
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ సవాళ్లను పరిష్కరించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2024 డిసెంబర్‌లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలపై దృష్టి సారించారు. గత నాలుగు నెలల్లో సవాళ్లతో కూడిన లిక్విడిటీ పరిస్థితులను సమర్థంగా నిర్వహించేందుకు ఆర్‌బీఐ రూ.43.21 లక్షల కోట్లను చొప్పించింది.
2024 డిసెంబర్ 16 నుంచి 2025 ఫిబ్రవరి 14 మధ్య బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు రూ.30,000 కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. పన్ను ప్రవాహాలు, పరిమిత ప్రభుత్వ వ్యయం, రూపాయికి మద్దతుగా ఫారెక్స్ మార్కెట్లో ఆర్‌బీఐ భారీగా జోక్యం చేసుకోవడం ఈ మార్పునకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు
పెరుగుతున్న లిక్విడిటీ లోటును పరిష్కరించేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ కీలక చర్యలు తీసుకుంది. వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలం ద్వారా రూ.16.38 లక్షల కోట్లను అందుబాటులో తీసుకొచ్చింది. రోజువారీ వీఆర్ఆర్ వేలం ద్వారా రూ.25.79 లక్షల కోట్లను అందించింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా రూ.60,020 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసింది. విదేశీ కరెన్సీ కొనుగోలు-అమ్మకం ద్వారా సుమారు రూ.45,000 కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది.
ఇదీ చదవండి: ఒకప్పుడు సుజుకీ సంస్థ నమ్మని మొదటి బిలియనీర్!
మనీ మార్కెట్ రేట్లపై ప్రభావం
లిక్విడిటీ లోటు సమస్యలున్నప్పటికీ ఓవర్‌నైట్ మనీ మార్కెట్ రేట్లు ఆర్‌బీఐ రెపోరేటు కంటే కొంచెం అధికంగానే ఉన్నాయి. 6.6 శాతం నుంచి 6.74 శాతం మధ్య ట్రేడ్ అవుతున్నాయి. కార్పొరేట్లు, బ్యాంకుల రుణ వ్యయాలపై ఇది నిరంతర ఒత్తిడిని పెంచుతోంది. దీన్ని పరిష్కరించాలని బ్యాంకర్లు ఆర్‌బీఐను కోరుతున్నారు. ఆర్థిక సవాళ్లను నిర్వహించడానికి, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి ఆర్‌బీఐ విస్తృత వ్యూహంలో భాగంగా ఇటీవలి పాలసీ రేటు కోతకు మద్దతు ఇచ్చింది. దాంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment