న్యూఢిల్లీ: ఇటీవల సరికొత్త రికార్డుల బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ప్రైమరీ మార్కెట్‌కు సైతం జోష్ నిస్తున్నాయి. దీంతో కొద్ది నెలలుగా పలు కంపెనీలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) వెళ్తున్నాయి. ప్రస్తుత కేలండర్ ఏడాది(2021)లో ఇప్పటికే ఐపీవోల ద్వారా వివిధ సంస్థలు భారీ స్థాయిలో నిధులు సైతం సమీకరించాయి. ఈ బాటలో తాజా గా మరో 4 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తలుపు తట్టాయి. వివరాలు ఇలా..
గో ఫ్యాషన్ ఇండియా
ఐపీవోకు అనుమతించమంటూ గో కలర్స్ బ్రాండుతో మహిళల దుస్తులను రూపొందిస్తున్న గో ఫ్యాషన్ ఇండియా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1,28,78,389 షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీలో ప్రస్తుతం పీకేఎస్, వీకేఎస్ కుటుంబ ట్రస్ట్‌లకు విడిగా 28.74 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. సమీకరించిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా మహిళలు ధరించే చుడీదార్లు, లెగ్గింగ్స్, ధోతీలు, ట్రౌజర్లు తయారు చేస్తోంది.
వీఎల్‌సీసీ హెల్త్‌కేర్
వెల్‌నెస్, బ్యూటీ ప్రొడక్టుల దేశీ కంపెనీ వీఎల్‌సీసీ హెల్త్‌కేర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లతోపాటు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు మరో 89.22 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రాంతంతోపాటు దేశీయంగా మరిన్ని వెల్‌నెస్ క్లినిక్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది.
హాట్‌న్యూస్: మస్త్ ఫీచర్లతో మడత ఫోన్లు.. చూసేయండి
పారదీప్ ఫాస్ఫేట్స్
ఐపీవోకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ ఫెర్టిలైజర్ కంపెనీ పారదీప్ ఫాస్ఫేట్స్ సెబీకి దరఖాస్తు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,255 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 12 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. వీటిలో జువారీ మారోక్ ఫాస్ఫేట్స్ 75,46,800 షేర్లు ఆఫర్ చేయనుండగా, కేంద్ర ప్రభుత్వం 11.24 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో జువారీ మారోక్‌కు 80.45 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం 19.55 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను గోవాలోని ఎరువుల తయారీ యూనిట్ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ఇన్‌స్పిరా ఎంటర్‌ప్రైజ్
పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఐటీ సొల్యూషన్లు అందించే ఇన్‌స్పిరా ఎంటర్‌ప్రైజ్ ఇండియా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ప్రకాష్ జైన్‌తోపాటు, మంజులా జైన్, ప్రకాష్ జైన్ కుటుంబ ట్రస్ట్‌లు విక్రయానికి ఉంచనున్నాయి. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వ్యక్తిగతంగా ప్రకాష్ జైన్ రూ. 131 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుండగా.. ట్రస్ట్ తరఫున రూ. 277 కోట్లు, మంజులా జైన్ ట్రస్ట్ రూ. 92 కోట్లు చొప్పున ఈక్విటీని విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను రుణ చెల్లింపులతోపాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment