స్మార్ట్‌ఫోన్లలోకి హెచ్‌పీ రీఎంట్రీ | HP Large Screen Smartphones on the Way for Emerging Markets | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్లలోకి హెచ్‌పీ రీఎంట్రీ

Published Thu, Jan 2 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM

HP పెద్ద స్క్రీన్ స్మార్ట్ఫోన్లు

HP పెద్ద స్క్రీన్ స్మార్ట్ఫోన్లు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్యూటర్ ఉపకరణాల తయారీలో ఉన్న అమెరికా సంస్థ హ్యూలెట్-ప్యాకర్డ్(హెచ్‌పీ) స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లోకి తిరిగి ప్రవేశిస్తోంది. ఆరు, ఏడు అంగుళాల స్క్రీన్ సైజులో రెండు ఫ్యాబ్లెట్‌లను కొద్ది రోజుల్లో ఆవిష్కరిస్తోంది. కస్టమర్లకు కొత్త అనుభూతి ఇచ్చే విధంగా ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో దాదాపు 80 శాతం వాటా ఉన్న ఆన్‌డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పైన ఇవి రానున్నాయని సమాచారం. ఫ్యాబ్లెట్‌ల ధర రూ.12-15 వేల మధ్య ఉండనుంది. సిమ్‌ను సపోర్ట్ చేసే విధంగా 6 అంగుళాల ఫ్యాబ్లెట్ రానుంది.

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో దూసుకెళ్తున్న భారత్, చైనా, ఫిలిప్పైన్స్ లక్ష్యంగా ఫ్యాబ్లెట్ల తయారీలో కంపెనీ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. హెచ్‌పీ రీ-ఎంట్రీ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి ధృవీకరించారు. అత్యుత్తమ ఉత్పాదనలతో రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్‌ఫోన్ల వ్యాపారంలో భారీ అంచనాలతో అమెరికా కంపెనీ పామ్‌ను 2010 ఏప్రిల్‌లో 1.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన అనంతరం.. పామ్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘వెబ్ ఓఎస్’ ఆధారిత మోడళ్లను హెచ్‌పీ ప్రవేశపెట్టింది. స్పందన రాకపోవడంతో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల తయారీ నుంచి వైదొలుగుతున్నట్టు 2011 ఆగస్టు 18న   ప్రకటించింది.
 పీసీ కంపెనీల పయనమిటే..
 దేశంలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలకు అనూహ్య డిమాండ్ ఉంటోంది. దీంతో పీసీల అమ్మకాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీ తయారీ సంస్థలు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌ల తయారీలోకి అడుగిడుతున్నాయి. ప్రముఖ కంపెనీ లెనోవో 2012 నవంబరులో భారత స్మార్ట్‌ఫోన్ల రంగంలోకి ప్రవేశించింది. అందుబాటు ధరలో ఆన్‌డ్రాయిడ్ మోడళ్లను అందిస్తూ విజయవంతమైంది. ఈ కంపెనీ చైనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, రష్యా, వియత్నాంల తర్వాత భారత్‌లోకి అడుగు పెట్టింది. ఏసర్, డెల్, ఆసూస్‌లు సైతం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్‌లతో కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. తాజాగా హెచ్‌పీ సైతం అవకాశాలను అందుకోవాలని ఆత్రుతగా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement