బ్యాంకులకు రేట్ల కోత సాధ్యంకాదు
ముంబై: ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అధిక ద్రవ్యోల్బణమే అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఉద్ఘాటించారు. కరెన్సీ రేటు తీవ్ర హెచ్చుతగ్గులు, పొదుపు దెబ్బతినడానికి.. వడ్డీరేట్లను తగ్గించకపోవడానికి అధిక ధరలే కారణమని పేర్కొన్నారు. తాజా పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడాన్ని సమర్థించుకున్నారు.
సమీక్ష అనంతరం ఒక మీడియా ఇంటర్వ్యూలో రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వడ్డీరేట్లను ఎలాబడితేఅలా తగ్గించేందుకు నా చేతిలో మంత్రదండం ఉందని ప్రజలు అనుకుంటారు. వీటిని నేనొక్కడినే నిర్ణయిస్తాననేది కూడా వారి అభిప్రాయం. వడ్డీరేట్లను కేవలం దేశ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులే నిర్ధారిస్తాయి. ఒకవేళ నేను పాలసీ రేట్లను భారీగా తగ్గించినా.. బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేందుకు సిద్ధంగా లేవు. అధిక ద్రవ్యోల్బణమే దీనికి కారణం. అందువల్ల ముందుగా ధరలకు కళ్లెం వేయాలి. ఈ విషయంలో మేం(ఆర్‌బీఐ) కొంత విజయం సాధించాం. అయితే, ధరల కట్టడిపై పోరు ఇంకా పూర్తికాలేదు’ అని రాజన్ వ్యాఖ్యానించారు.
ఎస్‌ఎల్‌ఆర్, సీఆర్‌ఆర్ నిబంధలను సడలిస్తాం
బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరు మరింత పెంచడంతోపాటు.. ప్రాధాన్య రంగాలకు రుణాల(పీఎస్‌ఎల్)ల కల్పన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆర్‌బీఐ ప్రాధాన్యమిస్తోందని రాజన్ చెప్పారు. తాజా సమీక్షలో పాలసీ వడ్డీరేట్లను తగ్గించకపోయినప్పటికీ.. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్-బ్యాంకుల ప్రభుత్వ బాండ్‌లలో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సిన నిధుల పరిమాణం)ని అర శాతం తగ్గించడానికి ఇదే కారణమన్నారు.
ఎస్‌ఎల్‌ఆర్, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్-బ్యాంకుల తమ డిపాజిట్ నిధుల్లో తప్పకుండా ఆర్‌బీఐ వద్ద ఉండచాల్సిన నిధుల పరిమాణం) తగ్గింపు వంటి చర్యలను దీర్ఘకాలంపాటు కొనసాగించనున్నామని కూడా రాజన్ తెలిపారు. సమీక్ష అనంతరం సాంప్రదాయంగా విశ్లేషకులతో జరిపిన సంభాషణల్లో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. తాజా కోతతో ఎస్‌ఎల్‌ఆర్ 22.5% నుంచి 22%కి దిగొచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల బ్యాంకులకు అదనంగా రూ.40 వేల కోట్లు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులతో పాటు ఇతరత్రా వర్గాలు కూడా ఎస్‌ఎల్‌ఆర్, సీఆర్‌ఆర్ వంటి తప్పనిసరి నిబంధనల విషయంలో వెసులుబాటునివ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నారని... ఈ దిశగా తగిన చర్యలు తీసుకుంటామని రాజన్ చెప్పారు.
ద్రవ్యోల్బణం దిగొస్తేనే..: తమ అంచనాల కంటే వేగంగా ద్రవ్యోల్బణం దిగొస్తే.. వృద్ధికి చేయూతనిచ్చేందుకు వడ్డీరేట్లను కచ్చితంగా తగ్గిస్తామని రాజన్ పేర్కొన్నారు. అయితే, వేగంగా ధరలు గనుక ఎగబాకితే, వడ్డీరేట్లను పెంచేందుకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2015 జనవరికల్లా 8 శాతం, 2016 జనవరి నాటికి 6 శాతానికి పరిమితం కావాలని ఆర్‌బీఐ లక్ష్యంగా నిర్ధేశించింది.
ప్రపంచ మార్కెట్లు మరోసారి క్రాష్ కావచ్చు..
ప్రపంచ మార్కెట్లు మరోసారి క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని రాజన్ హెచ్చరించారు. ధనిక దేశాల సరళ ద్రవ్య విధానాల కారణంగా ఏర్పడిన రిస్కీ ఆస్తులను అధిక ధరలకు ఇన్వెస్టర్లు కొంటూపోయి, ఆతర్వాత ఒక్కసారిగా అమ్మడం మొదలుపెడితే మార్కెట్లు పతనమయ్యే అవకాశాలుంటాయన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితిని మహా మాంద్యం సంభవించిన 1930వ దశకంనాటితో పోల్చారు. అప్పటికంటే సరళ ద్రవ్య విధానాలను ఇప్పుడు కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్నాయని, ఈ విధానాల వ్యయాన్ని భరించేస్థితి ప్రస్తుత ప్రపంచానికి లేనందున, మరో పతన ప్రమాదం ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.