న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) మార్కెట్లో సందడి కనిపించడం లేదు. జనవరి నెలలో కేవలం 12 ఐపీవోలు రాగా, ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.478 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. ఇందులోనూ రూ.323 కోట్లు కేవలం రెండు కంపెనీలు మెయిన్‌బోర్డ్ రూపంలో సమీకరించినవి కావడం గమనించొచ్చు. 10 ఎస్‌ఎంఈ కంపెనీలు కలసి రూ.155 కోట్లను సమీకరించాయి. గత డిసెంబర్‌లో ఐపీవోల ద్వారా కంపెనీలు సమీకరించిన మొత్తం రూ.5,120 కోట్లుగా ఉంది. ‘‘నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 10 శాతం పడిపోవడంతో సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. ఐపీవోలకు ఇది అనుకూల సమయం కాదు. అయినప్పటికీ ఆకర్షణీయమైన ధరతో వచ్చే ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు.
2022లో రూ.57,000 కోట్లు
గతేడాది మొత్తం మీద 38 కంపెనీలు ఐపీవో రూపంలో రూ.57,000 కోట్లను సమీకరించాయి. ఇందులో రూ.20,557 కోట్లు ఒక్క ఎల్‌ఐసీ ఐపీవోకి సంబంధించినవి కావడం గమనించొచ్చు. 2021లో 63 కంపెనీలు కలసి సమీకరించిన రూ.1.2 లక్షల కోట్లతో పోలిస్తే గతేడాది గణనీయంగా తగ్గడాన్ని గమనించొచ్చు. ఎల్‌ఐసీ ఐపీవో లేకుంటే నిధుల సమీకరణ గణాంకాలు మరింత తక్కువగా ఉండేవి. గతేడాది నుంచి ఈక్విటీ మార్కెట్లు అస్థిరతలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది జనవరిలో రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీలు రూ.644 కోట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) రూపంలో రూ.829 కోట్లు రాబట్టాయి.
వెలవెలబోతున్న ఐపీవో మార్కెట్
Published Thu, Mar 16 2023 6:25 AM | Last Updated on Thu, Mar 16 2023 6:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment