వర్థమాన దేశాల ద్రవ్య విధానాలు భేష్!
♦ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
♦ దీనిపై ఐఎంఎఫ్ వైఖరి మారాలని సూచన
ముంబై: వర్థమాన దేశాలు అనుసరించే ద్రవ్య విధానాల పట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ వంటి బహుళజాతి సంస్థలు తమ ధోరణిని మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్య, పరపతి విధానాలు పటిష్టంగా అన్నీ ఆలోచించి తగిన విధంగా తీసుకుంటారని, వర్థమాన దేశాల్లో అలాకాకుండా ప్రభుత్వం లేదా గవర్నర్ల ‘తిక్క’ నిర్ణయాలు ఉంటాయని బహుళజాతి సంస్థలు భావిస్తుంటాయని, ఈ ధోరణి సరికాదని రాజన్ ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. పటిష్ట రీతిలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకునే వర్థమాన దేశాల్లో కూడా ద్రవ్య పరపతి విధానాలు ఉంటాయని వివరించారు.
ఏప్రిల్5 రేటు కోతలో మెజారిటీ నిర్ణయానికే రాజన్ ఓటు!
ఆర్‌బీఐ ఈ నెల 5వ తేదీన బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ఈ సందర్భంగా గవర్నర్ రఘురామ్ రాజన్, ఇందుకు సంబంధించి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మెజారిటీ అభిప్రాయానికే ఓటు చేశారు. ఈ విషయంలో ఆయన ప్రస్తుతం తనకుతానుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నా... మెజారిటీ ప్రాతిపదికన రేటు కోత నిర్ణయం తీసుకున్నట్లు నేడు విడుదలైన నాటి సమావేశం మినిట్స్ వివరాలు తెలిపాయి.