emerging markets
-
క్రిప్టోలపై మా వైఖరిలో మార్పు లేదు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలను వ్యతిరేకించడంపై తమ వైఖరిలో ఎటువంటి మార్పూ లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. నియంత్రణల విషయంలో ఇతర దేశాలను ఆర్బీఐ అనుకరించబోదని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కు అమెరికాలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్ఈసీ అనుమతించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వేరే దేశానికి మంచిదైనంత మాత్రాన అది మన దేశానికి కూడా మేలు చేస్తుందనేమీ లేదు. కాబట్టి క్రిప్టోలపై రిజర్వ్ బ్యాంక్, అలాగే వ్యక్తిగతంగా నా అభిప్రాయాల్లో కూడా ఎటువంటి మార్పూ లేదు. (బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లను అనుమతించినప్పటికీ) వాటితో రిసు్కల విషయంలో జాగ్రత్త వహించాల్సిందేనని ఎస్ఈసీ ఒక హెచ్చరిక కూడా చేసిన సంగతిని గమనించాలి‘ అని ఆయన చెప్పారు. వర్ధమాన మార్కెట్లు, సంపన్న దేశాలు.. క్రిప్టోకరెన్సీల బాటలో వెళితే భారీ రిస్కులు తప్పవని, భవిష్యత్తులో వాటిని అధిగమించడం చాలా కష్టమవుతుందని దాస్ చెప్పారు. క్రిప్టో మేనియా భరించలేం.. వర్ధమాన మార్కెట్లు, ప్రపంచ దేశాలు ’క్రిప్టో మేనియా’ను భరించగలిగే పరిస్థితి లేదని దాస్ తెలిపారు. ‘గతంలో నెదర్లాండ్స్‌లో టులిప్ మేనియా ఏ విధంగా అసెట్ బబుల్‌కి దారి తీసిందో మనకు తెలుసు. దాదాపు అలాంటి పర్యవసానాలకే దారి తీసే క్రిప్టో మేనియాను వర్ధమాన మార్కెట్లు, ప్రపంచం భరించే పరిస్థితిలో లేవని నేను భావిస్తున్నాను‘ అని చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వ గత ట్రాక్ రికార్డు చూస్తే ఎన్నికల ముంగిట కేంద్రం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ .. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచే విధంగా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. యూపీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానం.. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ప్రపంచంలోనే అత్యుత్తమ పేమెంట్స్ విధానమని దాస్ ప్రశంసించారు. యూపీఐ వృద్ధి చెందేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని, పేమెంట్స్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగగలదని చెప్పారు. యూపీఐ సృష్టికర్త నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)ది గుత్తాధిపత్యంగా మారిందంటూ కొన్ని వర్గాల నుంచి వచి్చన విమర్శలపై దాస్ స్పందించారు. ఎన్‌పీసీఐకి పోటీగా మరేదీ రాకూడదని ఆర్బీఐ కోరుకోవడం లేదని, వాస్తవానికి అటువంటి సంస్థ ఏర్పాటు కోసం దరఖాస్తులను కూడా ఆహా్వనించిందని ఆయన తెలిపారు. కానీ, తమకు అందిన ప్రతిపాదనలు వేటిలోనూ కొత్తదనమేమీ కనిపించలేదన్నారు. అటు, దివాలా కోడ్ (ఐబీసీ) కింద బ్యాంకర్లు మొత్తం క్లెయిమ్‌లలో 32 శాతం బాకీలను రాబట్టుకోగలిగాయని దాస్ చెప్పారు. 2023 నాటికి ఐబీసీ కింద రూ. 9.92 లక్షల కోట్ల క్లెయిమ్‌లను అడ్మిట్ చేసుకోగా రుణదాతలు రూ. 3.16 లక్షల కోట్లు రాబట్టుకోగలిగారని దాస్ చెప్పారు. అయితే, సదరు చట్టం ఇప్పటిదాకా అమలైన తీరుతెన్నులను అధ్యయనం చేసిన మీదట కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మొండి పద్దు పరిష్కారానికి గణనీయంగా సమయం పడుతోందని, క్లెయిమ్‌లలో హెయిర్‌కట్ (మొండి బాకీ వసూలులో వదులుకుంటున్న మొత్తం) భారీగా ఉంటోందని ఐబీసీపై ప్రధానంగా రెండు విమర్శలు ఉన్నాయి. -
వర్ధమాన మార్కెట్ల ఇండెక్స్‌లో జీసెక్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి వర్ధమాన మార్కెట్ల(ఈఎం) ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ సెక్యూరిటీ(జీసెక్)లను చేర్చే ప్రణాళికల్లో ఉన్నట్లు గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం జేపీ మోర్గాన్ తాజాగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ బాండ్ల ద్వారా సమీకరించే రుణ వ్యయాలు తగ్గే వీలుంది. భారత ప్రభుత్వ బాండ్ల(ఐజీబీ)ను 2024 జూన్ 28 నుంచి 2025 మార్చి 31వరకూ 10 నెలలపాటు ఇండెక్సులో చేర్చనుంది. ఫలితంగా ఇండెక్స్ వెయిటేజీ ప్రతీ నెలా ఒక శాతంమేర పెరగనుంది. వెరసి జీబీఐ–ఈఎం గ్లోబల్ డైవర్సిఫైడ్ ఇండెక్స్‌లో ఇండియా వెయిటేజీ గరిష్టంగా 10 శాతాన్ని తాకవచ్చని అంచనా. ఇక జీబీఐ–ఈఎం గ్లోబల్ ఇండెక్స్‌లో సుమారు 8.7 శాతానికి చేరే వీలున్నట్లు జేపీ మోర్గాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పలు విదేశీ ఫండ్స్.. గ్లోబల్ ఇండెక్సుల ఆధారంగా పెట్టుబడులు చేపట్టే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు భారీగా పుంజుకునేందుకు ఇది సహకరించనుంది. అంతేకాకుండా విదేశాల నుంచి ప్యాసివ్ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలి వచ్చేందుకు వీలుంటుంది. పరిశ్రమలకు దేశీయంగా మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆహా్వనించదగ్గ పరిణామం జేపీ మోర్గాన్ తాజా ప్రణాళికలపై స్పందనగా.. ఇది ఆహా్వనించదగ్గ పరిణామమంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పట్టిచూపుతున్నదని వ్యాఖ్యానించారు. ఇది జేపీ మోర్గాన్ సొంతంగా తీసుకున్న నిర్ణయంకాగా.. భారత్‌కున్న భారీ వృద్ధి అవకాశాలు, స్థూల ఆర్థిక విధానాలపట్ల ప్రపంచ ఫైనాన్షియల్ సంస్థలు, మార్కెట్లకున్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. దేశీ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా భారీగా లాభపడుతున్న దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల మాదిరి భారత్ ప్రభుత్వ బాండ్లలోనూ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు లబ్ది పొందుతారని తెలియజేశారు. దేశీ కరెన్సీ బలపడేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఇండెక్సులలో లిస్టయ్యే వీటికి లాకిన్ అవసరం ఉండదని స్పష్టం చేశారు. 10 శాతం వాటా జేపీ మోర్గాన్ ఇండెక్స్‌కుగల 240 బిలియన్ డాలర్ల విలువలో ఇండియాకు 10 శాతం వాటా లభించనుంది. వెరసి 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలుంది. ఇది భారత్ బేస్ రేటులో మార్పులు తీసుకురానుండగా.. ఈల్డ్ భారీగా తగ్గనుంది. దీంతో భారత ప్రభుత్వ రుణ వ్యయాలు దిగిరానున్నట్లు ఏయూఎం క్యాపిటల్ నేషనల్ హెడ్ వెల్త్ ముకేష్ కొచర్ పేర్కొన్నారు. ఇక గ్లోబల్ ఇండెక్సులలో ఐజీబీకి చోటు లభించడం ద్వారా రిస్కులకంటే లాభాలే అధికంగా ఉండనున్నట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నెలకు 1.5–2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలున్నట్లు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. ఇది ప్రపంచస్థాయిలో భారత ప్రొఫైల్‌కు బలిమినివ్వడంతోపాటు.. దేశీయంగా మూలాలు మరింత పటిష్టంకానున్నట్లు అభిప్రాయపడింది. ప్రభుత్వ సెక్యూరిటీలకు డిమాండును మరింత పెంచనున్నట్లు యాంఫి పేర్కొంది. -
చైనాను బీట్ చేసి మరీ, దూసుకొచ్చిన భారత్
న్యూఢిల్లీ: పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారతదేశం చైనాను అధిగమించింది. దాదాపు 21 ట్రిలియన్ డాలర్ల అసెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 85 సావరిన్ వెల్త్ ఫండ్లు, 57 సెంట్రల్ బ్యాంకులు, 142 చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ల అభిప్రాయాల ప్రాతిపదికన ప్రపంచ పెట్టుబడి నిర్వహణ సంస్థ ఇన్వెస్కో వెల్లడించిన ఒక నివేదిక ఈ విషయాన్ని తెలిపించింది. ‘‘ఇన్వెస్కో గ్లోబల్ సావరిన్ అసెట్ మేనేజ్మెంట్ స్టడీ’’ పేరుతో వెలువడిన ఈ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ♦ భారతదేశలో మెరుగైన వ్యాపార పరిస్థితులు, రాజకీయ స్థిరత్వం, అనుకూలమైన జనాభా, నియంత్రణ పరమైన సానుకూలతలు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సంస్థలు, ఫండ్స్‌కు స్నేహపూర్వక వాతావరణం కలి్పస్తున్నాయి. ♦ ద్రవ్యోల్బణం– వాస్తవ వడ్డీ రేట్ల పరిస్థితుల ప్రాతిపదికన పెట్టుబడిదారులు తరచూ తమ పోర్ట్‌ఫోలియోలను రీకాలిబ్రేట్ (పునఃసమీక్ష, మదింపు) చేసుకుంటున్నారు. ♦ ‘‘మాకు భారతదేశం లేదా చైనాతో తగినంత పెట్టుబడులు ఏమీ లేవు. అయితే, వ్యాపార, రాజకీయ స్థిరత్వం పరంగా భారతదేశం ఇప్పుడు మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లు కనబడుతోంది. రెగ్యులేటరీ వ్యవస్థల పటిష్టంగా ఉండడం సావరిన్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న అంశం’’ అని మధ్యప్రాచ్యంలో ఉన్న ఒక సావరిన్ ఫండ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ♦ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పెరిగిన విదేశీ కార్పొరేట్ పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతున్న మెక్సికో, బ్రెజిల్‌తో సహా అనేక దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంటోంది. ♦ కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం) కట్టడికి, దేశీయ కరెన్సీల పటిష్టతలకు దోహదపడుతున్న అంశం ఇది. ♦ పెట్టుబడులను పెంచడానికి ఆకర్షణీయమైన వర్ధమాన మార్కెట్లలో ప్రస్తుతం భారత్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ♦ ద్రవ్యోల్బణం సవాళ్లు భారత్‌సహా భౌగోళికంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడి, వర్థమాన దేశాల మార్కెట్ బాండ్లు పెట్టుబడులకు తగిన సాధనాలుగా భావించవచ్చు. -
వెలవెలబోతున్న ఐపీవో మార్కెట్
న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) మార్కెట్లో సందడి కనిపించడం లేదు. జనవరి నెలలో కేవలం 12 ఐపీవోలు రాగా, ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.478 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. ఇందులోనూ రూ.323 కోట్లు కేవలం రెండు కంపెనీలు మెయిన్‌బోర్డ్ రూపంలో సమీకరించినవి కావడం గమనించొచ్చు. 10 ఎస్ఎంఈ కంపెనీలు కలసి రూ.155 కోట్లను సమీకరించాయి. గత డిసెంబర్లో ఐపీవోల ద్వారా కంపెనీలు సమీకరించిన మొత్తం రూ.5,120 కోట్లుగా ఉంది. ‘‘నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 10 శాతం పడిపోవడంతో సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. ఐపీవోలకు ఇది అనుకూల సమయం కాదు. అయినప్పటికీ ఆకర్షణీయమైన ధరతో వచ్చే ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. 2022లో రూ.57,000 కోట్లు గతేడాది మొత్తం మీద 38 కంపెనీలు ఐపీవో రూపంలో రూ.57,000 కోట్లను సమీకరించాయి. ఇందులో రూ.20,557 కోట్లు ఒక్క ఎల్ఐసీ ఐపీవోకి సంబంధించినవి కావడం గమనించొచ్చు. 2021లో 63 కంపెనీలు కలసి సమీకరించిన రూ.1.2 లక్షల కోట్లతో పోలిస్తే గతేడాది గణనీయంగా తగ్గడాన్ని గమనించొచ్చు. ఎల్ఐసీ ఐపీవో లేకుంటే నిధుల సమీకరణ గణాంకాలు మరింత తక్కువగా ఉండేవి. గతేడాది నుంచి ఈక్విటీ మార్కెట్లు అస్థిరతలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది జనవరిలో రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీలు రూ.644 కోట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) రూపంలో రూ.829 కోట్లు రాబట్టాయి. -
ఎమర్జింగ్ మార్కెట్లకు ట్రంప్ దెబ్బ?
ముంబై : అమెరికా అధ్యక్షుడు బిగ్గెస్ట్ ట్యాక్స్ కట్ ప్లాన్ ను బుధవారం విడుదల చేశారు. ఈ ట్యాక్స్ కట్ ప్లాన్ అమెరికా కంపెనీలకు మేజర్ బూస్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఎమర్జింగ్ మార్కెట్లపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతమున్న ఏడు ట్యాక్స్ బ్రాకెట్లను మూడింటికి కుందించింది. దీంతో పబ్లిక్ కార్పొరేషన్లకు విధించే పన్ను రేట్లు 35 శాతం నుంచి 15 శాతానికి దిగొచ్చాయి. అంతేకాక, చిన్న వ్యాపారాలకు 39.6 శాతం పన్ను రేటు, 15 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. అయితే విదేశాల్లో లాభాలు ఆర్జించి వాటిని దేశానికి తీసుకురావాలంటే మాత్రం 15 శాతం పన్నును భరించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు కనుక ఒకవేళ చట్టపరమైతే, ఎక్కువగా పన్నులు వేస్తున్న 20 దేశాల జాబితాల్లో తక్కువ పన్ను కలిగిన దేశంగా అమెరికా చరిత్రలోకి ఎక్కనుంది. దీంతో అమెరికా పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారుతుందని, ఇన్వెస్టర్లందరూ ఆ దేశంవైపు చూస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ కూడా బలపడనుందని వెల్లడవుతోంది. అనుకున్నంత మేర భారత్ కు దెబ్బతగలన్నప్పటికీ, ఇతర వర్ధమాన దేశాలకు మాత్రం నష్టమేనని ఐసీఐసీఐ సెక్యురిటీస్ లిమిటెడ్ రవి సుందర్ ముత్తుక్రిష్ణన్ తెలిపారు. పన్ను కోతతో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలున్నాయని ఇన్ప్లోలన్నీ అమెరికాకు వెళ్తాయని ఆయన చెప్పారు. కేవలం ఒక్క పేజీలోనే ట్రంప్ కార్యాలయం ఈ ప్రతిపాదనలను విడుదల చేసింది. అయితే సమగ్ర సమాచారం ఇవ్వడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమై, పెట్టుబడిదారులను నిరాశపరిచింది. మరోవైపు అమెరికా కంపెనీలకు ఎక్కువ లాభాలు, ఎమర్జింగ్ మార్కెట్లలో పెట్టుబడులకు దోహదం చేస్తాయని మైనార్టి కాంట్రారియన్ సిద్ధాంతం చెబుతోంది. ఇది సానుకూల సంస్కరణ అని పేర్కొంటోంది. అయితే ట్రంప్ ట్యాక్స్ కట్ ప్లాన్ పెట్టుబడిదారులను నిరాశపరచడంతో, రెండేళ్ల గరిష్టంలో ఎగిసిన ఆసియన్ షేర్లు జోరు తగ్గించాయి. -
స్మార్ట్ఫోన్లలోకి హెచ్‌పీ రీఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్యూటర్ ఉపకరణాల తయారీలో ఉన్న అమెరికా సంస్థ హ్యూలెట్-ప్యాకర్డ్(హెచ్‌పీ) స్మార్ట్ఫోన్ల మార్కెట్లోకి తిరిగి ప్రవేశిస్తోంది. ఆరు, ఏడు అంగుళాల స్క్రీన్ సైజులో రెండు ఫ్యాబ్లెట్లను కొద్ది రోజుల్లో ఆవిష్కరిస్తోంది. కస్టమర్లకు కొత్త అనుభూతి ఇచ్చే విధంగా ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా ఉన్న ఆన్‌డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పైన ఇవి రానున్నాయని సమాచారం. ఫ్యాబ్లెట్ల ధర రూ.12-15 వేల మధ్య ఉండనుంది. సిమ్‌ను సపోర్ట్ చేసే విధంగా 6 అంగుళాల ఫ్యాబ్లెట్ రానుంది. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో దూసుకెళ్తున్న భారత్, చైనా, ఫిలిప్పైన్స్ లక్ష్యంగా ఫ్యాబ్లెట్ల తయారీలో కంపెనీ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. హెచ్‌పీ రీ-ఎంట్రీ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి ధృవీకరించారు. అత్యుత్తమ ఉత్పాదనలతో రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ఫోన్ల వ్యాపారంలో భారీ అంచనాలతో అమెరికా కంపెనీ పామ్‌ను 2010 ఏప్రిల్‌లో 1.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన అనంతరం.. పామ్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘వెబ్ ఓఎస్’ ఆధారిత మోడళ్లను హెచ్‌పీ ప్రవేశపెట్టింది. స్పందన రాకపోవడంతో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల తయారీ నుంచి వైదొలుగుతున్నట్టు 2011 ఆగస్టు 18న ప్రకటించింది. పీసీ కంపెనీల పయనమిటే.. దేశంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలకు అనూహ్య డిమాండ్ ఉంటోంది. దీంతో పీసీల అమ్మకాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీ తయారీ సంస్థలు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ల తయారీలోకి అడుగిడుతున్నాయి. ప్రముఖ కంపెనీ లెనోవో 2012 నవంబరులో భారత స్మార్ట్ఫోన్ల రంగంలోకి ప్రవేశించింది. అందుబాటు ధరలో ఆన్‌డ్రాయిడ్ మోడళ్లను అందిస్తూ విజయవంతమైంది. ఈ కంపెనీ చైనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, రష్యా, వియత్నాంల తర్వాత భారత్‌లోకి అడుగు పెట్టింది. ఏసర్, డెల్, ఆసూస్లు సైతం స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లతో కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. తాజాగా హెచ్‌పీ సైతం అవకాశాలను అందుకోవాలని ఆత్రుతగా ఉంది.