న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలను వ్యతిరేకించడంపై తమ వైఖరిలో ఎటువంటి మార్పూ లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. నియంత్రణల విషయంలో ఇతర దేశాలను ఆర్‌బీఐ అనుకరించబోదని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కు అమెరికాలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీ అనుమతించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘వేరే దేశానికి మంచిదైనంత మాత్రాన అది మన దేశానికి కూడా మేలు చేస్తుందనేమీ లేదు. కాబట్టి క్రిప్టోలపై రిజర్వ్ బ్యాంక్, అలాగే వ్యక్తిగతంగా నా అభిప్రాయాల్లో కూడా ఎటువంటి మార్పూ లేదు. (బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లను అనుమతించినప్పటికీ) వాటితో రిసు్కల విషయంలో జాగ్రత్త వహించాల్సిందేనని ఎస్‌ఈసీ ఒక హెచ్చరిక కూడా చేసిన సంగతిని గమనించాలి‘ అని ఆయన చెప్పారు. వర్ధమాన మార్కెట్లు, సంపన్న దేశాలు.. క్రిప్టోకరెన్సీల బాటలో వెళితే భారీ రిస్కులు తప్పవని, భవిష్యత్తులో వాటిని అధిగమించడం చాలా కష్టమవుతుందని దాస్ చెప్పారు.
క్రిప్టో మేనియా భరించలేం..
వర్ధమాన మార్కెట్లు, ప్రపంచ దేశాలు ’క్రిప్టో మేనియా’ను భరించగలిగే పరిస్థితి లేదని దాస్ తెలిపారు. ‘గతంలో నెదర్లాండ్స్‌లో టులిప్ మేనియా ఏ విధంగా అసెట్ బబుల్‌కి దారి తీసిందో మనకు తెలుసు. దాదాపు అలాంటి పర్యవసానాలకే దారి తీసే క్రిప్టో మేనియాను వర్ధమాన మార్కెట్లు, ప్రపంచం భరించే పరిస్థితిలో లేవని నేను భావిస్తున్నాను‘ అని చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వ గత ట్రాక్ రికార్డు చూస్తే ఎన్నికల ముంగిట కేంద్రం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ .. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచే విధంగా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు.
యూపీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానం..
ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానమని దాస్ ప్రశంసించారు. యూపీఐ వృద్ధి చెందేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని, పేమెంట్స్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగగలదని చెప్పారు. యూపీఐ సృష్టికర్త నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ)ది గుత్తాధిపత్యంగా మారిందంటూ కొన్ని వర్గాల నుంచి వచి్చన విమర్శలపై దాస్ స్పందించారు.
ఎన్‌పీసీఐకి పోటీగా మరేదీ రాకూడదని ఆర్‌బీఐ కోరుకోవడం లేదని, వాస్తవానికి అటువంటి సంస్థ ఏర్పాటు కోసం దరఖాస్తులను కూడా ఆహా్వనించిందని ఆయన తెలిపారు. కానీ, తమకు అందిన ప్రతిపాదనలు వేటిలోనూ కొత్తదనమేమీ కనిపించలేదన్నారు. అటు, దివాలా కోడ్ (ఐబీసీ) కింద బ్యాంకర్లు మొత్తం క్లెయిమ్‌లలో 32 శాతం బాకీలను రాబట్టుకోగలిగాయని దాస్ చెప్పారు.
2023 నాటికి ఐబీసీ కింద రూ. 9.92 లక్షల కోట్ల క్లెయిమ్‌లను అడ్మిట్ చేసుకోగా రుణదాతలు రూ. 3.16 లక్షల కోట్లు రాబట్టుకోగలిగారని దాస్ చెప్పారు. అయితే, సదరు చట్టం ఇప్పటిదాకా అమలైన తీరుతెన్నులను అధ్యయనం చేసిన మీదట కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మొండి పద్దు పరిష్కారానికి గణనీయంగా సమయం పడుతోందని, క్లెయిమ్‌లలో హెయిర్‌కట్ (మొండి బాకీ వసూలులో వదులుకుంటున్న మొత్తం) భారీగా ఉంటోందని ఐబీసీపై ప్రధానంగా రెండు విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment