
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై విధించిన పర్యవేక్షక ఆంక్షలను ఎత్తివేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏ కింద 2024 ఏప్రిల్ 24న విధించిన ఆంక్షలను తొలగించింది. బ్యాంక్ తన ఆన్‌లైన్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి, తిరిగి కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు అనుమతించింది.
ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ప్యాచ్ అండ్ చేంజ్ మేనేజ్‌మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెక్యూరిటీతో సహా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ మౌలిక వసతుల్లో లోపాలను గతంలో ఆర్‌బీఐ గమనించింది. దాంతో నిబంధనలు పాటించకపోవడం వల్ల బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. ఫలితంగా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్) కార్యకలాపాలు, ఆన్‌లైన్, డిజిటల్ బ్యాంకింగ్ ఛానళ్లు కొంతకాలంగా అంతరాయాలు ఎందుర్కొంటున్నాయి.
నివారణ చర్యలు
ఆర్‌బీఐ ఆందోళనలకు ప్రతిస్పందనగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నివారణ చర్యలను ప్రారంభించింది. లోపాలు సవరించుకునేందుకు బ్యాంకు అనుసరిస్తున్న విధానాలను నిత్యం ఆర్‌బీఐకు నివేదికల రూపంలో సమర్పించింది. ఈ కాంప్లయన్స్‌ను ధ్రువీకరించడానికి ఆర్‌బీఐ ఆమోదించిన ఎక్స్‌టర్నల్ ఆడిట్‌ను బ్యాంక్ పూర్తి చేసింది. బ్యాంకు తీసుకున్న పరిష్కార చర్యలతో సంతృప్తి చెందిన ఆర్‌బీఐ గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: స్టార్‌లింక్ సేవలను ధ్రువీకరించిన మస్క్
ఆంక్షలు ఎత్తివేయడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు మార్గం లభించింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు లైన్‌క్లియర్ అయింది. ఈ చర్య వల్ల సమర్థవంతమైన కస్టమర్ సేవలను అందించడానికి వీలవుతుంది. బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ ఆంక్షలు ఎత్తివేయడం కీలకంగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment