![Reserve Bank MPC to discuss inflation report on 3 Nov 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/28/RBI-MPC-MEETING.jpg.webp?itok=Crt8DVcQ)
ముంబై: గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నవంబర్ 3వ తేదీన ద్రవ్యోల్బణం సవాళ్లపై ప్రత్యేకంగా సమావేశం కానుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్‌బీఐ ఒక నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక రూపకల్పనపైనే నవంబర్ 3న జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ చర్చించనుందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
సెక్షన్ 45జెడ్ ఎన్ కింద...
సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్‌బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరగనుందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. తన చర్యల గురించి ఆర్‌బీఐ కేంద్రానికి వివరణ ఇవ్వడం 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. ఆర్‌బీఐ తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనున్న నేపథ్యంలో వచ్చేనెల 3న జరిగే ‘ద్రవ్యోల్బణంపై’ కీలక భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment