క్రెడిట్‌ కార్డ్‌.. గీత దాటొద్దు..! | Usage Of Credit Cards, Explanation of credit cards Special Story | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డ్‌.. గీత దాటొద్దు..!

Published Mon, Dec 9 2024 4:20 AM | Last Updated on Mon, Dec 9 2024 7:43 AM

Usage Of Credit Cards, Explanation of credit cards Special Story

మితిమీరిన వినియోగం మంచిది కాదు 

క్రెడిట్‌ లిమిట్‌లో 50 శాతంలోపే ఉండాలి 

లేదంటే క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం 

తప్పదంటేనే క్రెడిట్‌ ఓవర్‌ లిమిట్‌ సదుపాయం 

పరిమితి పెంచుకోవడం మెరుగైన మార్గం     

క్రెడిట్‌ కార్డు యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్‌ కార్డులు 10 కోట్ల మార్క్‌ను దాటగా.. వచ్చే ఐదేళ్లలో (2029 మార్చి నాటికి) 20 కోట్లకు పెరుగుతాయని పీడబ్ల్యూసీ అంచనా. యూపీఐ దెబ్బకు డెబిట్‌ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చెల్లింపులకు వచ్చే సరికి యూపీఐ తర్వాత క్రెడిట్‌ కార్డుల హవాయే నడుస్తోంది. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్‌ ఉంటేనే యూపీఐ. 

బ్యాలన్స్‌ లేకపోయినా క్రెడిట్‌ (అరువు)తో కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డులు వీలు కల్పిస్తాయి. అందుకే వీటి వినియోగం పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. కానీ, క్రెడిట్‌ కార్డ్‌లను ఇష్టారీతిన వాడేయడం సరికాదు. ఇది క్రెడిట్‌ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్‌లో రుణాల అర్హతకు గీటురాయిగా మారుతుంది. రుణ ఊబిలోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. క్రెడిట్‌ కార్డుపై లిమిట్‌ ఎంత? ఎంత వ్యయం చేయాలి? గీత దాటితే ఏమవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది.    

ఇప్పడంతా డిజిటల్‌ చెల్లింపులే. కరోనా విపత్తు తర్వాత నుంచి నగదు చెల్లింపులు గణనీయంగా తగ్గిపోయాయి. వినియోగదారులు నగదుకు బదులు క్రెడిట్‌ కార్డుతో షాపింగ్‌కు వెళితే మరింత ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పైగా గతంతో పోలిస్తే జీనవశైలి ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో క్రెడిట్‌ కార్డుల స్వైపింగ్‌ మితిమీరుతోంది. పండుగల సందర్భంగా ఆకర్షించే ఆఫర్లు కూడా ఇందుకు ఒక కారణం. కార్డు ఉంది కదా అని చెప్పి ఇష్టారీతిన ఖర్చు చేస్తే.. తిరిగి చెల్లించేటప్పుడు ఆ భారం మోయాల్సి వస్తుంది. పైగా క్రెడిట్‌ స్కోర్‌ను ఇది ప్రతికూలంగా ప్రభావితం చేయగలదు. అందుకే క్రెడిట్‌ కార్డు వినియోగం విషయమై ప్రతి ఒక్కరూ అవగాహనతో, బాధ్యతతో వ్యవహరించాలి.  

క్రెడిట్‌ లిమిట్‌ 
కార్డుపై ఉన్న గరిష్ట వ్యయ పరిమితి ఇది. ఏ కాలంలో అయినా ఈ మేరకు గరిష్టంగా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్న మేర తదుపరి గడువు నాటికి పూర్తిగా చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, రిస్క్‌ ఆధారంగా క్రెడిట్‌ లిమిట్‌ను కార్డు జారీ సమయంలోనే బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తుంటాయి. కార్డుపై వినియోగం, చెల్లింపుల తీరు ఆధారంగా తర్వాతి కాలంలో ఈ లిమిట్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది.  

వినియోగం 
కార్డుపై క్రెడిట్‌ లిమిట్‌ రూ.లక్ష ఉందనుకుంటే.. గరిష్టంగా రూ.లక్ష వరకు వినియోగించుకోవచ్చని అర్థం. ఇలా పూర్తి పరిమితి మేర ప్రతి నెలా కార్డు ఖర్చు చేస్తుంటే అది క్రెడిట్‌ స్కోర్‌కు ఏ మాత్రం మంచిది కాదు. క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి (సీయూఆర్‌) అని ఒకటి ఉంటుంది. రూ.లక్ష క్రెడిట్‌ లిమిట్‌ ఉన్నప్పుడు ఒక నెలలో రూ.90,000 ఖర్చు పెట్టారని అనుకుందాం. అప్పుడు సీయూఆర్‌ 90 శాతం అవుతుంది. ‘‘అధిక క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి రుణ దాహార్తిని తెలియజేస్తుంది. ఇది క్రెడిట్‌ స్కోర్‌ను తగ్గించేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సీయూఆర్‌ దాటి ఖర్చు చేయడం తప్పు కాదు. 

కానీ అది అరుదుగానే ఉండాలి. సీయూఆర్‌ 30 శాతం మించకుండా చూసుకుంటేనే మంచిది. కార్డుపై బకాయి మొత్తాన్ని గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. ఇలా చేయడం వల్ల క్రెడిట్‌ స్కోర్‌ మెరుగవుతుంది. దీనివల్ల తర్వాతి కాలంలో క్రెడిట్‌ లిమిట్‌ను సులభంగా పెంచుకోవచ్చు. రుణాలను తక్కువ వడ్డీ రేటుకు పొందొచ్చు’’అని బ్యాంక్‌ బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి సూచించారు. సాధారణంగా సీయూఆర్‌ 70 శాతం మించితే అది క్రెడిట్‌ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఖర్చులపై నియంత్రణలేమిని, బలహీన ఆర్థిక పరిస్థితులను ఇది తెలియజేస్తుంది.  

క్రెడిట్‌ స్కోర్‌పై రిమార్క్‌  
కార్డు బకాయిల తిరిగి చెల్లింపులు తీరు క్రెడిట్‌ స్కోర్‌పై 35 శాతం మేర ప్రభావం చూపిస్తుందని బ్యాంక్‌ బజార్‌ చెబుతోంది. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ కొనసాగాలంటే సకాలంలో బకాయిలు చెల్లించడం ఎంతో అవసరం. లేదంటే అధిక వడ్డీలకుతోడు, ఆలస్య రుసుములు చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్‌ స్కోర్‌ కూడా తగ్గిపోతుంది. క్రెడిట్‌ వినియోగ రేషియో అధికంగా ఉన్నా, క్రెడిట్‌ ఓవర్‌ లిమిట్‌కు వెళ్లినా కానీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రెడిట్‌ స్కోరును లెక్కించే సందర్భంగా తక్కువ సీయూఆర్‌ను సానుకూలంగా చూస్తామని క్రిఫ్‌ హైమార్క్‌ (క్రెడిట్‌ బ్యూరో) మాజీ ఎండీ సంజీత్‌ దావర్‌ తెలిపారు.

క్రెడిట్‌ ఓవర్‌ లిమిట్‌ 
ఒక బిల్లు సైకిల్‌ పరిధిలో క్రెడిట్‌ లిమిట్‌ను మొత్తం వాడేస్తే.. తదుపరి చెల్లింపులకు అవకాశం ఉండదు. కానీ, క్రెడిట్‌ స్కోర్‌ అధికంగా ఉన్న వారికి ఇందులో వెసులుబాటు ఉంది. క్రెడిట్‌ ఓవర్‌ లిమిట్‌ సదుపాయం వినియోగించుకోవచ్చు. కార్డు లిమిట్‌ పూర్తయినప్పటికీ.. అదే కార్డుపై మరింత లిమిట్‌ తీసుకోవచ్చు. ఇందుకు అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ‘‘కొన్ని సందర్భాల్లో మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న కస్టమర్లకు తాత్కాలికంగా క్రెడిట్‌ లిమిట్‌ను బ్యాంక్‌లు పెంచుతాయి. ఇందుకోసం ముందుగానే సంప్రదించాలి. 

కొన్ని కార్డు సంస్థలు క్రెడిట్‌ లిమిట్‌ మించిపోయినప్పటికీ, లావాదేవీలను అనుమతిస్తుంటాయి. కాకపోతే అందుకు ఓవర్‌ లిమిట్‌ ఫీజు వడ్డిస్తాయి. పెనాల్టీ వడ్డీ రేట్లను కొన్ని అమలు చేస్తాయి. ఇవి సాధారణ రేట్ల కంటే అధికంగా ఉంటాయి’’అని ఆదిల్‌ శెట్టి వివరించారు. క్రెడిట్‌ ఓవర్‌ లిమిట్‌పై చార్జీలు అన్ని క్రెడిట్‌ కార్డు సంస్థల్లో ఒకే విధంగా ఉండవు. కొన్ని బ్యాంక్‌లు 2.5 శాతం లేదా కనీసం రూ.550, కొన్ని సంస్థలు 3 శాతం చొప్పున చార్జీ వసూలు చేస్తున్నాయి. క్రెడిట్‌ ఓవర్‌ లిమిట్‌ ఆప్షన్‌తో కొన్ని ప్రత్యేక కార్డులు కూడా ఉన్నాయి. లేని వారు బ్యాంక్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో తప్పించి, దీన్నొక అలవాటుగా మార్చుకోకూడదు.    

ఒకరికి ఎన్ని కార్డులు 
‘‘అందరికీ ఒక్కటే సూత్రం వర్తించదు. ఆర్థిక పరిస్థితులు, ఖర్చు చేసే అలవాట్లపై ఎన్ని క్రెడిట్‌ కార్డులు అన్నది ఆధారపడి ఉంటుంది. బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, సకాలంలో చెల్లింపులు చేసే వారు ఎన్ని కార్డులు అయినా కలిగి ఉండొచ్చు. కాకపోతే ఒకరికి రెండు లేదా మూడు కార్డులు మించి ఉండరాదన్నది సాధారణ సూత్రం’’అని మై మనీ మంత్ర వ్యవస్థాపకుడు రాజ్‌ఖోస్లా వివరించారు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు వినియోగించేందుకు తక్కువ లిమిట్‌తో ఒక కార్డు, ఇతర ముఖ్యమైన, అత్యవసరాల కోసం మరొక కార్డు కలిగి ఉండొచ్చని ప్లాన్‌ అహెడ్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు విశాల్‌ ధావన్‌ సూచించారు.  

మినిమం డ్యూ 
ఒక నెలలో కార్డుపై చేసిన వ్యయం మొత్తాన్ని బిల్లు జారీ చేసిన నాటి నుంచి 20 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం చెల్లించే వెసులుబాటు లేకపోతే, మినిమం డ్యూ అమౌంట్‌ అని ఉంటుంది. అంత చెల్లించినా సరిపోతుంది. మొత్తం బిల్లులో ఇది సుమారు 5 శాతంగా ఉంటుంది. అప్పుడు మిగిలిన బకాయిపై నెలవారీ 3 శాతానికి పైనే వడ్డీ రేటు పడిపోతుంది. ఇతర చార్జీలు కూడా చెల్లించుకోవాలి. మినిమం డ్యూ అమౌంట్‌ చెల్లించడం చెల్లింపుల వైఫల్యం కిందకు రాదు. బకాయి మొత్తాన్ని వెంటనే చెల్లించలేని వారు పెద్ద లావాదేవీలను ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. లేదంటే లోన్‌ ఎగైనెస్ట్‌ క్రెడిట్‌ కార్డ్‌ (కార్డుపై రుణం) ఆఫర్‌ను వినియోగించుకోవడం ద్వారా రుణం పొంది సత్వర చెల్లింపుల నుంచి గట్టెక్కొచ్చు.  

క్రెడిట్‌ లిమిట్‌ 
కార్డుపై ఉన్న గరిష్ట వ్యయ పరిమితి ఇది. ఏ కాలంలో అయినా ఈ మేరకు గరిష్టంగా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్న మేర తదుపరి గడువు నాటికి పూర్తిగా చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, రిస్క్‌ ఆధారంగా క్రెడిట్‌ లిమిట్‌ను కార్డు జారీ సమయంలోనే బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తుంటాయి. కార్డుపై వినియోగం, చెల్లింపుల తీరు ఆధారంగా తర్వాతి కాలంలో ఈ లిమిట్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది.  

లిమిట్‌ పెంచుకోవచ్చు.. 
క్రెడిట్‌ స్కోర్‌ మెరుగ్గా ఉండి, కార్డుపై అధిక వ్యయం చేసే వారికి ఉచితంగా లిమిట్‌ను పెంచుకునేందుకు బ్యాంక్‌లు ఆఫర్లు ఇస్తుంటాయి. లేదంటే ఎవరికి వారే స్వచ్ఛందంగా కార్డు సంస్థను సంప్రదించి లిమిట్‌ పెంచాలని కోరొచ్చు. వినియోగం 70–80 శాతం దాటుతున్న వారు ప్రస్తుత కార్డుపైనే లిమిట్‌ను పెంచుకోవడం లేదంటే మరో కార్డు తీసుకుని వ్యయాలను రెండు కార్డుల మధ్య వైవిధ్యం చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. దీనివల్ల క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో (సీయూఆర్‌)ను తగ్గించుకోవచ్చు.  

స్వీయ నియంత్రణ 
క్రెడిట్‌ కార్డుపై వాస్తవ రుణ పరిమితి (క్రెడిట్‌ లిమిట్‌) కంటే తక్కువ లిమిట్‌ను ఎవరికి వారే విధించుకోవచ్చు. దీనివల్ల వ్యయాలపై నియంత్రణ సాధ్యపడుతుంది. బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీ యాప్‌ ద్వారా క్రెడిట్‌ లిమిట్‌లో మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.3 లక్షల క్రెడిట్‌ లిమిట్‌ ఉన్నప్పుడు రూ.లక్ష పరిమితిని సొంతంగా నిర్ణయించుకోవచ్చు. అటువంటప్పుడు కార్డుపై ఒక నెలలో వ్యయం రూ.లక్షకు చేరగానే తదుపరి చెల్లింపులు తిరస్కరణకు గురవుతాయి. ఎలాంటి పెనాల్టీ చార్జీలు పడవు. ఖర్చులు చేయిదాటిపోకుండా, గుర్తు చేసేందుకు ఈ సదుపాయం అక్కరకు వస్తుంది. యాప్‌లోకి వెళ్లి ఈ పరిమితిలో ఎప్పుడైనా మార్పులు చేసుకోవచ్చు.  

లాభ–నష్టాలు.. 
→ అధిక లిమిట్‌ అత్యవసర వైద్యం, ప్రయాణాలప్పుడు ఆదుకుంటుంది.  
→ కార్డులు పెరిగేకొద్దీ వాటిపై వ్యయాలు కూడా ఇతోధికం అవుతుంటాయి. అన్నీ కలసి రుణ భారాన్ని పెంచేస్తాయి.  
→ స్వీయ నియంత్రణ లేనట్టయితే, అధిక క్రెడిట్‌ లిమిట్‌ విషయంలో హద్దులేనట్టుగా వ్యవహరించినట్టయితే రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఎదురవుతుంది.  
→ కార్డులు ఎక్కువైనప్పుడు వాటి వేర్వేరు గడువు తేదీలను గుర్తు పెట్టుకుని, సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. 
→ చెల్లింపుల వైఫల్యాలు, అధిక క్రెడిట్‌ వినియోగం క్రెడిట్‌ స్కోర్‌ను తగ్గించేస్తాయి.   
→ బాధ్యతతో, వివేకంతో వినియోగిస్తే క్రెడిట్‌ కార్డు ద్వారా తగ్గింపు ఆఫర్లు పొందొచ్చు. వినియోగంపై రివార్డు పాయింట్లను కూడా పొందొచ్చు. క్రెడిట్‌ స్కోరును బలోపేతం చేసుకోవచ్చు.  
      
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement