![Impact of interest Rate Cuts on the Banking System Immediate and Long Term Effects](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/rbi01.jpg.webp?itok=HF2V7GRw)
ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం రెపో రేటుతో అనుసంధానమయ్యే రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై, ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), డిపాజిట్లతో ముడిపడి ఉన్న రుణాలపై విస్తృత ప్రభావాలు చూపడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
రెపో లింక్డ్ రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనాలు
ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీని రెపో రేటు అంటారు. రెపో రేటును తగ్గించడం వల్ల ఈ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. ఇది చాలా మంది రుణగ్రహీతలకు సమాన నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించడానికి దారితీస్తుంది.
ఎంసీఎల్ఆర్ రుణాలపై ప్రభావం ఆలస్యం
ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్‌తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం వెంటనే కనిపించదు. ఎంసీఎల్ఆర్ అనేది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. రెపో రేటు మాదిరిగా కాకుండా బ్యాంకులకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు.. వంటి వాటిపై ఆధారపడి ఎంసీఎల్‌ఆర్‌లో మార్పులు ఉంటాయి. రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్‌ఆర్‌లో పూర్తిగా ప్రతిబింబించడానికి కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు తమ వ్యయాలను సర్దుబాటు చేయడానికి, రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయడానికి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. ఫలితంగా ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్నవారు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంత కాలం ఆగాలి.
ఇదీ చదవండి: టార్గెట్ ఎఫ్‌డీఐ.. విధానాల సవరణకు యోచన!
డిపాజిట్లకు సవాల్..
వడ్డీరేట్ల తగ్గింపు డిపాజిట్ల పరంగా బ్యాంకులకు సవాలుగా మారుతుంది. రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. డిపాజిట్ రేట్లను వెంటనే తగ్గించడం వల్ల బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం కష్టతరం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ పొదుపుపై మంచి రాబడిని కోరుకునే ఇతర మార్గాలను ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment