లీడర్‌షిప్ హైరింగ్ సేవల్లో ఉన్న ఈఎంఏ పార్ట్‌నర్స్ (EMA Partners)ఐపీఓ (IPO) జనవరి 17న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.117–124 గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధర వద్ద రూ.76.01 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 53.34 లక్షల తాజా ఈక్విటీలను జారీ చేయనుంది.
ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు క్రిష్ణన్ సుదర్శన్, సుబ్రమణియన్‌లు 7.96 లక్షల షేర్లను విక్రయించనున్నారు. క్యూఐబీలకు 50%, ఎన్‌ఐఐలకు 15%, రిటైల్ ఇన్వెస్టర్లకు 35% వాటా కేటాయింపు జరిగింది. ఐపీఓ పూర్తయిన తర్వాత ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లో షేర్లు లిస్ట్ కానున్నాయి.
సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, ఐటీ విభాగపు మౌలిక అభివృద్ధికి, నాయకత్వ బృందాన్ని పెంచుకునేందుకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఇండోరియంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రిజిస్ట్రార్‌గా బిగ్‌షేర్ సర్వీసెస్ వ్యవహరిస్తున్నాయి.
13న లక్ష్మీ డెంటల్ ఐపీఓ
ఆర్బిమెడ్ ప్రమోట్ చేస్తున్న లక్ష్మీ డెంటల్ తాజాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.314 కోట్లకు పైగా అందుకుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్,, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్, కోటక్ ఎంఎఫ్, మిరే అసెట్ ఎంఎఫ్, టాటా ఎంఎఫ్, బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, నోమురా, గోల్డ్‌మన్ సాక్స్, అల్ మెహ్వార్ కమర్షియల్స్ ఇన్వెస్ట్‌మెంట్స్, నాటిక్సిస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ తదితర 31 కంపెనీలు వీటిలో ఉన్నాయి.
యాంకర్ ఇన్వెస్టర్లకు లక్ష్మీ డెంటల్ ఒక్కొక్కటి రూ.428 చొప్పున 73.39 లక్షల షేర్లు కేటాయించింది. కంపెనీ ఐపీవో జనవరి 13న ప్రారంభమై 15న ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.407–428గా నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా రూ.138 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. రూ.560 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment