
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. 3, 5, 6 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ మçహావీర్ జయంతి సందర్భంగా సెలవు. ఈ సమావేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment