వ్యయం మందగించడం ఇందుకు కారణం’ అని దాస్‌ తెలిపారు.

ఇదీ చదవండి: విమానం దారి మళ్లింపు.. కారణం..

ఇదిలాఉండగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే 18 నెలలకు పైగా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. కొందరు ఆర్థికవేత్తలు ఈ సంవత్సరం చివరి త్రైమాసికం వరకు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను మార్చబోదని అభిప్రాయపడుతున్నారు. అయితే పట్టణ ప్రజల వ్యయ సామర్థ్యం క్షీణిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతుండడంతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా వడ్డీరేట్లు తగ్గించాలని కొందరు అంటున్నారు. ఇప్పటికే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ 4 శాతంగా ఉ‍న్న కీలక వడ్డీరేట్లను 3.75 శాతానికి తగ్గించింది. ఈ నెల 17, 18న జరిగే ఫెడ్‌ సమావేశంలో అమెరికా సైతం వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement