ముంబై: ఆర్థికవేత్తలు, నిపుణుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కడి రేటు అక్కడే ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రస్తుతం రెపో 4 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో) మూడు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది.
అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలను వ్యక్తం చేస్తున్న ఆర్‌బీఐ, రేటు తగ్గింపునకు మొగ్గు చూపే సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ శుక్రవారమూ ఏకగ్రీవంగా ఇదే విధానాన్ని పునరుద్ఘాటించింది. తద్వారా వృద్ధికి తగిన మద్దతు ఆర్‌బీఐ నుంచి ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ తరువాత, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్వహించిన మొట్టమొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఇది.
ఏప్రిల్‌లో తదుపరి సమీక్ష
ఏప్రిల్ 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య ఎంపీసీ 28వ తదుపరి సమావేశం జరుగుతుంది.
మే నాటికి సీఆర్‌ఆర్ 4 శాతానికి ‘రివర్స్’
కాగా, రెపో రేటును తగ్గించని ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను తన వద్ద డిపాజిట్ చేసినప్పుడు ఇందుకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటు) కూడా 3.35 శాతంగానే కొనసాగుతుందని తన తాజా పాలసీలో ఆర్‌బీఐ స్పష్టంచేసింది. ఫిబ్రవరి తర్వాత ఈ రేటు కూడా 155 పాయింట్లు తగ్గి, 4.9 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చింది. ఇక బ్యాంకులు తమ నిధుల్లో తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద నిర్వహించాల్సిన మొత్తం క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్‌ఆర్)ను మార్చి 27 నాటికి 3.5 శాతానికి, మే 22 నాటికి 4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్‌బీఐ పాలసీ ప్రకటించింది. ప్రస్తుతం సీఆర్‌ఆర్ 3 శాతంగా ఉంది. అంటే బ్యాంకుల వద్ద ప్రస్తుతం ఉన్న నిధుల్లో మరికొంత మొత్తం ఆర్‌బీఐకి చేరుతుందన్నమాట. తద్వారా తన వద్దకు తిరిగి వచ్చే ‘మరిన్ని’ నిధులను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌కు అలాగే ఇతర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) చర్యలకు సెంట్రల్ బ్యాంక్ వినియోగించనుంది.
డిసెంబర్ నాటికి 4.3 శాతానికి ద్రవ్యోల్బణం
ఆర్‌బీఐ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2021–22 ఏప్రిల్–సెప్టెంబర్) సగటున ఈ రేటు 5 శాతానికి తగ్గుతుంది. మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4.3 శాతానికి దిగివస్తుంది. ఇదే కారణంగా కీలక రేటు విధానం సరళతరంగా ఉంచడానికే ఆర్‌బీఐ మొగ్గుచూపుతోంది. అంటే వడ్డీరేట్లు వ్యవస్థలో మరింత తగ్గడానికే అవకాశం ఉంది తప్ప, పెంచే యోచనలేదని భావించవచ్చు.
ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ దన్ను!
భారత్ ఆర్థిక వ్యవస్థ ఒకేఒక్క దిశలో.. అదీ పురోగమన బాటలో ఉన్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. 2021–22లో ఎకానమీ 10.5% వృద్ధిని (ఎకనమిక్ సర్వే 11% కన్నా తక్కువ కావడం గమనార్హం) నమోదు చేసుకుంటుందన్న భరోసాను ఆయన ఇచ్చారు. మౌలిక రంగం, ఆరోగ్యం వంటి కీలక రంగాల పునరుత్తేజానికి ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తగిన చర్యలను ప్రకటించిందని తెలిపారు. ఆయా అంశాల దన్నుతో 2021–22 మొదటి ఆరు నెలల్లో వృద్ధి 26.2%–8.3% శ్రేణిలో ఉంటుందని, 3వ త్రైమాసికంలో 6% వృద్ధి నమోదవుతుందని తెలిపింది.
బ్యాంకులకు నిధుల లభ్యత
అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకింగ్ ఆర్‌బీఐ నుంచి నిధులు పొందడానికి సంబంధించిన మార్జినల్ స్టాండింగ్ సౌలభ్యత (ఎంఎస్‌ఎఫ్)ను ఆర్‌బీఐ మరో ఆరు నెలలు పొడిగించింది. దీనివల్ల రూ.1.53 లక్షల కోట్లు బ్యాంకింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మార్చి నుంచీ ఈ పొడిగింపులను ఆర్‌బీఐ కొనసాగిస్తోంది.
రిటైల్ ఇన్వెస్టర్‌కు అందుబాటులో బాండ్ మార్కెట్
ప్రభుత్వ బాండ్ మార్కెట్‌లోకి రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా పాల్గొనడానికి అనుమతినిస్తూ, ఇందుకు సంబంధించి కీలక సంస్కరణాత్మక చర్యకు ఆర్‌బీఐ శ్రీకారం చుట్టింది. తద్వారా ఇలాంటి సౌలభ్యం కల్పిస్తున్న నిర్దిష్ట దేశాల జాబితాలో భారత్ కూడా చేరినట్లయ్యింది. ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు ప్రైమరీ ఆక్షన్లు, సాŠట్‌క్ ఎక్సే్చంజీల్లో నాన్–కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలుచేసే అవకాశం ఉంది. ఆర్‌బీఐ నిర్ణయం ప్రకారం ఇకపై ప్రత్యక్షంగా ఆన్‌లైన్ ద్వారా ఆర్‌బీఐ నుంచే ప్రభుత్వ బాండ్లను రిటైల్ ఇన్వెస్టర్ కొనుగోలు చేయగలుగుతాడు. దీనిని రిటైల్ డైరెక్ట్ అని వ్యవహరిస్తారు. ఆర్‌బీఐతో ప్రత్యక్షంగా నిర్వహించే గిల్ట్ అకౌంట్ల ప్రారంభం ద్వారా ఈ ఇన్‌స్ట్రమెంట్ లావాదేవీలు సాధ్యమవుతాయి. అసలు, వడ్డీ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ సెక్యూరిటీలు అత్యంత సురక్షితమైన సాధనాలు కావడం గమనార్హం. ఈ విధమైన చర్య తీసుకున్న మొదటి ఆసియా దేశం. అమెరికా, బ్రెజిల్‌ల్లో ఇప్పటికే పరోక్ష ఎంట్రీనే ఉంది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతాయని తాము భావించడం లేదని కూడా ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టం చేయడం గమనార్హం. కరోనా కష్టకాలాన్ని ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం మార్కెట్ రుణ సమీకరణలను బడ్జెట్ భారీగా పెంచిన నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. 2021–22లో ఈ మొత్తాలను స్థూలంగా రూ.12.05 లక్షల కోట్లుగా నిర్దేశించింది. అయితే 2020–21లో 64% పెంచి రూ.12.8 లక్షల కోట్లకు తాజా బడ్జెట్ సవరించిన సంగతి తెలిసిందే.
డిజిటల్ పేమెంట్ల వివాదాల పరిష్కారానికి యంత్రాంగం
ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల పెరిగేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఈ విభాగంలో వివాదాల సత్వర పరిష్కారంపైనా ఆర్‌బీఐ పాలసీ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి వివాదాల పరిష్కారానికి నిరంతరాయంగా పనిచేసే (24 గీ7) హెల్ప్‌లైన్ ఏర్పాటు ప్రతిపాదన చేసింది. దిగ్గజ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు ఇందుకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌బీఐ జారీచేసిన ‘డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీ’ ప్రకటన స్పష్టం చేసింది.
ఒకే దేశం– ఒకే అంబుడ్స్‌మన్
బ్యాంకింగ్ వివాదాల పరిష్కారం విషయంలో ఒకే దేశం– ఒకే అంబుడ్స్‌మన్ విధానాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. తద్వారా అంబుడ్స్‌మన్ పథకాలన్నింటినీ ఏకీకృతం చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు అనుగుణంగా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ వ్యవస్థను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ విషయంలో మూడు (బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీలు, డిజిటల్ లావాదేవీలు) అంబుడ్స్‌మన్ విధానాలు అమల్లో ఉన్నాయి. తాజా నిర్ణయం వల్ల మరింత సరళతర వ్యవస్థ రూపొందుతుందని ఆర్‌బీఐ గవర్నర్ వివరించారు. జూన్ 2021 నుంచీ తాజా వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఎన్‌బీఎఫ్‌సీలకు మరిన్ని నిధులు!
బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ (టీఎల్‌టీఆర్‌ఓ) ప్రయోజనాలను ఎన్‌బీఎఫ్‌సీలకూ విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలుసహా ద్రవ్య లభ్యత ఇబ్బందుల్లో ఉన్న రంగాలకు నిధులు సమకూర్చడానికి ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకింగ్ నుంచి టీఎల్‌టీఆర్‌ఓ కింద నిధులను పొందగలుగుతాయి. కరోనా మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో వివిధ రంగాలకు ద్రవ్య లభ్యత కల్పించే ఉద్దేశంతో బ్యాంకులకు టీఎల్‌టీఆర్‌ఓ స్కీమ్ కింద 2020 అక్టోబర్‌లో ఆర్‌బీఐ రూ. లక్ష కోట్లకు ప్రకటించింది. ఈ స్కీమ్ కింద తమకూ నిధులను అందించాలని ఎన్‌బీఎఫ్‌సీలు కొంతకాలంగా సెంట్రల్ బ్యాంక్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఎన్‌పీఏల వాస్తవికతపై మదింపు
బ్యాంకింగ్‌లో ఉన్న మొండిబకాయిల (ఎన్‌పీఏ) విషయంలో వాస్తవికతను ఆర్‌బీఐ తనకుతానుగా మరింత లోతుగా మదింపు చేస్తున్నట్లు శక్తికాంతదాస్ ప్రకటించారు. తద్వారా రుణ నాణ్యత విషయంలో స్పష్టమైన అభిప్రాయానికి రావడం జరుగుతుందని చెప్పారు.
పీఎంసీ బ్యాంక్.. మూడు ఆఫర్లు
పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) సంక్షోభ పరిష్కారానికి ముగ్గురు ఇన్వెస్టర్ల నుంచి తుది ఆఫర్లు అందినట్లు తనకు సమాచారం ఉన్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. వీటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల పటిష్టతకు ‘మధ్యకాలికంగా అవసరపడే’ ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించడానికి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
ఆలోచనాపూర్వక పాలసీ...
వృద్ధికి మద్దతు, రుణ నిర్వహణ, ద్రవ్య లభ్యత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఆలోచనాపూర్వక పాలసీ ఇదీ. వృద్ధే లక్ష్యంగా రూపొందించిన 2021–22 బడ్జెట్‌తో కలిసి తాజా విధాన నిర్ణయాలు కరోనా సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి.
– దినేష్ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్
రియల్టీకి ప్రయోజనం..
వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు తగిన నిర్ణయాలను ఆర్‌బీఐ తీసుకుంది. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలకు టీఎల్‌టీఆర్‌ఓ ప్రయోజనాలను విస్తరించడం రియల్టీసహా ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కొంటున్న పలు రంగాలకు దోహదపడుతుంది. తక్కువ వడ్డీరేట్ల వల్ల హౌసింగ్ రంగంలో డిమాండ్ ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
–శశిధర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ
రికవరీ పటిష్టతకు దోహదం
ఇప్పటికే ఎకానమీ రికవరీ వేగవంతమైంది. సెంట్రల్ బ్యాంక్ తాజా పాలసీ నిర్ణయాలు ఈ రికవరీ బాటను మరింత పటిష్టం చేస్తాయని భావిస్తున్నాం.చిన్న పరిశ్రమలకు ద్రవ్య లభ్యతకు పాలసీ తగిన నిర్ణయాలను తీసుకోవడం హర్షణీయం. సరళ విధానాన్ని పునరుద్ఘాటించడం వృద్ధికి భరోసాను ఇచ్చే అంశం.
–ఉదయ్ శంకర్, ఫిక్కీ ప్రెసిడెంట్
డిమాండ్ బలపడుతోంది...
కరోనా మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో తొలుత వ్యవస్థలో కనబడిన డిమాండ్ విషయంలో కొంత సంశయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యవస్థలో వాస్తవిక డిమాండ్ కనబడుతుంది. ఇదే ధోరణి కొనసాగి, పటిష్టమవుతుందని భావిస్తున్నాం. దీనితోపాటు వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యత తత్సంబంధ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సరళతర ఆర్థిక, ద్రవ్య విధానాలవైపే మొగ్గుచూపాలని పరపతి విధాన కమిటీ నిర్ణయించింది.
– శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్
Comments
Please login to add a commentAdd a comment