no changes
-
RBI Monetary Policy 2024: ఆర్బీఐ ఏడోసారీ
ముంబై: ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఏడోసారీ కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. రెపో రేటును ప్రస్తుత 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు పాలసీ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు మరికొన్నాళ్ల పాటు స్థిరంగా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. 2023 ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చలేదు. అంటే ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రేటు యథాతథంగా కొనసాగింది. తాజాగా రెపో రేటును యథాతథంగా ఉంచాలన్న ప్రతిపాదనను మానిటరీ పాలసీ కమిటీలోని (ఎంపీసీ) ఆరుగురు సభ్యుల్లో ఒకరు వ్యతిరేకించగా అయిదుగురు సభ్యులు సానుకూలత వ్యక్తపర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం స్థాయిలోనూ (2023–24లో 7.6 శాతం), ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలోను (2023–24లో 5.4 శాతం) ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ కొనసాగించింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా, ఆహార ధరల బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.66 శాతంగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం చొప్పున మొత్తం మీద సగటున 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. కాగా విదేశాల నుంచి స్వదేశానికి పంపించే డబ్బుకు (రెమిటెన్స్) సంబంధించి భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ► యూపీఐని వినియోగించడం ద్వారా త్వరలో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ సౌకర్యం ► ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం సులభతరానికి మొబైల్ యాప్ ప్రారంభం ► ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌కు అనుమతి ► డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిర శ్రేణిలో కదలాడుతోంది. ఆందోళక అక్కర్లేదు ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వ్యవస్థాగతంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు ► జూన్ 5 నుంచి 7 వరకూ 2024–25 ఆర్బీఐ రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ► సీబీడీసీ వాలెట్లను అందించడానికి నాన్–బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు అనుమతి ► బ్యాంకింగ్ ద్రవ్య సంబంధ ఇబ్బందులు పడకుండా లిక్విడిటీ కవరేజ్ రేషియో సమీక్ష ► 2023–24లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 41.6 బిలియన్ డాలర్లు. 2014–15 తర్వాత అత్యధికం పసిడి నిల్వల పెంపు విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టతలో భాగంగా పసిడి వాటాను భారత్ పెంచుకుంటుందని ఆర్బీఐ పేర్కొంది. మార్చి 29వ తేదీ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ హై 645.6 బిలియన్ డాలర్లకు చేరితే, అందులో పసిడి వాటా 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. సాగుపై చల్లని అంచనాలు తీవ్ర వేసవి, నీటి ఎద్దడి భయాందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఎకానమీపై చల్లని అంచనాలను వెలువరించింది. తగిన వర్షపాతం అంచనాల నేపథ్యంలో వ్యవసాయ, గ్రామీణ క్రియాశీలతలో సానుకూలతలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఆశించిన స్థాయిలో సాధారణ రుతుపవనాల అంచనాలు, మంచి రబీ గోధుమ పంట, ఖరీఫ్ పంటల మెరుగైన అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. బలమైన గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ– సేవల రంగంలో స్థిరమైన పురోగతి ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. అయితే దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య మార్గాలలో పెరుగుతున్న అంతరాయాలు దేశ ఎకానమీకి ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా పేర్కొంది. ఆహార ధరలపై అనిశ్చితి.. ఆహార ధరల్లో నెలకొన్ని అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది వేసవిలో కూరగాయల ధరల కదలికలపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వృద్ధికి ఊతమిస్తూనే మరోవైపు లకి‡్ష్యంచుకున్న స్థాయికి (4 శాతం) ద్రవ్యోల్బణం దిగి వస్తే కీలక రేట్లను తగ్గించడంపైనే ఎంపీసీ ప్రధానంగా దృష్టి పెడుతుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
క్రిప్టోలపై మా వైఖరిలో మార్పు లేదు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలను వ్యతిరేకించడంపై తమ వైఖరిలో ఎటువంటి మార్పూ లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. నియంత్రణల విషయంలో ఇతర దేశాలను ఆర్బీఐ అనుకరించబోదని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కు అమెరికాలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్ఈసీ అనుమతించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వేరే దేశానికి మంచిదైనంత మాత్రాన అది మన దేశానికి కూడా మేలు చేస్తుందనేమీ లేదు. కాబట్టి క్రిప్టోలపై రిజర్వ్ బ్యాంక్, అలాగే వ్యక్తిగతంగా నా అభిప్రాయాల్లో కూడా ఎటువంటి మార్పూ లేదు. (బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లను అనుమతించినప్పటికీ) వాటితో రిసు్కల విషయంలో జాగ్రత్త వహించాల్సిందేనని ఎస్ఈసీ ఒక హెచ్చరిక కూడా చేసిన సంగతిని గమనించాలి‘ అని ఆయన చెప్పారు. వర్ధమాన మార్కెట్లు, సంపన్న దేశాలు.. క్రిప్టోకరెన్సీల బాటలో వెళితే భారీ రిస్కులు తప్పవని, భవిష్యత్తులో వాటిని అధిగమించడం చాలా కష్టమవుతుందని దాస్ చెప్పారు. క్రిప్టో మేనియా భరించలేం.. వర్ధమాన మార్కెట్లు, ప్రపంచ దేశాలు ’క్రిప్టో మేనియా’ను భరించగలిగే పరిస్థితి లేదని దాస్ తెలిపారు. ‘గతంలో నెదర్లాండ్స్‌లో టులిప్ మేనియా ఏ విధంగా అసెట్ బబుల్‌కి దారి తీసిందో మనకు తెలుసు. దాదాపు అలాంటి పర్యవసానాలకే దారి తీసే క్రిప్టో మేనియాను వర్ధమాన మార్కెట్లు, ప్రపంచం భరించే పరిస్థితిలో లేవని నేను భావిస్తున్నాను‘ అని చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వ గత ట్రాక్ రికార్డు చూస్తే ఎన్నికల ముంగిట కేంద్రం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ .. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచే విధంగా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. యూపీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానం.. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానమని దాస్ ప్రశంసించారు. యూపీఐ వృద్ధి చెందేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని, పేమెంట్స్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగగలదని చెప్పారు. యూపీఐ సృష్టికర్త నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)ది గుత్తాధిపత్యంగా మారిందంటూ కొన్ని వర్గాల నుంచి వచి్చన విమర్శలపై దాస్ స్పందించారు. ఎన్‌పీసీఐకి పోటీగా మరేదీ రాకూడదని ఆర్బీఐ కోరుకోవడం లేదని, వాస్తవానికి అటువంటి సంస్థ ఏర్పాటు కోసం దరఖాస్తులను కూడా ఆహా్వనించిందని ఆయన తెలిపారు. కానీ, తమకు అందిన ప్రతిపాదనలు వేటిలోనూ కొత్తదనమేమీ కనిపించలేదన్నారు. అటు, దివాలా కోడ్ (ఐబీసీ) కింద బ్యాంకర్లు మొత్తం క్లెయిమ్‌లలో 32 శాతం బాకీలను రాబట్టుకోగలిగాయని దాస్ చెప్పారు. 2023 నాటికి ఐబీసీ కింద రూ. 9.92 లక్షల కోట్ల క్లెయిమ్‌లను అడ్మిట్ చేసుకోగా రుణదాతలు రూ. 3.16 లక్షల కోట్లు రాబట్టుకోగలిగారని దాస్ చెప్పారు. అయితే, సదరు చట్టం ఇప్పటిదాకా అమలైన తీరుతెన్నులను అధ్యయనం చేసిన మీదట కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మొండి పద్దు పరిష్కారానికి గణనీయంగా సమయం పడుతోందని, క్లెయిమ్‌లలో హెయిర్‌కట్ (మొండి బాకీ వసూలులో వదులుకుంటున్న మొత్తం) భారీగా ఉంటోందని ఐబీసీపై ప్రధానంగా రెండు విమర్శలు ఉన్నాయి. -
80 డాలర్ల కిందకు వస్తేనే పెట్రో ధరల సవరణ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదిన్నరగా ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 80 డాలర్ల దిగువనకు వచ్చి స్థిరపడినప్పుడే, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) తిరిగి రోజువారీ రేట్ల సవరణకు వెళ్లొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశ ఆయిల్ మార్కెట్లో ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థల వాటా 90 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 84 డాలర్ల వద్ధ చలిస్తోంది. 2022 ఏప్రిల్ 6 నుంచి రోజువారీ రేట్ల సవరణ నిలిచిపోయిన విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది ముడి చమురు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు వెళ్లినప్పటికీ, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయే కానీ, రేట్లను పెంచలేదు. ఆ తర్వాత బ్యారెల్ చమురు ధర 80డాలర్ల లోపునకు దిగి వచి్చనప్పటికీ, అంతకుముందు భారీ నష్టాలను చవిచూసిన కారణంగా అవి రేట్లను సవరించకుండా కొనసాగించాయి. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరల్లో చెప్పుకోతగ్గ మేర అస్థిరత నెలకొంది. ధరలు అనూహ్యంగా ఆటుపోట్ల మధ్య చలిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు లీటర్‌కు రూపాయి తగ్గించినా అందరూ అభినందిస్తారు. కానీ, అంతర్జాతీయంగా రేట్లు పెరిగిపోతే తిరిగి విక్రయ ధరలను అవి సవరించడానికి అనుమతిస్తారా? అన్నదే సందేహం’’అని ఓ అధికారి పేర్కొన్నారు. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ఉండే ధరలు కీలకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. సెపె్టంబర్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 93.54 డాలర్లుగా ఉంటే, అక్టోబర్‌లో 90 డాలర్లు, నవంబర్‌లో 83.42 డాలర్లకు దిగొచ్చింది. స్థిరత్వం లేనందునే.. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ విక్రయాలపై చమురు కంపెనీలకు లాభాలే వస్తున్నాయి. కానీ, ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. పైగా త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఒకవేళ అంత్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే, సవరించే పరిస్థితి ఉండదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థిరత్వం ఆధారంగా రేట్లపై ఆయిల్ కంపెనీలు నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ‘‘కొన్ని రోజులు డీజిల్ విక్రయాలపై లాభాలు వస్తుంటే, కొన్ని రోజులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకే విధమైన ధోరణి లేదు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర స్థిరంగా 80 డాలర్లకు దిగువన ఉన్నప్పుడు రేట్లను సవరించొచ్చని అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లోనూ మంచి లాభాలనే నమోదు చేశాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం నష్టపోయిన మొత్తం ఇంకా భర్తీ కాలేదని సదరు అధికారి తెలిపారు. క్రూడాయిల్ డిమాండ్‌కు భారత్, ఆఫ్రికా దన్ను అంతర్జాతీయంగా 2030 నాటికి రోజుకు 112 మిలియన్ బ్యారెళ్ల వినియోగం ∙ ఎస్అండ్పీ నివేదిక భారత్, ఆఫ్రికా దన్నుతో 2030 నాటికి అంతర్జాతీయంగా క్రూడాయిల్‌కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత 103 మిలియన్ బ్యారెళ్ల (రోజుకు) స్థాయి నుంచి 112 మిలియన్ బ్యారెళ్లకు చేరనుంది. ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వంట, వాహనాల్లో స్వచ్ఛ ఇంధనాల వినియోగం గణనీయంగా పెరగగలదని ఇండియా కంటెంట్ హెడ్ పులకిత్ అగర్వాల్ తెలిపారు. 2040 నాటికి భారత్‌లో క్రూడాయిల్ డిమాండ్ గరిష్ట స్థాయైన 7.2 మిలియన్ బ్యారెళ్లకు (రోజుకు) చేరుతుందని అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం ఇది రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది. నివేదిక ప్రకారం.. దేశీయంగా కెమికల్ కమోడిటీ ఉత్పత్తుల విభాగం 2023లో 7 శాతం, 2024లో 8 శాతం మేర వృద్ధి చెందనుంది. 80–90 డాలర్ల రేటు.. సమీప భవిష్యత్తులో ధరపరంగా చూస్తే బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయిలో తిరుగాడి 2024 మూడో త్రైమాసికం నాటికి 90 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఈడీ గౌరి జౌహర్ తెలిపారు. భారత్ వృద్ధి చెందే కొద్దీ పర్యావరణ అనుకూల ఇంధనాల వైపు క్రమంగా మళ్లుతుందని వివరించారు. ఇది టెక్నాలజీ ఆధారితమైనదిగా ఉంటుందని, ఇలాంటి సాంకేతికతలు భారీ స్థాయిలో వినియోగంలోకి రావాలంటే దేశీయంగాను, అంతర్జాతీయంగానూ నిధులు, విధానాలపరమైన మద్దతు అవసరమవుతుందని పేర్కొన్నారు. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, పారిశ్రామికోత్పత్తి ఊతంతో వచ్చే ఏడాది ఆసియాలో పెట్రోకెమికల్స్ డిమాండ్‌కి సంబంధించి భారత్ కాంతిపుంజంగా ఉండగలదని సంస్థ అసోసియేట్ డైరెక్టర్ స్తుతి చావ్లా వివరించారు. డిమాండ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ తగినంత సరఫరా ఉండటం, కొత్తగా ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వస్తుండటం వంటి అంశాల కారణంగా ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. ఫలితంగా మార్జిన్లపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశీ ఉత్పత్తి సంస్థలకు పెద్దగా ఊరట లభించకపోవచ్చని ఆమె పేర్కొన్నారు. -
షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్: జపాన్ ప్రధాని
టోక్యో: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ అన్ని జాగ్రత్తలతో టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జపాన్ ప్రధాని షింజో అబే స్పష్టం చేశారు. ఇటీవల టోక్యో మెగా ఈవెంట్‌ను వాయిదా వేయాలనే ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా స్పందించారు. షెడ్యూల్‌పై భరోసా కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వక్రీడల్ని వాయిదా వేయాలని సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జపాన్ ప్రధాని షింజో శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘మేం వైరస్‌పై అప్రమత్తంగా ఉన్నాం. సంబంధిత వర్గాలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. అయితే టోక్యోలో మెగా ఈవెంట్ నిర్వహణలో ఎలాంటి మార్పుల్లేవు. షెడ్యూల్ ప్రకారం పోటీలను నిర్వహిస్తాం. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా... పక్కా ప్రణాళికతో, వైరస్ వ్యాప్తిని నిరోధించే జాగ్రత్తలతో ఒలింపిక్స్‌ను ఘనంగా నిర్వహిస్తాం. విశ్వక్రీడలు విజయవంతమయ్యేందుకు అమెరికాతో కలిసి సమన్వయంతో పనిచేస్తాం’ అని అన్నారు. -
‘హెచ్1బీ ’ విధానంలో మార్పు లేదు
వాషింగ్టన్: విదేశీ నిపుణులకు జారీచేస్తున్న హెచ్1బీ వీసా విధానంలో ఎలాంటి మార్పు చేయలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగంలోని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికన్లు ఉద్యోగాలు నష్టపోకుండా, వేతనాలు తగ్గకుండా ఉండేలా ఈ విధానాన్ని ప్రస్తుతం సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 6న ఢిల్లీలో జరగనున్న భారత్–అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 సమావేశంలో హెచ్1బీ వీసా అంశాన్ని భారత్ లేవనెత్తే అవకాశముందని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలను నిరాకరిస్తూ హెచ్1బీ వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయన్న అంశంపై ప్రస్తుతం సమీక్ష కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ విషయమై విచారణ జరిపేందుకు వీలుగా ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులను గతంలో జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. -
‘ఎస్సీ, ఎస్టీ చట్టం’ తీర్పుపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో మార్పులు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కేంద్రం దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. దళితుల హక్కుల పరిరక్షణకు, ఆ వర్గాలపై దాడులకు పాల్పడే దోషులకు శిక్షలు విధించేందుకు 100 శాతం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. మార్చి 20 నాటి తన తీర్పును సమర్థించుకుంటూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఆ ఉత్తర్వులు జారీచేసినట్లు వెల్లడించింది. ఈ తీర్పు అనంతరం జరిగిన అల్లర్ల వల్ల ప్రాణ నష్టం జరిగినందున, తమ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టును కోరారు. పార్లమెంట్ రూపొందించిన చట్టాలను తోసిరాజని అత్యున్నత కోర్టు నిబంధనలు, మార్గదర్శకాలు జారీచేయరాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష కోరుతూ కేంద్రం ఏప్రిల్ 2న పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నిందితులను తక్షణం అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టు ప్రకటించిన తరువాత పాటించిన భారత్ బంద్‌లో హింస చెలరేగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. -
498 A చట్ట సవరణ అవసరం లేదు - మేనకా గాంధీ
న్యుఢిల్లీ: కేంద్ర స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ వరకట్న నిరోధక చట్టంలో మార్పులు అవసరం లేదని అభిప్రాయ పడుతున్నారు. మహిళలకు రక్షణగా ఉన్న చట్టం 498 A ఒక్కటేనని, అది యథాతథంగా ఉంటేనే మేలని ఆమె వ్యాఖ్యానించారు. ఈ చట్ట సవరణకు సంబంధించి తన దగ్గరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఆమె అన్నారు. దేశంలో అత్యధికంగా నమోదవుతున్న క్రిమినల్ కేసుల్లో వరకట్నహత్య కేసులు ఎక్కువగా ఉన్నాయన్న మహిళా సంఘాల వాదనతో ఆమె ఏకీభవించారు. వరకట్నం నిరోధక చట్టం(498 A) దుర్వినియోగమవుతోందన్న ఆరోపణలతో చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర గృహమంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో మేనకగాంధీ ఇలా స్పందించారు. కాగా 498 A కేసుల్లో పదిశాతం తప్పుడు కేసులు నమోదవుతున్నాయన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మహిళాసంఘాలు మండిపడ్డ సంగతి తెలిసిందే.