
రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థల నియంత్రణ(కవచ్) సంబంధ సర్వీసులందించే క్వాండ్రాంట్ ఫ్యూచర్ టెక్ (Quadrant Future Tek) పబ్లిక్ ఇష్యూ (IPO) ఈ నెల 7న ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూకి రూ. 275–290 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 290 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.
రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లను విక్రయించనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 150 కోట్లవరకూ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు(స్పెషాలిటీ కేబుల్ విభాగంపై) వెచ్చించనుంది. రూ. 24 కోట్లు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అభివృద్ధికి, మరో రూ. 24 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.
కంపెనీ ప్రధానంగా రైల్వే రక్షణ సంబంధ వ్యవస్థల అభివృద్ధిపై పనిచేస్తోంది. అంతేకాకుండా రైల్వే రోలింగ్ స్టాక్, నౌకా(డిఫెన్స్) పరిశ్రమల్లో వినియోగించే కేబుళ్లను సైతం తయారు చేస్తోంది. స్పెషాలిటీ కేబుల్స్ విభాగంలో 2024 సెప్టెంబర్ 30కల్లా 1,887 మెట్రిక్ టన్నుల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది.