
కోల్‌కతా: సూపర్‌మార్కెట్ చెయిన్ మోర్ రిటైల్ .. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులను వినియోగించుకోనుంది. కంపెనీ ఎండీ వినోద్ నంబియార్ ఈ విషయాలు తెలిపారు. వేల్యుయేషన్, మార్కెట్ పరిస్థితులు బట్టి వచ్చే 12–18 నెలల్లో ఐపీవోకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత ప్రమోటర్లు సుమారు 10 శాతం వాటా విక్రయించవచ్చని పేర్కొన్నారు.
2030 నాటికి స్టోర్ల సంఖ్యను 3,000కు పెంచుకునేందుకు, సంస్థను రుణరహితంగా మార్చుకునేందుకు ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను ఉపయోగించుకోనున్నట్లు నంబియార్ చెప్పారు. గత 120 రోజుల్లో ఫ్యామిలీ ఆఫీసుల నుంచి సంస్థ రూ. 150 కోట్లు సమీకరించినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీకి సుమారు రూ. 500 కోట్ల రుణభారం ఉంది. సమరా క్యాపిటల్, అమెజాన్ సంస్థలు మోర్ రిటైల్‌కు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి. కంపెనీ కొనుగోలు కోసం రూ. 4,300 కోట్లు వెచి్చంచడంతో పాటు గత అయిదేళ్లలో వ్యాపార విస్తరణకు రెండు సంస్థలు రూ. 900 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేశాయి.