స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి..కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు వాటికి దరఖాస్తు చేయడం ద్వారా షేర్లను కొనుగోలు చేయడం. అలాకాకుండా మార్కెట్లో నేరుగా షేర్లను కొనుగోలు చేయడం రెండోది.
పబ్లిక్ ఇష్యూ విషయానికొస్తే...
పబ్లిక్ ఇష్యూనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా కంపెనీలు తమ ఎదుగుదల క్రమంలో నిధులు అవసరమై ప్రజల నుంచి వాటిని సమీకరించాలనే ఉద్దేశంతో షేర్లను జారీ చేయడం ద్వారా మొట్టమొదటిసారి ఐపీఓకు వస్తాయి. ఇలా ఐపీఓకి వచ్చే కంపెనీలు ముందుగా లీడ్ మేనేజర్లను నియమించుకుంటాయి. వీరు ఆ కంపెనీ ఐపీఓ వ్యవహారాలు సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు విస్తరణ, మూలధన అవసరాలు, అప్పులు తీర్చడం కోసం వాడుకుంటాయి. ఐపీఓ తర్వాత సంస్థలు వాటాదారులకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది.
పబ్లిక్ ఇష్యూకి వచ్చే కంపెనీలు తమ షేర్లకు ఒక ముఖవిలువ (ఫేస్‌వాల్యూ) నిర్ధారిస్తాయి. అప్పటికి ఆ కంపెనీస్థాయి, అది చేస్తున్న వ్యాపారం, మార్కెట్లో దాని ఉత్పత్తులకు ఉండే డిమాండ్ వంటి విభిన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని సంస్థకు ఒక విలువను నిర్ధారిస్తాయి. కంపెనీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ని షేర్లు జారీ చేయాలో (కంపెనీలో ఎంత వాటా అమ్మకానికి పెట్టాలో) నిర్ణయించుకుంటాయి. దానికి అనుగుణంగా సెబీని సంప్రదించి తమ ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ఒకసారి సెబీ ఇష్యూకి క్లియరెన్స్ ఇచ్చి, ఎక్స్ఛేంజీల ఆమోదం పొందిన తర్వాత మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. సాధారణంగా 3-5 రోజులపాటు ఇష్యూ అందుబాటులో ఉంటుంది. వివిధ సందర్భాలు, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 10 రోజులలోపు ఇష్యూ పూర్తి చేయవచ్చు.
ఇన్వెస్టర్లు పరిగణించాల్సిన విషయాలు..
1. ఇష్యూ లాట్ సైజ్
2. ఇష్యూధర.. అంటే కంపెనీ ఒక్కో లాట్‌కు ఎన్ని షేర్లు ఆఫర్ చేస్తుంది.. ఎంత ధరకు ఆఫర్ చేస్తుంది అనే వివరాలు.
ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ (సాధారణ ఇన్వెస్టర్లు) ఒక్కొక్కరు రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉదా: x అనే కంపెనీ రూ.100-120 ధరల శ్రేణితో ఇష్యూకి వచ్చింది అనుకుందాం. సాధారణంగా గరిష్ట ధరకే షేర్ల కేటాయింపు జరుగుతూ ఉంటుంది కాబట్టి రూ.120 పరిగణనలోకి తీసుకుందాం. అలాగే 100 షేర్లను ఒక లాట్‌గా నిర్ధారించి జారీ చేస్తుంది అనుకుంటే మనం రిటైల్ ఇన్వెస్టర్లం కాబట్టి రూ.120 గరిష్ట ధరకు మనకు షేర్లు అలాట్ అవ్వాలంటే గరిష్టంగా 16 లాట్‌ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మార్కెట్‌లో ఆ ఇష్యూకి ఉండే డిమాండ్, దానికి అనుగుణంగా సబ్‌స్క్రిప్షన్ ఏ స్థాయిలో జరిగింది అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని మనకు షేర్ల అలాట్‌మెంట్ జరుగుతుంది. 10 రెట్లు, 20 రెట్లు.. ఇలా సబ్‌స్రైబ్ అయితే మనకు కేటాయించే లాట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఒక్కోసారి ఒకటే లాట్ అలాట్ కావొచ్చు. ఒక్కోసారి అది కూడా కాకపోవచ్చు.
షేర్లు అలాంట్ అవ్వాలంటే..
మీరు దరఖాస్తు చేసుకోవాలనుకునే కంపెనీ ఇష్యూకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిసి, ఎలాగైనా కొన్ని షేర్లు మీకు అలాట్ అవ్వాలంటే మీ కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ప్యాన్ వివరాలతో ఇలా వివిధ అకౌంట్లతో దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో షేర్లు అలాట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అంతే తప్పా మీపేరుపైనే ఒకటి కంటే ఎక్కవ లాట్‌ల కోసం దరఖాస్తు చేసుకోకూడదు. అలా చేస్తే మొదటికే మోసం జరుగుతుంది. అధికమొత్తంలో షేర్లు అలాట్ అవ్వకపోగా, కనీసం ఒక లాట్‌కూడా వచ్చే అవకాశం ఉండదని గుర్తుంచుకోవాలి.
రిస్కులులేవా..?
ఇష్యూ పూర్తయిన మూడు రోజుల తర్వాత బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో సదరు కంపెనీ షేర్లు లిస్ట్ అవుతాయి. ఐపీఓకి దరఖాస్తు చేయడం వల్ల రిస్కులు, ప్రయోజనాలూ ఉంటాయి. ఐపీఓలో అలాట్ అయినా షేర్లు లిస్టింగ్ రోజున పడిపోతే ఆ నష్టాన్ని భరించడంకానీ, వాటిని కొనసాగించడంగానీ చేయాల్సి ఉంటుంది. అదే లాభాల్లో ట్రేడ్ అవుతుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్.. గీత దాటొద్దు..!
త్వరలో ఐపీఓకి రానున్న కంపెనీలు..
వెంటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్
ఇష్యూ ప్రారంభం 20 డిసెంబర్
ఇష్యూ ముగింపు 24 డిసెంబర్
మమతా మెషినరీ లిమిటెడ్
ఇష్యూ ప్రారంభం 19 డిసెంబర్
ఇష్యూ ముగింపు 23 డిసెంబర్
ట్రాన్స్‌రైల్ లైటింగ్ లిమిటెట్
ఇష్యూ ప్రారంభం 19 డిసెంబర్
ఇష్యూ ముగింపు 23 డిసెంబర్
-బెహరా శ్రీనివాసరావు
స్టాక్ మార్కెట్, నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment